బుల్లి తెరపై యాంకర్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు సుమ. ఏ ఛానల్ చూసినా యాంకర్‌గా తనే దర్శనమిస్తుంది. సినిమా ఫంక్షన్లలోనూ తనే కనిపిస్తుంది. బడా హీరో ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే.. సుమ ఎంట్రీ తప్పని సరి. తెలుగునాట అత్యధిక పారితోషికం తీసుకొనే యాంకర్ తనే. నిత్యం బిజీగా ఉండే సుమ.. ఇప్పుడు తన తనయుడి కెరీర్‌పై దృష్టి పెట్టింది.
సుమ అబ్బాయి రోషన్ కనకాల ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి రవికాంత్ పేరేపు దర్శకుడు. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలతో ఆకట్టుకొన్న రవికాంత్ పేరేపు.. ఇప్పుడు రోషన్ ని లాంచ్ చేసే బాధ్యతలు స్వీకరించాడు. ఇదో రొమాంటిక్ కామెడీ డ్రామా. ఇలాంటి కథల్ని రవికాంత్ బాగా తెరకెక్కిస్తాడని పేరు. కృష్ణ అండ్ హిజ్ లీల అలాంటి సినిమానే. రోషన్ తొలి సినిమాకి రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడ్ని పట్టుకురావడం వెనుక సుమ మాస్టర్ ప్లాన్ ఉందన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ చిత్రానికి సుమ నిర్మాత కాకపోవొచ్చు. కానీ.. తెర వెనుక.. ఆమె సలహాలూ, సంప్రదింపులు చాలా ఉన్నాయట. ఇండస్ట్రీలో సుమకు మంచి లింకులున్నాయి. అవన్నీ ఇప్పుడు వాడుకొనే అవకాశం దక్కింది. సుమ నటిగా జయమ్మ పంచాయితీ అనే ఓ సినిమా రూపుదిద్దుకొంది. ఆర్థికంగా ఈ సినిమా రాణించలేదు కానీ, సుమకు మంచి పేరొచ్చింది. ఈ సినిమా పబ్లిసిటీకి పవన్ కల్యాణ్ ని సైతం వాడుకోగలిగింది సుమ. మరి సుపుత్రుడి సినిమా అంటే.. అంతకంటే ఎక్కువే చేయొచ్చు. అందుకే ఈ సినిమాపై ఇప్పుడు మార్కెట్ వర్గాల ఫోకస్ పడిపోయింది.
ALSO READ: దటీజ్ చిరు: విలన్ వైద్యం కోసం రూ.40 లక్షలు