ENGLISH

అర్జున్ రెడ్డి మూవీ రివ్యూ & రేటింగ్స్

25 August 2017-12:09 PM

తారాగణం: విజయ్ దేవరకొండ, శాలిని పాండే
సంగీతం: రధాన్
ఛాయాగ్రహణం: రాజు తోట
ఎడిటర్: శశాంక్
నిర్మాణ సంస్థ: భద్రకాళి పిక్చర్స్
నిర్మాత: ప్రణయ్ రెడ్డి
రచన-దర్శకత్వం: సందీప్ రెడ్డి

యావరేజ్ యూజర్ రేటింగ్:3.5/5

మన తెలుగు సినిమాల్లో ఎక్కువ‌గా డ్రామా క‌నిపిస్తుంటుంది.  స‌న్నివేశాన్ని స‌హ‌జత్వానికి కాస్త దూరంగా తీసుకెళ్లి చూపిస్తుంటారు. బోల్డ్‌గా చెప్పాల్సిన చోట కూడా.. కాస్త కోటింగు వేసి చెబుతుంటారు. తీసేవాళ్లూ, చూసేవాళ్లూ దాదాపుగా ఇదే థీరీకి అల‌వాటు ప‌డిపోయారు. అందులోంచి కాస్త బ‌య‌ట‌కు వ‌స్తే ఎలా ఉంటుంది?  స‌హ‌జంగా, ఉన్న‌ది ఉన్న‌ట్టుగా ఓ సినిమా, అందులోనూ ప్రేమ‌క‌థ తీస్తే ఎలా ఉంటుంది?  అనే ఆలోచ‌న‌లోంచి పుట్టిన సినిమా `అర్జున్ రెడ్డి`.

ఈ సినిమాలో లిప్ లాక్‌లు ఉంటాయి. సెక్స్ ఉంటుంది, బూతు ఉంటుంది. తాగుడు వ్య‌వ‌హారాలు ఉంటాయి. అన్నీ ప‌చ్చి ప‌చ్చిగా. కాక‌పోతే.. అదేం చూడ‌కూడ‌ని వ్య‌వ‌హారంలా అనిపించ‌దు.   `ఇప్ప‌టి జ‌నాలు కూడా ఇలానే ఉంటున్నారు క‌దా` అనిపించేలానే తెర‌పై స‌న్నివేశాలు సాగిపోతుంటాయి. అర్జున్ రెడ్డి.. స‌క్సెస్ అదే. మ‌రి టోట‌ల్‌గా చూస్తే ఈ సినిమా ఎలా ఉంది?

* క‌థ‌...

అర్జున్ రెడ్డి (విజ‌య్ దేవ‌ర‌కొండ‌)  మెడిసిన్ చ‌దువుతుంటాడు. కోపం ఎక్కువ‌. చిటికెలో రియాక్ట్ అయిపోతుంటాడు. కొత్త‌గా కాలేజీలో చేరిన ప్రీతి (షాలిని) చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. ప్రేమిస్తాడు. త‌న‌కు ద‌గ్గ‌ర‌వుతాడు. కీర్తి కూడా అర్జున్‌ని ప్రేమిస్తుంది. ఇద్ద‌రూ శారీరకంగానూ ద‌గ్గ‌ర‌వుతారు. అయితే అనుకోని ప‌రిస్థితుల్లో కీర్తిని మ‌రొక‌రితో పెళ్ల‌యిపోతుంది. దాంతో అర్జున్ మందు, డ్ర‌గ్స్‌కి బాసిన అవుతాడు. డాక్ట‌ర్ గిరీ చేస్తున్నా.. మ‌ద్యం మ‌త్తులోనే తేలుతుంటాడు. చివ‌రికి కుటంబానికీ, ఎంతో ఇష్ట‌ప‌డిన వృత్తికీ దూరం అవ్వాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. అర్జున్ రెడ్డి తిరిగి ఎలా కోలుకొన్నాడు??  త‌న క‌థ ఏ తీరానికి చేరింది అనేదే మిగిలిన సినిమా.

* నటీన‌టులు..

ప్ర‌తీ సినిమాలో ఒక‌టో రెండో పాత్ర‌లు బాగుంటాయి. వాళ్లే బాగా చేస్తారు. ఈ సినిమాలో ప్ర‌తీ క్యారెక్ట‌రు బాగుంది. ఆ పాత్ర‌కు ఎంత కావాలో అంతే చేశారు. అయితే అన్ని మార్కులూ... విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఇవ్వాల‌నిపిస్తుంది. నాలుగో సినిమాలో ఇంత మెచ్యూరిటీ చూస్తే... రాబోయే త‌రంపై భ‌రోసా పెరుగుతుంది. విజ‌య్ ఆల్టిమెట్ పెర్‌ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టేశాడు. అమ్మాయి ఏం త‌క్కువ తిన‌లేదు. హైటు త‌క్కువే గానీ.. ఏమాత్రం లోటు చేయ‌లేదు. శివ పాత్ర‌లో న‌టించిన కుర్రాడు.. మ‌రో ప్రియ‌ద‌ర్శిలా అనిపించాడు. త‌న న‌ట‌న చాలా స‌హ‌జంగా ఉంది. ఇలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుణ్ణు క‌దా అనిపిస్తుంది.

* విశ్లేష‌ణ‌...

అర్జున్ రెడ్డి క‌థ కాదు. ఓ ప్రేమికుడి జీవితం. ఆ ప్రేమికుడికి కోపం, యాటిట్యూడ్‌, బ‌లుపు ఉంటే, వ్య‌సనాల‌కు బాసిన అయితే ఎలా ఉంటుంద‌న్న పాయింట్‌కి తెర రూపం. ఓ ర‌కంగా దేవ‌దాసు లాంటి స్టోరీ అన్న‌మాట‌. కాక‌పోతే ప్రేమంటే, ప్రేమించిన అమ్మాయి అంటే గౌర‌వం. అందుకే త‌న‌కి మ‌రొక‌రికితో పెళ్ల‌యిపోయినా `అది నా పిల్ల‌రా` అంటుంటాడు. అమ్మాయిల గురించి అస‌భ్యంగా మాట్లాడితే ఒప్పుకోడు. `మూడు రోజుల స‌మ‌స్య‌`నీ ప్రేమ కోణంలోనే, ప్రేమికుడి కోణంలోనే చూస్తాడు.  త‌న చుట్టూ ఎంతోమంది అమ్మాయిలు ఉన్నా ముట్ట‌కోడు. ముట్టుకొన్నా.. అది ల‌వ్ అంటే ఒప్పుకోడు. ఓ విధంగా అర్జున్ రెడ్డి బ‌లం... హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌. దాన్ని అత్యంత బోల్డ్‌గా చూపించిన విధానం. ప్రారంభ స‌న్నివేశాలు చూస్తే మ‌తిపోతుంది. ఓ క్యారెక్ట‌ర్‌ని ఇంత బోల్డ్‌గా చూపించొచ్చా అనిపిస్తుంది. కాలేజీ జీవితం, మెడికోల ప్ర‌వ‌ర్త‌న‌, ర్యాగింగ్ ఇవ‌న్నీ స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా చూపించాడు. సినిమాటిక్ లిబ‌ర్టీస్ ఏమాత్రం తీసుకోకుండా న‌డిపించిన క‌థ ఇది. హీరో హీరోయిన్ల ల‌వ్ స్టోరీ తీర్చిదిద్దిన విధానం కూడా ఆక‌ట్టుకొంటుంది. ఓ విధంగా అర్జున్ రెడ్డి ని కంటే.. దీప్తి పాత్ర‌నే ఎక్కువ ప్రేమిస్తారు. అస‌లు హీరోయిన్ మెటీరియ‌లే కాని ఓ అమ్మాయిని... హీరో కంటే ఎక్కువ స్థాయిలో చూపించిన ద‌ర్శ‌కుడికీ, ఆ పాత్ర‌లో పండిపోయిన ఆ అమ్మాయికీ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ చూడండి.. ఈ సినిమాలో బోల్డ్ నెస్‌కి అది ప‌రాకాష్ట‌గా కనిపిస్తుంది.  ద్వితీయార్థం మొత్తం ఎమోష‌న‌ల్ డ్రైవ్‌. హీరో పాత్ర ఇలా ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తుందో అనిపిస్తుంటుంది. ఏంటిలా చేస్తున్నాడు??  ఎందుకిలా  ప్ర‌వ‌ర్తిస్తున్నాడు?  అని మ‌న చేత అనిపించేలా చేశాడు.  హీరో్ ఎంత తాగుబోతు అయినా.. తన ఫిలాస‌ఫీని వ‌దులుకోలేదు. అదే ఈ సినిమాని ఓ కొత్త కోణంలో చూపిస్తుంది.  ల‌వ్ ప‌క్క‌న పెడితే... హీరోకీ - శివ పాత్ర‌కూ ఉన్న ఫ్రెండ్ షిప్‌ని బ‌లంగా చూపించాడు. అయితే `నీలాంటి స్నేహితుడు దొర‌క‌లేదురా..` అంటూ హ‌గ్గులు ఇచ్చుకోవ‌డం లాంటి రొటీన్ మెలో డ్రామా జోలికి అస్స‌లు వెళ్లలేదు. అలాంటి డైలాగుల‌తో పుట్టించాల్సిన ఫీల్‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌తీ చోటా పండించ‌గ‌లిగాడు. ఆఖ‌ర్లో హీరోయిన్ చెప్పే డైలాగులు, ఆ సీన్‌లోని ఎమోష‌న్ క‌చ్చితంగా క‌దిలిస్తుంది.  

* సాంకేతికంగా...

ఇది ద‌ర్శ‌కుడి సినిమా. మిగిలిన విభాగాల్నీ త‌నే న‌డిపించుకొన్నాడు. తెలుగు తెర‌కు మ‌రో ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడు వ‌చ్చిన‌ట్టే. సినిమాని మ‌రో కోణంలో చూపించే కుర్రాడు దొరికిన‌ట్టే. నేప‌థ్య సంగీతం, పాట‌లు అన్నీ క‌థ‌కు అనుగుణంగా సాగాయి. ముద్దు సన్నివేశాలు, అందులోని ఘాడ‌త కుటుంబ ప్రేక్ష‌కుల‌కు రుచించ‌వు. ఆమాట‌కొస్తే వాళ్ల‌కు న‌చ్చ‌ని వ్య‌వ‌హారాలు ఇందులో చాలా క‌నిపిస్తాయి. కాక‌పోతే ఇది కుర్రాళ్ల కోసం తీసిన సినిమా. వాళ్లే ఈ సినిమాని భుజాల‌పై వేసుకొంటారు.

* ప్ల‌స్ పాయింట్స్‌

+ న‌టీన‌టుల ప్ర‌తిభ‌
+ సన్నివేశాల చిత్రీక‌ర‌ణ‌
+ సంభాష‌ణ‌లు
+ క్లైమాక్స్‌

* మైన‌స్ పాయింట్స్‌

- నిడివి

* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్:  అర్జున్ రెడ్డి.. అద‌ర‌గొట్టేశాడు

రివ్యూ బై  శ్రీ

ALSO READ: అర్జున్ రెడ్డి ఇంగ్లీష్ రివ్యూ కోసం క్లిక్ చేయండి