ENGLISH

ఎస్పీ బాలు ‘పేరు’కి అలా గౌరవమివ్వాలంటోంది

28 September 2020-17:00 PM

హీరోయిన్‌ ఆషిమా నర్వాల్‌ ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో ఓ రెండు సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ, వార్తల్లో వ్యక్తిగా మారింది. దానిక్కారణం, ఇటీవల తనువు చాలించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పట్ల అభిమానంతో సంచలన వ్యాఖ్యలు చేయడమే. హైద్రాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన కేబుల్‌ బ్రిడ్జి ఇటీవల ప్రారంభమైన విషయం విదితమే. ఎస్పీ బాలు సినీ పరిశ్రమకి అందించిన సేవలకు గుర్తుగా ఈ కేబుల్‌ బ్రిడ్జికి ఆయన పేరు పెట్టాలంటూ ఓ ప్రతిపాదనను సోషల్‌ మీడియా వేదికగా ప్రస్తావించింది ఆషిమా నర్వాల్‌.

 

అయితే, ఆషిమా నర్వాల్‌ పెద్దగా తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవడంతో ఆమె డిమాండ్‌ తెలుగు నాట అంతగా హైలైట్‌ అవలేదు. కానీ, తమిళ సినీ అభిమానులు మాత్రం ఈ డిమాండ్‌ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ కూడా ఈ తరహా డిమాండ్‌ని తెరపైకి తెస్తే బావుంటుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. హైద్రాబాద్‌లోని దుర్గం చెరువుపై నిర్మించిన ఈ కేబుల్‌ బ్రిడ్జి, హైద్రాబాద్‌ మణిహారం.. అంటూ కితాబులందుకుంటోంది. తెలుగు సినీ కళామతల్లికి ఎస్పీ బాలు అందించిన సేవలు చిరస్మరణీయం. తెలుగు, తమిళ, హిందీ సహా మొత్తం 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు ఎస్పీ బాలు. ఆయన పేరుని, ఈ కేబుల్‌ బ్రిడ్జికి పెట్టడమంటే.. బాలుని మనం గౌరవించుకున్నట్లే అవుతుంది.

ALSO READ: కృష్ణ సినిమాల‌కు బాలు ఎందుకు పాడ‌లేదు?