బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన సినిమా 'చావా'. అక్కడ రికార్డు వసూళ్లు కొల్లగొడుతోంది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి, విడుదల చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని తీసుకొస్తోంది. గీతా ఆర్ట్స్ కాబట్టి, ప్రమోషన్లు బాగానే చేస్తుంది. ఆ విషయంలో డౌటు లేదు. అయితే ఈ సినిమాకు గానూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారని, ఆయన ప్రధాన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పారని వార్తలొచ్చాయి. నిజంగా ఎన్టీఆర్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చి ఉంటే బాగానే ఉండేది. కానీ.. అలాంటి ప్రయత్నాలేం చేయలేదని బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చారు.
చావా తెలుగు డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. ఈనెల 7నే విడుదల. ఇంత షార్ట్ గ్యాప్‌లో ఎన్టీఆర్ లాంటి హీరోతో డబ్బింగ్ చెప్పించడం కుదరని పని. అందుకే బన్నీ వాస్ కూడా "మేం ఏ హీరోతోనూ డబ్బింగ్ చెప్పించలేదు. అలాంటి ప్రయత్నాలు కూడా చేయలేదు. కాకపోతే.. ప్రతీ పాత్రకూ సరైన డబ్బింగ్ ఆర్టిస్టుతోనే డబ్బింగ్ చెప్పించాం. ఆ విషయంలో రాజీ పడలేదు" అని బన్నీ వాస్ చెప్పుకొచ్చారు. దాంతో ఎన్టీఆర్ 'చావా' కు వాయిస్ అందించారన్న విషయంలో నిజం లేదని తేలిపోయింది.
'చావా' లో రష్మిక కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఆమెను తెలుగు ప్రమోషన్ల కోసం తీసుకురావాలని గీతా ఆర్ట్స్ గట్టిగా ప్రయత్నిస్తోంది. కాకపోతే రష్మిక ఫుల్ బిజీగా ఉంది. ఆమె ఒక్క రోజు కాల్షీట్ దొరకాలన్నా గగనమే. 'గీత గోవిందం' చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థే నిర్మించింది. ఈ సంస్థతో రష్మికకు మంచి అనుబంధం ఉంది. దాని కోసమైనా రష్మిక ఈ సినిమా ప్రమోషన్లకు వస్తుందేమో చూడాలి.
ALSO READ: రష్మిక కోసం బాలీవుడ్ లో 100 కోట్ల ప్రాజెక్ట్