ENGLISH

బిగ్‌బాస్‌ అంటే ఎవరికీ లెక్కలేదంతే.!

30 September 2020-13:00 PM

బిగ్‌బాస్‌ రియాల్టీ షో ఈ సారి చాలా చాలా చప్పగా సాగుతోంది. అడ్డగోలుగా నడుస్తున్నాయి టాస్క్‌లన్నీ. ఏ టాస్క్‌ చేయాలి.? అన్నదానిపై హౌస్‌మేట్స్‌ మధ్య తీవ్ర గందరగోళం నెలకొంటోంది. దాన్ని సరిదిద్దే ప్రయత్నమూ బిగ్‌బాస్‌ చేయడంలేదు. మరోపక్క, కంటెస్టెంట్స్‌ హద్దులు మీరి తిట్టుకుంటున్నారు. అబిజీత్‌, సోహెల్‌ మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధం సందర్బంగా ‘మగతనం’ గురించిన చర్చ వచ్చింది. ఇలాంటి వాటిని బిగ్‌బాస్‌ ఎందుకు ఎంకరేజ్‌ చేస్తున్నాడు? అనే విమర్శ బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌ నుంచి వినిపిస్తోంది.

 

హౌస్‌లో దొంగతనం తప్పా.? తప్పు కాదా.? అన్నదానిపై బిగ్‌బాస్‌ నుంచి ఎలాంటి వివరణా లేదు. హ్యామన్స్‌, రోబోట్స్‌ టాస్క్‌లో ‘కిడ్నాప్‌’ సబబేనని తేలిన దరిమిలా, దొంగతనం అస్సలేమాత్రం నేరం కాదని అర్థం చేసుకోవాలి. అదే నిజమైతే, హౌస్‌లో బలం వున్నోడిదే విజయం అని అనుకోవాల్సి వుంటుంది. అది తెలియక, హ్యామన్స్‌ బృందం ఆ టాస్క్‌లో ఓడిపోయింది. తాజాగా ‘చిల్లర ఏరుకునే’ టాస్క్‌లో ఒకరి దగ్గర ఒకరు దొంగతనాలు చేసేసుకున్నారు. కానీ, అది తప్పా? ఒప్పా? అన్నదానిపై మళ్ళీ గందరగోళం.

 

ఈ క్రమంలో హౌస్‌మేట్స్‌ మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. చిచ్చుపెట్టి చోద్యం చూడటం బిగ్‌బాస్‌ ఉద్దేశ్యమే అయినా, అది అత్యంత జుగుప్సాకరంగా మారిపోతోంది. గత సీజన్లకు భిన్నంగా ఓ పద్ధతీ పాడూ లేకుండా సాగుతుండడంతో ఈ సీజన్‌ని బిగ్‌బాస్‌ వ్యూయర్స్‌ లైట్‌ తీసుకుంటున్నారు.

ALSO READ: గీతా ఆర్ట్స్‌కి దూర‌మ‌య్యారా?