ENGLISH

Dasara Review: ద‌స‌రా మూవీ రివ్యూ & రేటింగ్‌!

30 March 2023-11:23 AM

నటీనటులు: నాని, కీర్తి సురేష్, ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో, సాయి కుమార్

దర్శకుడు : శ్రీకాంత్ ఓదెల

నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి

సంగీత దర్శకులు: సంతోష్ నారాయణన్

సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్

ఎడిటర్: నవీన్ నూలి

 

 

రేటింగ్: 3/5

 

 

ప‌క్కింటి అబ్బాయి పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్స్‌గా నిలిచాడు... నాని. నేచుర‌ల్ స్టార్ గా ఎదిగాడు. అయితే.. త‌న ఇమేజ్‌ని మార్చుకోవ‌డానికి ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాడు.అందులో భాగంగానే కొత్త త‌ర‌హా క‌థ‌ల్ని ఎంచుకొంటూ వ‌చ్చాడు. అయితే అవేం పెద్ద‌గా ఫ‌లితాలు ఇవ్వ‌లేదు. నాని అన‌వ‌స‌రంగా త‌న‌పై తాను ప్ర‌యోగాలు చేసుకొంటున్నాడంటూ పెద‌వి విరిచారంతా! `ద‌స‌రా`పై కూడా ఇలాంటి విమ‌ర్శ‌లు వినిపించాయి. నాని లుక్‌... త‌న మేకొవ‌ర్‌.. ఇవ‌న్నీ నానికి అవుటాఫ్ బాక్స్ అనిపించే ఐడియాలే. నాని మాస్ ఇమేజ్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడు అన‌డానికి ద‌స‌రా నే ఓ ఉదాహ‌ర‌ణ‌. మ‌రి.. ఈసారైనా ప్ర‌యోగం స‌త్ఫ‌లితాన్ని ఇచ్చిందా? శ్రీ‌కాంత్ ఓదెల అనే ఓ కొత్త ద‌ర్శ‌కుడు నానిని విభిన్నంగా చూపించాల‌న్న ప్ర‌య‌త్నాన్ని నెర‌వేర్చుకొన్నాడా? భారీ అంచ‌నాల మ‌ధ్య‌, కొన్ని అనుమానాల మ‌ధ్య విడుద‌లైన ద‌స‌రా ఎలా ఉంది? ఎవ‌రికి నచ్చుతుంది?

 

 

*క‌థ‌:

 

 

వీర్ల‌ప‌ల్లి అనే గ్రామంలోని ధ‌ర‌ణి (నాని) వెన్నెల (కీర్తి సురేష్‌), సూరి (దీక్షిత్ శెట్టి)ల క‌థ ఇది. ఈ ముగ్గురూ చిన్న‌ప్ప‌టి నుంచీ బెస్ట్ ఫ్రెండ్స్‌. వెన్నెల అంటే ధ‌ర‌ణికి చాలా ఇష్టం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ.. వెన్నెల మాత్రం సూరిని ఇష్ట‌ప‌డుతుంది. దాంతో.. ధ‌ర‌ణి త‌న‌లోని ప్రేమ‌ని చంపుకోవాల్సి వ‌స్తుంది. .ధ‌ర‌ణి, సూరి, వెన్నెల స్నేహం, ప్రేమ‌లోకి.. వీర్ల‌ప‌ల్లి లోక‌ల్ పాలిటిక్స్ ఎంట‌ర్ అవుతాయి. ఈ రాజ‌కీయాలు. అందులోని కుయుక్తులు... ధ‌ర‌ణి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ ముగ్గురి జీవితాలూ త‌ల్ల‌కిందుల‌వుతాయి. అలాంట‌ప్పుడు ధ‌ర‌ణి... ఏం చేశాడు? వాళ్ల‌పై ప్ర‌తీకారాన్ని ఎలా తీర్చుకొన్నాడు? ధ‌ర‌ణి ప్రేమ‌ని వెన్నెల గుర్తించిందా, లేదా? అనేది తెర‌పై చూడాలి.

 

 

*విశ్లేష‌ణ‌:

 

 

స్నేహం - ప్రేమ - ప‌గ... వీటి చుట్టూ తిరిగే క‌థ ఇది. నిజానికి ఈ త‌ర‌హా క‌థ‌లు తెలుగు తెర‌కు పెద్ద కొత్తేం కాదు. ఈమ‌ధ్య కూడా ఇలాంటి జోన‌ర్‌లో కొన్ని సినిమాలొచ్చాయి. కాక‌పోతే.. ఈ క‌థ‌ని చెప్ప‌డానికి కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ ఓదెల ఎంచుకొన్న నేప‌థ్యం వేరు. పాత్ర‌ల తాలుకూ ఇంటెన్సిటీ వేరు. అస‌లు ధ‌ర‌ణి పాత్ర‌లో నానిని ఈ ద‌ర్శ‌కుడు ఎలా ఊహించాడో? ఏంటో? అనిపిస్తుంది. వీర్ల‌ప‌ల్లి అనే గ్రామాన్ని తెర‌పై చూపించిన విధానం, అక్క‌డి పాత్ర‌ల్ని ప‌రిచయం చేసే ప‌ద్ధ‌తి.. ఇవ‌న్నీ న‌చ్చేస్తాయి. క్ర‌మంగా ఆ ప్రాంతానికి ప్రేక్ష‌కుడూ అల‌వాటైపోతాడు. ఆ త‌ర‌వాత ఒక్కో పాత్ర‌నీ... తెర‌పైకి తీసుకొచ్చి, వాళ్ల‌లోని ల‌క్ష‌ణాల్నీ, వాళ్ల ఉద్దేశ్యాల్నీ ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మ‌య్యేలా చూపించాడు. ఈ క‌థ‌ని సున్నితంగానూ చెప్పొచ్చు. నాని బ్రాండ్ కూడా అదే. కానీ `రా` అండ్ `ర‌స్టిక్‌`లోకి ఈ క‌థ‌ని తీసుకెళ్లిపోవ‌డంతో ఓ కొత్త నేప‌థ్యాన్ని కొత్త త‌ర‌హా క‌థ‌నీ చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. ధ‌ర‌ణి, సూరిల మ‌ధ్య చూపించిన ఫ్రెండ్ షిప్, వెన్నెల క్యారెక్ట‌రైజేష‌న్‌.. ఇవ‌న్నీ.. బాగా పండాయి. ఫ‌స్టాఫ్‌లో అబ్బుర ప‌రిచే కొన్ని యాక్ష‌న్ బ్లాక్స్ వ‌స్తాయి. అవ‌న్నీ మాస్‌కి న‌చ్చేస్తాయి.మ‌రీ ముఖ్యంగా నాని ఫ్యాన్స్‌కి ఆయా స‌న్నివేశాలు పండ‌గ వాతావర‌ణాన్ని సృష్టిస్తాయి. ఇంట్ర‌వెల్ సీన్ అయితే... ఈ సినిమాని నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్తుంది. అక్క‌డ ద‌ర్శ‌కుడు చూపించిన ఇంటెన్సిటీకి ఫుల్ మార్కులు ప‌డిపోతాయి. క‌థ‌లో... హై ఎమోష‌న్ ఇంట్ర‌వెల్ కి రావాల‌ని స్క్రీన్ ప్లే పాఠాలు చెబుతుంటాయి. దాన్ని శ్రీ‌కాంత్ ఓదెల అచ్చంగా పాటించేశాడు.

 

 

ఫ‌స్టాఫ్‌లో దూకుడు సెకండాఫ్‌లో కాస్త త‌గ్గుతుంది. ప్ర‌తీ స‌న్నివేశాన్ని, ప్ర‌తీ ఎమోష‌న్ నీ విడ‌మ‌ర‌చి చెప్పాల‌నుకొన్న ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నం... కాస్త విసుగుని తెప్పిస్తుంది. పైగా ఫ‌స్టాఫ్ తో ద‌స‌రాపై అంచ‌నాలు పెరిగిపోతాయి. అలాంట‌ప్పుడు సెకండాఫ్ అంచ‌నాల్ని మించేలా ఉండాల్సిందే. అయితే ఆ మోతాదు కాస్త త‌గ్గిన ఫీలింగ్ క‌లుగుతుంది. అయిన‌ప్ప‌టికీ.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో కొన్ని ఎమోష‌న్ సీన్ల‌నీ, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ని బాగా డిజైన్ చేసుకొన్నాడు ద‌ర్శ‌కుడు. క్లైమాక్స్ కి ముందు సినిమా మ‌రో దారిలో వెళ్తుందేమో అనిపిస్తుంది. కానీ.. క్లైమాక్స్ ఎపిసోడ్ తో.. ఆ అసంతృప్తినీ త‌రిమేశాడు. ఈ క‌థ‌లో మిళితం చేసిన‌ రాజ‌కీయ నేప‌థ్యం ఈ క‌థ‌లో ప‌ర్‌ఫెక్ట్ గా కుదిరింది. సిల్క్ బార్ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాలు మాస్‌ని మెప్పిస్తాయి. సిల్క్ ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా.. ప్రేక్ష‌కులు ఎయిటీస్ జ్ఞాప‌కాల్లోకి వెళ్లిపోతారు. కొన్ని పాత్ర‌ల్ని ద‌ర్శ‌కుడు అర్థాంత‌రంగా ముగించిన ఫీలింగ్ క‌లుగుఉంది. ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా క‌చ్చితంగా బాక్సాఫీసుని దులిపేద్దును. ఇప్ప‌టికీ మించిపోయింది లేదు. నాని కెరీర్‌లో బెస్ట్ గా నిలిచిపోయే స‌త్తా ఉంది.

 

 

*న‌టీన‌టులు

 

 

నిస్సందేహంగా ఇది నాని కెరీర్‌లో బెస్ట్ పెర్‌ఫార్మ్సెన్స్ అని చెప్పొచ్చు. నానిని ఇలా చూస్తామ‌ని ఎవ్వరూ ఊహించి ఉండ‌రు. ధ‌ర‌ణి పాత్ర నానిలోని కొత్త కోణాన్ని ఆవిష్క‌రించింది. అలాగ‌ని.. రెగ్యుల‌ర్ నానిలో కనిపించే కామెడీ టైమింగ్ ఎక్క‌డా మిస్స‌వ్వ‌దు. అవ‌న్నీ ఇస్తూనే.. రా అండ్ ర‌స్టిక్ పెర్‌ఫార్మ్సెన్స్ అందించ‌గిలిగాడు. ముఖ్యంగా ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌, క్లైమాక్స్‌ల‌లో కొత్త నానిని చూస్తారు ప్రేక్ష‌కులు.

 

వెన్నెల‌గా కీర్తి ప‌ర్‌ఫెక్ట్ ఛాయిస్‌. త‌న‌క్కూడా ఇది గేమ్ ఛేంజింగ్ క్యారెక్ట‌ర్ అని చెప్పాలి. సూరి పాత్ర‌లో క‌నిపించిన దీక్షిత్ మెప్పిస్తాడు. అయితే ఈ పాత్ర‌లో మ‌న‌కు తెలిసిన యంగ్ హీరో న‌టించి ఉంటే.. ఆ ఇంపాక్ట్ వేరేలా ఉండేది. ఈ సినిమాలో క‌నిపించే కొన్ని పాత్ర‌లు తెలుగు తెర‌కు పూర్తిగా కొత్త . అయితే వాళ్లు కూడా త‌మకొచ్చిన అవ‌కాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొన్నారు.

 

 

*సాంకేతిక వ‌ర్గం

 

 

టెక్నిక‌ల్‌గా ద‌స‌రా టాప్ క్లాస్ లో ఉంది. సంగీతం, నేప‌థ్య సంగీతం, కెమెరా వ‌ర్క్ ఇవ‌న్నీ ఆక‌ట్టుకొంటాయి. ఓకొత్త ద‌ర్శ‌కుడికి టెక్నిక‌ల్ టీమ్ వెన్నుద‌న్నుగా నిలిచింది. `చమ్కీల అంగీలేసి` పాట థియేట‌ర్లో ఊపు తెస్తుంది. మాట‌ల్లో షార్ప్‌నెస్ కనిపించింది. ఇక వీర్ల‌ప‌ల్లి సెట్ ఈ క‌థ‌కు నిండుద‌నం తీసుకొచ్చింది.

 

శ్రీ‌కాంత్ ఓదెల రూపంలో టాలీవుడ్ కు మ‌రో మంచి ద‌ర్శ‌కుడు దొరికాడు. త‌న పేరు ఇంకొంత కాలం బ‌లంగా వినిపిస్తుంది. ఓ మామూలు క‌థ‌కి నేటివిటీ ట‌చ్ ఇస్తే, దానికి సాంకేతిక నిపుణ‌లు తోడైతే, ఆ క‌థ మంచి న‌టీన‌టుల చేతిలో ప‌డితే ఎలా ఉంటుందో చెప్ప‌డానికి ద‌స‌రా ఓ ఉదాహ‌ర‌ణ‌.

 

 

*ప్ల‌స్ పాయింట్స్‌

 

 

నేప‌థ్యం

నాని న‌ట‌న‌

సాంకేతిక వ‌ర్గం

ఇంట్ర‌వెల్

యాక్ష‌న్

 

 

*మైన‌స్ పాయింట్స్‌

 

 

తెలిసి క‌థ‌

కొన్ని బోరింగ్ సీన్లు

 

 

*ఫైన‌ల్ వ‌ర్డిక్ట్: నిజ‌మైన పండ‌గ‌