ENGLISH

దర్శకుడు తాతినేని రామారావు ఇకలేరు

20 April 2022-09:45 AM

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినియర్ దర్శకులు తాతినేని రామారావు(84) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయణ్ని కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. నాగేశ్వరరావు, సావిత్రి కాంబినేషన్‌లో ‘నవరాత్రి’ చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడిగా తొలి అడుగువేశారు. ‘బ్రహ్మచారి’, ‘మంచి మిత్రులు’, ‘జీవన తరంగాలు’, ‘దొరబాబు’, ‘యమగోల’, ‘అనురాగ దేవత’, ‘పచ్చని కాపురం’ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

 

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘యమగోల’ చిత్రం తాతినేని రామారావుకు మంచి గుర్తింపు తెచ్చింది. అదే చిత్రాన్ని 1979లో హిందీలోకి ‘లోక్‌ పర్‌లోక్‌’ పేరుతో రీమేక్‌ చేసి బాలీవుడ్‌లోనూ మొదటి ప్రయత్నంలోనే హిట్‌ అందుకున్నారు. తాతినేని రామారావు తెర‌పై క‌థ‌ను చెప్పే తీరు జ‌నాన్ని బాగా ఆక‌ట్టుకొనేది. సూటిగా త‌న క‌థ ఇది అని ఆయ‌న తెలిపే ప్ర‌య‌త్నం చేసేవారు. అంతేకాదు ఆయ‌న‌ను అంద‌రూ నిర్మాత‌ల ద‌ర్శకుడు అనేవారు. నిర్మాత‌కు ఓ రూపాయి మిగ‌లాలి అనే త‌పించేవారు. చాలా రిమేక్ సినిమాలతో ఆకట్టుకున్నారు తాతినేని. తన దర్శకత్వంలోనే రూపొంది విజయం సాధించిన ‘ఆలుమగలు’ను హిందీలో ‘జుదాయి’ పేరుతో తెరకెక్కించారు తాతినేని రామారావు. ‘కార్తిక దీపం’ను హిందీలో ‘మాంగ్ భరో సజనా’గానూ, ‘అంతులేని కథ’ను ‘జీవన్ ధార’గానూ, ‘సట్టమ్ ఎన్ కయిల్’ను హిందీలో ‘యే తో కమాల్ హోగయా’గానూ రీమేక్ చేసి విజయాలు అందుకున్నారు.

ALSO READ: క‌త్తెర‌కు బ‌లైపోయిన కాజ‌ల్‌