ENGLISH

అన్నీ ఓకే చిరు... కానీ మెహ‌ర్ ర‌మేష్ అంటేనే..!

23 August 2021-13:42 PM

చిరంజీవి - మెహ‌ర్ ర‌మేష్ కాంబినేష‌న్ అనగానే చిరంజీవి ఫ్యాన్స్ షాక్ కి గుర‌య్యారు. ఇండ్ర‌స్ట్రీ మొత్తం మ‌ర్చిపోయిన మెహ‌ర్ కి.. చిరు ఎలా చాన్సిచ్చాడా? అనుకున్నారు. మెహ‌ర్ ఏదో అదిరిపోయే క‌థ రాసి... చిరుని ఇంప్రెస్ చేశాడ‌ని చెప్పుకోవ‌డానికి లేదు. అదో రీమేక్ క‌థ‌. `వేదాళం` ని మెహ‌ర్ రీమేక్ చేస్తున్నాడంతే. నిజానికి ఈ క‌థ చిరుకి న‌చ్చితే, త‌ను ఎవ‌రితో నైనా రీమేక్ చేయించుకోగ‌ల‌డు. ఏరి కోరి.. మెహ‌ర్ ని తీసుకోవ‌డం ఫ్యాన్స్ కే కాదు. తెలుగు ఇండ్ర‌స్ట్రీకే షాక్ ఇచ్చింది. ఈ సినిమా కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమితం అనుకుంటే, ఏకంగా ఫ‌స్ట్ లుక్ కూడా వ‌చ్చేసింది.

 

ఈసినిమాకి `భోళా శంక‌ర్‌` అనే పేరు ఖ‌రారు చేయ‌డం, కీర్తి సురేష్ ని చిరు చెల్లాయిగా ప‌రిచ‌యం కూడా జ‌రిగిపోయాయి. సో.. ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డం ఖాయ‌మైపోయింద‌న్న‌మాట‌. షాడో, శ‌క్తి సినిమాల‌కు ఇప్ప‌టికీ ట్రోలింగ్స్ వ‌స్తున్నాయంటే మెహ‌ర్ ర‌మేష్ స్టామినా ఏమిటో అర్థం చేసుకోవొచ్చు. ఇప్పుడు ఈసినిమాల జాబితాలో భోళా శంక‌ర్ చేర‌బోతోందంటూ అప్పుడే మీమ్స్ మొద‌లైపోయాయి.

 

బ‌హుశా.. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా చిరు చేస్తున్న సినిమా ఇదే కావొచ్చు. అదీ ఒకందుకు మంచిదే. ఈ సినిమా విడుద‌లై... ఏమాత్రం బాగున్నా - సూప‌ర్ హిట్ అయిపోయిన‌ట్టే. మెగా అభిమానుల్ని మెహ‌ర్ ఎలా స‌ర్‌ప్రైజ్ చేస్తాడో చూడాలి.

ALSO READ: తొలి ఎపిసోడ్ కే హిట్టు కొట్టేశాడు