ENGLISH

'ఎనిమి' మూవీ రివ్యూ & రేటింగ్‌!

04 November 2021-16:12 PM

నటీనటులు: విశాల్, ఆర్య, మృణాళిని రవి, ప్రకాశరాజ్‌ తదితరులు
దర్శకుడు: ఆనంద్‌ శంకర్‌
నిర్మాత: వినోద్‌ కుమార్‌
సంగీత దర్శకుడు: తమన్‌
సినిమాటోగ్రఫీ:  డి రాజశేఖర్
ఎడిటర్: రేమండ్‌ డెరిక్‌ క్రాస్టా


రేటింగ్ : 2.25/5


విశాల్ ది ముందు నుంచీ ఒక‌టే దారి. హిట్లున్నా, ఫ్లాపులున్నా ప‌ట్టించుకోడు. సినిమాలు చేసుకుంటూనే వెళ్తున్నాడు. త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ద‌ర్శ‌కుల ట్రాక్ రికార్డు కూడా ఏమాత్రం ఆలోచించ‌డు. క‌థ న‌చ్చితే చేసేయ‌డ‌మే. ఆ ప్ర‌యాణంలో త‌న ఖాతాలో కొన్ని హిట్లు ప‌డ్డాయి. కొన్ని డిజాస్ట‌ర్లు ప‌డ్డాయి.కానీ కొత్త ప్ర‌య‌త్నాలు మాత్రం మాన‌లేదు.


ఈ సారి ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమాతో వ‌చ్చాడు. అదే... `ఎనిమి`. స్నేహితుడే శ‌త్రువు అయితే.. ?  ఎలా ఉంటుంద‌న్న‌ది సినిమాకి ముఖ్య‌మైన నేప‌థ్యం. విల‌న్ గా త‌న స్నేహితుడు ఆర్య‌ని తీసుకోవ‌డం వ‌ల్ల‌... ఈ ప్రాజెక్టు పై మ‌రింత‌గా ఆస‌క్తి పెరిగింది. మ‌రి ఈ సినిమా ఎలావుంది?  విశాల్‌కి విజ‌యం ద‌క్కిందా, లేదా?


* క‌థ‌


భ‌ర‌త్ (ప్ర‌కాష్‌రాజ్‌) ఓ ఐపీఎస్ అధికారి. త‌న కొడుకు రాజీవ్ (ఆర్య‌)ని కూడా త‌న‌లానే పోలీస్ ని చేయాల‌నుకుంటాడు. చిన్న‌ప్ప‌టి నుంచీ ఆ దిశ‌గా తీర్చిదిద్దుతూ ఉంటాడు. ప‌క్కింట్లో ఉండే సూర్య (విశాల్‌) ఈ కుటుంబానికి ద‌గ్గ‌ర‌వుతాడు. భ‌ర‌త్ సూర్య‌ని సైతం త‌న బిడ్డే అనుకుని, త‌న‌ని కూడా పోలీస్ గా చేయాల‌ని క‌ల‌లు కంటాడు.


ఈ నేప‌థ్యంలో.... రాజీవ్‌, సూర్య ఇద్ద‌రూ స్నేహితులుగా మారిపోతారు. కానీ కాల‌క్ర‌మంలో... రాజీవ్ ఓ క్రిమినల్ గా మార‌తాడు. సూర్య పోలీస్ అధికారి అవుతాడు. ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం పోయి శ‌త్రుత్వం మొద‌ల‌వుతుంది.  స్నేహితులు ఎందుకు శ‌త్రువులుగా మారారు? భ‌ర‌త్ త‌న ల‌క్ష్యానికి దూరంగా ఎందుకు గ‌డ‌పాల్సివ‌చ్చింది?  అనేదే ఎనిమి క‌థ‌.


* విశ్లేష‌ణ‌


నీ గురించి అన్నీ తెలిసిన స్నేహితుడే...నీకు అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన శ‌త్రువు అనే పాయింట్ తో సాగే సినిమా ఇది. స్నేహితుడు శ‌త్రువు అయితే ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో.. ఈ క‌థ‌లో చెప్పాల‌నుకున్నారు. దానికి విశాల్ త‌ర‌హా యాక్ష‌న్ సీన్లు, మైండ్ గేమ్ జోడించారు. విశాల్ కి ప‌ర్‌ఫెక్ట్ గా సూట‌య్యే జోన‌ర్ ఇది. కాక‌పోతే.. అస్త‌మానూ యాక్ష‌న్ గోల ఏం బాగుంటుంది. అందుకే ఈసారి మైండ్ గేమ్ జోడించారు.


క‌థ చాలా స్లోగా మొద‌ల‌వుతుంది. రాజీవ్‌, సూర్య‌ల నేప‌థ్యాన్ని చెప్ప‌డానికి ద‌ర్శ‌కుడు చాలా స‌మ‌యం తీసుకున్నాడు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో యాక్ష‌న్ సీన్ల‌తో క‌థ‌లో జోరు వ‌చ్చినా ... అది స‌రిపోలేదు. చాలా స‌న్నివేశాలు స్లో ఫేజ్ లో సాగుతాయి. నిజానికి ఇలాంటి యాక్ష‌న్ క‌థ‌ల‌కు... స్క్రీన్ ప్లే చాలా స్పీడుగా ఉండాలి. అది జ‌ర‌గ‌లేదు.


కొన్ని ఎపిసోడ్స్ బాగానే మొద‌లెట్టినా, వాటిని ముగించిన తీరు బాలేదు. ఉదాహ‌ర‌ణ‌కు భ‌ర‌త్ మ‌ర్డ‌ర్ ఎపిసోడ్ తో క‌థ‌కి జోష్ వ‌స్తుంది.దాన్ని బాగానే మొద‌లెట్టినా, చ‌ప్ప‌గా తేల్చేశాడు. రాజీవ్ కోపానికి ఏదో బ‌ల‌మైన కార‌ణం ఉండి ఉంటుంది అనుకుంటారు. దాన్ని చాలా సిల్లీగా రివీల్ చేశాడు. ఈమాత్రం దానికి ఇంత ప‌గ పెంచుకోవ‌డం, ఇంత విధ్వంసం సృష్టించ‌డం అవ‌స‌ర‌మా?  అనేలా ఉంది. 


లాజిక్ లేని సీన్లు ఈ సినిమాలో చాలాఉన్నాయి. మైండ్ గేమ్ కి సంబంధించిన సీన్లు ఒక‌ట్రెండు ఓకే అనిపిస్తాయి. కానీ చాలా చోట్ల ద‌ర్శ‌కుడు లాజిక్ లేకుండా ఏదేదో రాసుకుని వెళ్లిపోయాడు. యాక్ష‌న్ సీన్లు అల‌రిస్తాయి కానీ, ఒక‌టే మోత‌. క్లైమాక్స్ కూడా అంతే. ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతుంది. 15 మంది పిల్లల్ని బెదిరించే సన్నివేశం.. పేల‌వంగా తీర్చిదిద్దాడు. మమతా మోహన్‌దాస్‌ మర్డర్‌ వెనుకున్న సరైన కారణనం లేక‌పోవ‌డం వ‌ల్ల అది కాస్త తేలిపోయింది.


* న‌టీన‌టులు


విశాల్ కి ఇది ప‌క్కాగా సూట‌య్యే పాత్ర‌. త‌ను చాలా ఈజీగా చేసిన‌ట్టు అనిపించినా, యాక్ష‌న్ ఎపిసోడ్ల‌లో చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఆ క‌ష్టం తెర‌పై క‌నిపిస్తూనే ఉంటుంది. కాక‌పోతే.. ఇంత బ‌ల‌హీన‌మైన క‌థ‌లో అవ‌న్నీ బూడిద‌లో పోసిన ప‌న్నీరులా మారిపోయింది. క‌థ‌ల విష‌యంలో విశాల్ మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్న విష‌యాన్ని ఎనిమి మ‌రోసారి గుర్తు చేస్తుంది.


ఆర్య కూడా ప‌ర్‌ఫెక్ట్ గా సూట‌య్యాడు. ఆర్య ఉన్నాడు కాబ‌ట్టే... ఈ రెండు పాత్ర‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చూడ‌గ‌లిగాం. ఆర్య - విశాల్ ల‌మ‌ధ్య తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఎపిసోడ్స్  బాగా వ‌చ్చాయి. మ‌మ‌తామోహ‌న్ దాస్ పాత్ర‌ని పేల‌వంగా ముగించారు. ప్ర‌కాష్ రాజ్ దీ అంత సీరియ‌స్ లెంగ్త్ ఉన్న పాత్రేం కాదు.


* సాంకేతిక వ‌ర్గం


త‌మ‌న్ ఇచ్చిన నేప‌థ్య సంగీతం లో హోరు ఎక్కువ‌. పాట‌లున్నా అవి ఆక‌ట్టుకోవు. యాక్ష‌న్ సీన్ల‌ని తెర‌కెక్కించిన విధానం బాగుంది. మినీ ఇండియా (సింగ‌పూర్‌) బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా ఇది. కాబ‌ట్టి లొకేష‌న్లు కొత్త‌గా అనిపిస్తాయి.


ద‌ర్శ‌కుడు రాసుకున్న క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు. స‌న్నివేశాలూ పాత వాస‌న‌కొట్టాయి. వాటిని తెర‌కెక్కించిన విధానం కూడా సోసోగా ఉంది. దాంతో స్నేహితుల మ‌ధ్య శ‌త్రుత్వం అనే కాన్సెప్ట్ వ‌ర్క‌వుట్ కాలేదు.


* ప్ల‌స్ పాయింట్స్‌


విశాల్ - ఆర్య‌
కొన్ని యాక్ష‌న్ సీన్లు


* మైన‌స్ పాయింట్స్‌


క‌థ‌, క‌థ‌నం
సాగ‌దీత‌
రొటీన్ సీన్లు


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్:  నిజంగా శ‌త్రువే

ALSO READ: 'పెద్దన్న' మూవీ రివ్యూ & రేటింగ్!