ENGLISH

'జాతి రత్నాలు' మూవీ రివ్యూ & రేటింగ్!

11 March 2021-16:00 PM

నటీనటులు : నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా తదితరులు 
దర్శకత్వం : అనుదీప్ కే.వీ
నిర్మాత‌లు : నాగ్ అశ్విన్
సంగీతం : రాధన్ 
సినిమాటోగ్రఫర్ : సిద్ధం మనోహర్ 
ఎడిటర్: అభినవ్ దండ 

 

రేటింగ్: 3/5

 

వినోదానికి ఢోకా లేదు. సినిమా చూస్తున్నంత‌సేపూ కాసిన్ని న‌వ్వులు పంచేస్తే చాలు. అంత‌కు మించిన క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్ ఇంకోటి ఉండ‌దు. పైగా ఈధ్య క్లీన్ కామెడీ సినిమాలు బాగా అరుదైపోయాయి. ఇలాంటి సంద‌ర్భంలో `జాతిర‌త్నాలు` వ‌చ్చింది. `ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ‌`తో త‌న కామెడీ టైమింగ్ ఏపాటిదో చూపించాడు. ఆ త‌ర‌వాత చేసిన సినిమా ఇదే. ప్ర‌చార చిత్రాలు కూడా టెమ్టింగ్ గా ఉండ‌డంతో జాతిర‌త్నాలుపై.. దృష్టి ప‌డింది. మ‌రి ఈ రత్నాలు ఎలా ఉన్నాయి?  మెరిశాయా, లేదా?


* క‌థ‌


శ్రీకాంత్ (న‌వీన్ పొలిశెట్టి) జోగిపేట లో భ‌లే ఫేమ‌సు. త‌న‌కో లేడీస్ ఎంపోరియ‌మ్ ఉంది. ఆడ‌వాళ్ల చీర‌ల‌కు మ్యాజింగ్ బ్లౌజులు, గాజులు అమ్ముతుంటాడు. అయితే ఆ ప‌ని చేయ‌డం త‌న‌కు ఏమాత్రం ఇష్టం ఉండ‌దు. హైద‌రాబాద్ వెళ్లి, మంచి ఉద్యోగం చేసుకుంటూ సెటిల్ అయిపోదామ‌ని అనుకుంటాడు. త‌న చిన‌నాటి స్నేహితులు (రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి) కూడా హైద‌రాబాద్ వ‌స్తాం.. అన‌డంతో.. ముగ్గురూ క‌లిసి హైద‌రాబాద్ చేర‌తారు. అక్క‌డో గేటెడ్ క‌మ్యునిటీలో.. ఓ ఫ్లాట్ సంపాదిస్తారు. ఆ ఫ్లాట్ ప‌క్క‌నే ఉండే చిట్టి (ఫ‌రియా అబ్దుల్లా)తో శ్రీ‌కాంత్ ప్రేమ‌లో ప‌డ‌తాడు. 


మ‌రోవైపు... మంత్రి ప‌ద‌వి సంపాదించి, దాన్ని అడ్డాగా మార్చి కోట్లు సంపాదించే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు ఎం.ఎల్.ఏ చాణిక్య (ముర‌ళీ శ‌ర్మ‌). చాణిక్య మంచి క్రికెట‌ర్ కాబ‌ట్టి, పార్టీ త‌న‌కు క్రీడా శాఖ మంత్రిగా అవ‌కాశం ఇస్తుంది. ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే... 5 వంద‌ల కోట్ల క‌మీష‌న్ తీసుకుని ఓ టెండ‌ర్ ఓకే చేద్దామ‌నుకుంటాడు చాణిక్య‌. అయితే అనుకోకుండా చాణిక్య‌పై హ‌త్యా ప్ర‌య‌త్నం జ‌రుగుతుంది. ఆ కేసు.. ఈ ముగ్గురు స్నేహితుల‌పై ప‌డుతుంది. మ‌రింత‌కీ.. ఈ హ‌త్యాయ‌త్నం చేసిందెవ‌రు?  ఈ కేసు నుంచి జాతి ర‌త్నాలు ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు?  అన్న‌దే సినిమా క‌థ‌.


* విశ్లేష‌ణ‌


ఓ ముగ్గురు ఆవారా స్నేహితుల క‌థ ఇది. వాళ్ల అమాయ‌క‌త్వం చుట్టూ న‌డుస్తుంది. ఈ ముగ్గురూ చేయ‌ని నేరానికి జైలు పాలు అవ్వ‌డం, వీళ్ల వెనుక‌.. విల‌న్ బ్యాచ్ ప‌రుగులూ.. ఇదీ క‌థ‌. గ‌తంలో ఈ త‌ర‌హా క‌థ‌లు చాలానే వ‌చ్చాయి. అన్నీ వినోదాత్మ‌క చిత్రాలే. ఆ కోవ‌లోకే జాతి ర‌త్నాలు కూడా చేరుతుంది. క‌థా ప‌రంగా.. ద‌ర్శ‌కుడు పెద్ద‌గా వ‌ర్క్ చేయ‌లేదు. లాజిక్కులుఏమాత్రం పండించ‌లేదు. కాక‌పోతే.. ప్ర‌తీ స‌న్నివేశంలోనూ ఫ‌న్ ఉండేలా చూసుకున్నాడు. సినిమా ప్రారంభ స‌న్నివేశాల నుంచే... ఫ‌న్ మొద‌లైపోతుంది. హైద‌రాబాద్ వ‌చ్చాక‌...ఆ డోసు మ‌రింత పెరుగుతుంది. ముగ్గురు మిత్రులూ జైలు కెళ్ల‌డం, అక్క‌డ ఫొటోలు తీయించుకోవ‌డం, రాహుల్ రామ‌కృష్ణ సెల్ ఫోన్ క‌బుర్లు, ప్రియ‌ద‌ర్శి... కుక్క‌ర్ విజిల్ ముచ్చ‌ట్లూ... ఇవ‌న్నీ బాగానే వ‌ర్క‌వుట్ అవుతాయి.


చిట్టి - శ్రీ‌కాంత్ ల‌వ్ స్టోరీ కూడా.. బాగానే సాగుతుంది. ఇంట్ర‌వెల్ లో.. పెద్ద కేసు, ఈ ముగ్గురి నెత్తిమీద ప‌డుతుంది. అయితే.. ద్వితీయార్థంలో క‌థంతా ట్రాక్ త‌ప్పింది. అస‌లు కంటే కొస‌రు ఎక్కువన్న‌ట్టు... ద‌ర్శ‌కుడు మిగిలిన విష‌యాల‌పై ఫోక‌స్ పెట్టాడు. ప్ర‌తీ సీన్ నీ... కామెడీ చేసేయాల‌ని చూశాడు. ఇది కామెడీ సినిమానే అయినా, అందులో క్రైమ్ పార్ట్ ఉంది. దాన్న‌యినా కాస్త శ్ర‌ద్ధ‌గా, సీరియ‌స్ గా చేయాల్సింది. ఆఖ‌రికి కోర్టు స‌న్నివేశాల్లోనూ అదే వెట‌కారం ధ్వ‌నిస్తుంది. 


చేయ‌ని త‌ప్పుకు శిక్ష అనుభ‌విస్తున్న హీరోల‌పై ప్రేక్ష‌కుల‌కు జాలి, సానుభూతి క‌ల‌గాలి. అస‌లు ఎలాంటోళ్లు, ఎలా అయిపోయారు?  అన్న ఫీలింగ్ రావాలి. అప్పుడు క‌థ‌తో మ‌రింత‌గా కనెక్ట్ అవుతారు. అస‌లు ద‌ర్శ‌కుడు అలాంటి ప్ర‌య‌త్న‌మే చేయ‌లేదు. చివ‌ర్లో. కోర్టు బోనులో నిల‌బ‌డి.. అర్థం ప‌ర్థం లేని ఇంగ్లీషు ముక్కుల వాడి అంద‌రినీ మేల్కొలిపే ప్ర‌య‌త్నం చేయ‌డం.. బాగా ఫ‌న్నీగా ఉంది. అదే సీన్‌లో.. విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా స్పెష‌ల్ ఎప్పీరియ‌న్స్ ఇచ్చాడు. తొలి స‌న్నివేశాల‌లో.. కీర్తి సురేష్ క‌నిపిస్తుంది. ఇలాంటి మెరుపులు అక్క‌డ‌క్క‌డ ఉండ‌డంతో.. సినిమాలో టైమ్ పాస్‌కి ఢోకా లేకుండా పోయింది.


* న‌టీన‌టులు


ఇది న‌వీన్ పొలిశెట్టి షో.. అని చెప్పుకోవాలి. త‌న కామెడీ టైమింగ్ ఈసినిమాకి అతి పెద్ద ప్ల‌స్‌. విష‌యం లేని సీన్ లోనూ ప్రేక్ష‌కుల్ని న‌వ్వేలా చేశాడు. అయితే ప్రతీ స‌న్నివేశానికీ ఒకేలాంటి ఎక్స్‌ప్రెష‌న్ ఇవ్వ‌డం... ప్ర‌తీ చోటా ఒకే లా న‌టించ‌డానికి చూడ‌డం మైన‌స్ అని చెప్పుకోవాలి. అందులోంచి న‌వీన్ బ‌య‌ట‌ప‌డాలి. ప్రియ‌ద‌ర్శికి పెద్ద‌గా స్కోప్ ద‌క్క‌లేదు. రాహుల్ ఫోన్ ముచ్చ‌ట్లున‌వ్విస్తాయి. హీరోయిన్ లాయ‌ర్ గా మారిన‌ప్పుడు ఎక్కువ వినోదం పంచింది. ముర‌ళీ శ‌ర్మ‌ది రొటీన్ న‌ట‌నే. చాలా రోజుల త‌ర‌వాత బ్ర‌హ్మానందం తెర‌పై క‌నిపించాడు. త‌న‌ది అతిథి పాత్ర‌ అనుకోవాలి.


* సాంకేతిక వ‌ర్గం


క‌థ‌లో విష‌యం లేదు. కేవ‌లం ఫ‌న్ తో మ్యాజిక్ చేయాల‌ని చూశారు. లాజిక్కుల్ని పూర్తిగా గాలికి వ‌దిలేశారు. ద‌ర్శ‌కుడు.. చిన్న లైన్ ని ప‌ట్టుకుని రెండు గంట‌లు కూర్చోబెట్టాల‌ని చూశాడు. తొలి భాగం స‌ర‌దాగా సాగినా, ద్వితీయార్థం కొంచెం బోర్ కొట్టించింది. ప్ర‌తీ డైలాగ్ లోనూ ఫ‌న్ ఉండేలా చూసుకున్నారు. చిట్టీ పాట కొన్ని రోజులు గుర్తుండిపోతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌, కెమెరా ప‌నితనం ఆక‌ట్టుకుంటాయి.


* ప్ల‌స్ పాయింట్స్‌


వినోదం
న‌వీన్ పొలిశెట్టి
చిట్టీ పాట‌


* మైన‌స్ పాయింట్స్‌


లాజిక్కులు లేక‌పోవ‌డం
ద్వితీయార్థం


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌: జ‌స్ట్ ఫ‌ర్ ఫ‌న్‌.

ALSO READ: 'జాతి రత్నాలు' ఇంగ్లిష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.