ENGLISH

త్వ‌ర‌లోనే టాలీవుడ్ బండారం బ‌య‌ట‌ప‌డుతుందా?

30 August 2024-18:32 PM

మలయాళ ఇండస్ట్రీలో ఒక పెద్ద కుదుపు తెచ్చింది జస్టీస్ హేమా కమిటీ. ఈ కమిటీ ఇచ్చిన నివేదికతో మిగితా ఇండస్ట్రీస్ కూడా ఆత్మ విమర్శ చేసుకుంటున్నాయి. ఫీమేల్ యాక్టర్స్ ఇలాంటి కమిటీలను ఆహ్వానిస్తుంటే, మేల్ యాక్టర్స్ గుండెలు గుభేలు మంటున్నాయి.  2017లో నటి భావన పై జరిగిన దాడికి నిరసనగా కేరళకు చెందిన WCC పిటిషన్‌ వేసింది. దీన్ని అనుసరించి కేరళ సర్కార్ 'జస్టిస్ హేమ' కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రిటైర్డ్ కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. హేమ నేతృత్వం వహించారు. ఇందులో పాతతరం నటి శారద, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కెబి వత్సల కుమారి కూడా ఉన్నారు.


ఈ కమిటీ బాధ్యత మహిళల భద్రత, గౌరవం, వర్కింగ్ సిట్యువేషన్స్ విచారించటం. మలయాళ సినీ పరిశ్రమలో మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న వేధింపులు, వివక్ష, అరాకొర సౌక‌ర్యాలు లాంటి అనేక ఆరోపణలను అనుసరించి ఈ కమిటీ నివేదిక సమర్పించింది. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తరవాత మ‌ల‌యాళ మూవీ ఆర్టిస్ట్ అసోషియేష‌న్‌లో క‌ల‌క‌లం రేగింది. ఆ క‌మిటీలో చాలా మంది స‌భ్యులు రాజీనామా చేసేసారు. వీరిలో కొందరు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఉన్నారు. దీంతో అమ్మ అసోషియేషన్ రద్దు అయ్యింది. మళ్ళీ రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ కమిటీ నివేదిక చూసిన ప్రజలు నివ్వెరపోయారు. బాధితులకి అండగా నిలవాలని, వేధించిన వారికి శిక్ష పడాలని పలువురు కోరుతున్నారు.


హేమా కమిటీ లాంటిది మా ఇండస్ట్రీకి కూడా వస్తే బాగుణ్ణు అని బెంగాల్ నటి పబ్లిక్ గా ట్వీట్ చేసారు. హేమా నివేదిక తరవాత దీనిపై షకీలా మాట్లాడుతూ అన్ని ఇండస్ట్రీ ల్లోనూ ఇలాంటి వేధింపులున్నాయని, తెలుగు ఇండస్ట్రీ లో ఇవి ఇంకా ఎక్కువని, హేమా కమిటీ అన్ని ఇండస్ట్రీస్ కి అవసరమని ఆమె వ్యాఖ్యానించటం గమనార్హం. ఇంత జరుగుతున్నా ఈ హేమా కమిటీ పై టాలీవుడ్ లో ఒక్కరూ కూడా స్పదించలేదు. టాలీవుడ్ సినీపరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇలాంటి టైం లో ఈ వివాదంపై నోరు విప్పితే బాధితులకి అండగా ఉన్నట్లు ఉంటుందని, నిందుతుల్ని హెచ్చరిస్తున్నట్టు ఉంటుంది. కానీ టాలీవుడ్ ప్రముఖులు ఎవరూ దేశాన్ని ఒక ఊపు ఊపుతున్న విషయంపై స్పదించక పోవటం చర్చనీయాంశం అయ్యింది. 


ఎవరు ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అన్న భయం. ఒక వేళ  నిజంగా అలాంటి కమిటీ టాలీవుడ్ లో వేస్తే ఎందరు సపోర్ట్ చేస్తారో, ఎందరు బాధితులు బయట పడతారో, నిందుతులుగా ఎందరు తేలుతారో తెలియని పరిస్థితి. ఎప్పటి నుంచో టాలీవుడ్ ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ పై వార్తలు వస్తూనే ఉన్నాయి. కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పుతూనే ఉన్నారు. కానీ న్యాయం జరగటం లేదు. బడా వ్యక్తులు వీరి నోరు మూసేస్తున్నారు. కనుకే టాలీవుడ్ హేమా కమిటీపై నోరు విప్పడం లేదు.