ENGLISH

మణికర్ణిక ఎవరో తెలుసా?

13 April 2017-11:34 AM

క్రిష్‌ దర్శకత్వంలో హిందీలో 'మణికర్ణిక' అనే సినిమా రూపొందనుంది. ఇది తెలుగులో కూడా విడుదల కానుంది. మణికర్ణిక తాంబే అనే పేరు ఎవరిదంటే, తొలి స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన రాణీ ఝాన్సీ లక్ష్మీబాయిది. ఝాన్సీ అనే ప్రాంతాన్ని పరిపాలించినందున రాణీ ఝాన్సీ లక్ష్మీ బాయి అనే పేరు ఆమెకి వచ్చింది. వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి పేరు మణికర్ణిక తాంబే అని చాలామందికి తెలియదు. ఏదన్నా సినిమా తెరకెక్కించాలని అనుకుంటే ముందుగా క్రిష్‌, చారిత్రక నేపథ్యం గురించి ఆలోచిస్తాడు. చరిత్రలోకి తొంగి చూడటం అతనికి అలవాటు. 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా కోసం ఆయన చాలా రీసెర్చ్‌ చేశాడు. అలాగే 'మణికర్ణిక' సినిమా కోసం కూడా అలాగే రీసెర్చ్‌ చేశాడట. తన రీసెర్చ్‌లో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయని, వాటన్నిటినీ సినిమాగా మలచి, భారతీయ సినీ ప్రేక్షకులకు అత్యద్భుతమైన చిత్ర రాజాన్ని అందించే ప్రయత్నంలో ఉన్నానని ఆయన అంటున్నాడు. మణికర్ణిక సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోన్నది ఎవరో కాదు, 'ఏక్‌నిరంజన్‌' ఫేం కంగనా రనౌత్‌. బాలీవుడ్‌లో నటిగా విమర్శకుల ప్రశంసలేకాక, తిరుగులేని స్టార్‌డమ్‌ సంపాదించుకున్న కంగనా రనౌత్‌ 'మణికర్ణిక' పాత్ర కోసం తనవంతుగా రీసెర్చ్‌ చేసిందట కూడా. ఏదేమైనప్పటికీ మన తెలుగు దర్శకుడు క్రిష్‌ ఇంకోసారి బాలీవుడ్‌ని మెస్మరైజ్‌ చేయబోతున్నాడంటే అభినందించదగ్గదే కదా.

 

ALSO READ: గజేంద్రుడు రేస్ నుండి తప్పుకున్నాడు!!