ENGLISH

మ‌హేష్‌ని స‌పోర్ట్ చేసిన కంగ‌నా ర‌నౌత్‌

13 May 2022-12:10 PM

ఈమ‌ధ్య బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి మ‌హేష్ బాబు కొన్ని కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేశారు. త‌ను బాలీవుడ్ గురించి ఆలోచించ‌డం లేద‌ని, అక్క‌డ‌కు వెళ్లే ఉద్దేశ్యం లేద‌ని, వెళ్లినా.. త‌న‌ని బాలీవుడ్ వాళ్లు భ‌రించ‌లేర‌ని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్య‌ల‌పై బాలీవుడ్ లో దుమారం రేగుతోంది. బాలీవుడ్ ప్ర‌ముఖులు, సినీ విశ్లేష‌కులు మ‌హేష్ బాబు వ్యాఖ్య‌ల్ని త‌ప్పుబ‌డుతున్నారు. మ‌హేష్ పారితోషికం రూ.50 నుంచి 60 కోట్ల లోపే ఉంటుంద‌ని, ఆ పారితోషికాన్ని బాలీవుడ్ నిర్మాత‌లు ఎందుకు ఇవ్వ‌లేర‌ని, వంద‌ల కోట్ల పారితోషికాలు తీసుకొనే హీరోలు బాలీవుడ్ కి ఉన్నార‌ని, ఈ విష‌యాన్ని మ‌హేష్ గుర్తుంచుకోవాల‌ని ఘాటుగానే విమ‌ర్శిస్తున్నారు. అయితే బాలీవుడ్ క్వీన్ కంగ‌నా రనౌత్ మాత్రం మ‌హేష్ వ్యాఖ్య‌ల్ని స‌మ‌ర్థిస్తోంది.

 

‘మహేశ్ అన్నది నిజమే. ఆయన్ని బాలీవుడ్ తట్టుకోలేదు. బాలీవుడ్ నుంచి ఎంతోమంది నిర్మాత‌లు మ‌హేష్‌ని సంప్రదించారని నాకు తెలుసు. కానీ.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ దేశంలోనే నెంబర్ 1 ఇండస్ట్రీగా నిలిచింది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి తగిన రెమ్యూనరేషన్‌ని బాలీవుడ్ ఇవ్వలేదు. పరిశ్రమపై, ఆయన పనిపై గౌరవం చూపడం వల్లనే మహేశ్ ఈ స్థాయిలో ఉండగలిగాడు. దాన్ని మనం ఒప్పుకోవాలి. తెలుగు చిత్ర పరిశ్రమ గత 10, 15 ఏళ్లలో తమిళ పరిశ్రమతోపాటు ఇతర ఇండస్ట్రీలు అన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్లిపోయింది. కాబట్టి, వారి నుంచి మనం చాలా నేర్చుకోవాలి’ అంటూ విశ్లేషించింది. బాలీవుడ్ వాళ్లు ఎడ్డెం అంటే.. కంగ‌నా తెడ్డెం అన‌డం అల‌వాటే. అందుకే కంగ‌నా ఇలా స్పందించింద‌ని విమర్శ‌కులు ఇప్పుడు కంగ‌నాపై రివ‌ర్స్ అవుతున్నారు.

ALSO READ: స‌ర్కారు వారి పాట‌.. తొలిరోజే రికార్డుల వేట‌