ENGLISH

హిందీలో కామ్రేడ్ గా కార్తీక్ ఆర్యన్.

31 August 2020-10:00 AM

గత కొంతకాలంగా రీమేక్ సినిమాలు జోరు అన్ని ఇండస్ట్రీలో కూడా కొనసాగుతోంది. ముఖ్యంగా ఎన్నో తెలుగు సినిమాలను హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. అలాంటి లిస్టులో ఉన్న ఒక సినిమా 'డియర్ కామ్రేడ్'. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తీసుకున్నారు. ఈ సినిమాను ప్రస్తుతం హిందీలో రీమేక్ చేసేందుకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.

 

ఈ సినిమా రైట్స్ తీసుకున్న మొదట్లో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా రీమేక్ చేయాలని కరణ్ జోహార్ అనుకున్నారట. అయితే ఈ మధ్య స్టార్ కిడ్స్ విషయంలో ప్రేక్షకుల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒక సినిమాలో స్టార్ కిడ్ ఉన్నారు అంటే ఆ సినిమా టీజర్, ట్రైలర్లకు భారీగా డిస్ లైక్స్ వస్తున్నాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో ఆ సినిమాపై వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ విషయాలన్నీ గమనించిన కరణ్ జోహార్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నారట.

 

ఇషాన్ ఖట్టర్ కు బదులుగా ఈ సినిమాలో యువ హీరో కార్తీక్ ఆర్యన్ ఎంచుకున్నారని వార్తలు వస్తున్నాయి. 'సోను కే టిటూ కే స్వీటి' లాంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించిన కార్తీక్ ఆర్యన్ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోషించిన పాత్రకు చక్కగా సూట్ అవుతాడని ఇప్పటికే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

ALSO READ: త్రివిక్ర‌మ్ కి ఓకే చెప్పేస్తాడా?