ENGLISH

Kiran Abbavaram: నెపోటిజం లేదంటూనే.. ఏమిటా కామెంట్స్

22 February 2023-16:02 PM

నెపోటిజం.. ఈమ‌ధ్య త‌ర‌చూ వినిపిస్తున్న‌మాట‌. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో కుటుంబాల ఆధిప‌త్య ధోర‌ణికి మ‌రో పేరు నెపోటిజం. హీరో కొడుకు హీరో అవ్వ‌డం, నిర్మాత, ద‌ర్శ‌కుడి వార‌సులు సైతం చిత్ర‌సీమ‌లోనే తిష్ట వేయ‌డం నెపొటిజానికి ప‌రాకాష్ట‌. కొత్త హీరోలెవ‌రొచ్చినా నెపొటిజానికి బ‌లైపోవాల్సిందే. దీనిపై కొంత‌మంది హీరోలు, హీరోయిన్లు గొంతు విప్పి మాట్లాడారు. త‌మ‌ని తొక్కేస్తున్నారంటూ.. బోరుమ‌న్నారు. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌ర‌పు కూడా నెపొటిజ‌మ్ పై కొన్ని ఆస‌క్తిక‌మైన వ్యాఖ్య‌లు చేశాడు.

 

టాలీవుడ్ లో నెపొటిజ‌మ్ లేదంటూనే, త‌న‌ని కూడా తొక్కేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. త‌ను క‌థానాయ‌కుడిగా న‌టించిన `విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ‌` ఇటీవ‌లే విడుద‌లైంది. ఈ సినిమా మంచి వ‌సూళ్లే ద‌క్కించుకొంది. ఈ సంద‌ర్భంగా స‌క్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ మీట్ లో కిర‌ణ్ మాట్లాడాడు. త‌న సినిమా విడుద‌ల‌వుతుంటే, కొంత‌మంది సోష‌ల్ మీడియాలో నెగిటీవ్ ప్ర‌చారం చేస్తున్నార‌ని, కావాల‌ని త‌న‌ని తొక్కేయాల‌ని అనుకొంటున్నార‌ని, ఎవ‌రెన్ని ప్ర‌య‌త్నాలు చేసినా, తాను మాత్రం చిత్ర‌సీమ‌ని వ‌దిలేసి వెళ్ల‌న‌ని చెప్పుకొచ్చాడు కిర‌ణ్‌. చిత్ర‌సీమ‌లో నెపొటిజ‌మ్ లేద‌ని, త‌న‌ని అగ్ర హీరోల కుటుంబాలే ఎక్కువ ప్రోత్స‌హిస్తున్నాయ‌ని గుర్తు చేశాడు. నెపొటిజ‌మ్ లేదంటూనే త‌న‌ని ఎవ‌రో తొక్కేస్తున్నార‌ని చెప్ప‌డంలో ఆంత‌ర్యం ఏమిటో?