ENGLISH

నిర్మాత స‌రే... మ‌రి హీరో ఎవ‌రు?

11 May 2022-11:07 AM

సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌యోపిక్ ఇప్పుడు తెర‌పైకి వ‌చ్చింది. తెలుగు చిత్ర‌సీమ‌లో కృష్ణ‌ది ఓ సువ‌ర్ణ అధ్యాయం. ఆయ‌న చేయ‌ని ప్ర‌యోగాలు లేవు. ఆయ‌న చూడ‌ని హిట్లు లేవు. సినిమా టైటిల్ లాగానే `సాహ‌స‌మే ఊపిరి`గా బ‌తికిన చ‌రిత్ర‌. ఎన్టీఆర్‌.ఏఎన్నార్ త‌ర‌వాత‌.. అంతటి ఇమేజ్‌, ఫ్యాన్ ఫాలోయింగ్ ద‌క్కించుకున్న హీరో. బ‌యోపిక్‌గా రావ‌ల్సినంత చ‌రిత్ర ఉంది. ఇప్పుడు మ‌హేష్ కూడా `నాన్న‌గారి బ‌యోపిక్ చూడాల‌ని ఉంది. ఎవ‌రైనా ముందుకొస్తే నేను నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తా` అని మాట ఇచ్చేశాడు. కాబ‌ట్టి ఈ బ‌యోపిక్‌కి మ‌హేష్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసిన‌ట్టే. కాక‌పోతే ఒక‌టే ప్ర‌శ్న‌.. హీరో ఎవ‌రు?

 

కృష్ణ‌ది సెప‌రేట్ బాడీ లాంగ్వేజ్‌. దాన్ని మిగిలిన వాళ్లు ప‌ట్టేసుకున్నా, పేర‌డీ లానే ఉంటుంది త‌ప్ప‌.. ఆయ‌న‌లా క‌నిపించ‌డం, ఆయ‌న‌లా న‌టించ‌డం కొంచెం క‌ష్ట‌మైన ప‌నే. మ‌హేష్ గ‌నుక ఆ పాత్ర చేస్తే... త‌ప్ప‌కుండా సూటైపోతాడు. కాక‌పోతే మ‌హేష్ మాత్రం `నేను న‌టించ‌ను` అని ముందే చెప్పేశాడు. కృష్ణ‌లా ఎత్తూ, రంగూ, ముఖ‌క‌వ‌ళిక‌లు ఉన్న న‌టుడ్ని ప‌ట్టుకోవ‌డం ఇప్పుడు క‌ష్ట‌మైన ప‌నే. ఎన్టీఆర్ బ‌యోపిక్ - బాల‌య్య చేశాడు కాబ‌ట్టి.. ఫ్యాన్స్ ఎవ‌రూ అభ్యంత‌రం చెప్ప‌లేదు. కానీ కృష్ణ వ‌ర‌కూ వ‌స్తే... న‌టుడ్ని ప‌ట్టుకోవ‌డ‌మే క‌ష్ట‌మైన ప‌ని.

ALSO READ: చిరు వ‌స్తున్నాడు.. త‌ప్పుకోండ‌హో...