ENGLISH

'మ‌గువ‌లు మాత్ర‌మే' మూవీ రివ్యూ & రేటింగ్!

12 September 2020-09:00 AM

 

నటీనటులు : జ్యోతిక, భాను ప్రియ, ఊర్వశి, శరణ్య పొన్వన్నన్ తదితరులు 
దర్శకత్వం :  బ్రహ్మా
నిర్మాత‌లు : సూర్య 
సంగీతం : జిబ్రాన్ 
సినిమాటోగ్రఫర్ : మనికందన్ 
ఎడిటర్: ప్రేమ్   


రేటింగ్‌: 2.75


జ్యోతిక ఈమ‌ధ్య స్పీడు మీద ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో విరివిగా సినిమాలు చేస్తోంది. అన్నీ క‌థానాయిక బ‌లం ఉన్న క‌థ‌లే. వాట‌న్నింటికీ సూర్య‌నే నిర్మాత‌.  త‌న సినిమాల ద్వారా ఏదో ఓ సందేశం ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల్ని తెర‌పైన చూపిస్తూనే, వాటికో పరిష్కారం చెప్పే ప్ర‌య‌త్నం చేస్తోంది. `మ‌గ‌లిర్ మ‌ట్టుం` కూడా ఇలాంటి సినిమానే. 2017లో త‌మిళంలో విడుద‌లైన సినిమా ఇది. ఇన్నాళ్ల‌కు తెలుగులో `మ‌గువ‌లు` మాత్ర‌మే రూపంలో వ‌చ్చింది. ఈ సినిమా ద్వారా జ్యోతిక  ఏం చెప్ప‌ద‌ల‌చుకుంది?  ఆ సందేశం ఎవ‌రికి చేరాలి?


* క‌థ‌


ప్ర‌భ (జ్యోతిక‌) డాక్యుమెంట‌రీ డైరెక్ట‌ర్‌. ధైర్య సాహ‌సాలెక్కువ‌. ప్రేమించుకున్న‌వాళ్ల‌కు పెళ్లిళ్లు చేయిస్తుంటుంది. జీవితం ఎలా ఉండాలి?  అనే విష‌యంపై అవ‌గాహ‌న ఉన్న అమ్మాయి. సూరి (మాధ‌వ‌న్‌)తో పెళ్లి కుదురుతుంది. అత్త‌య్య గోమాత (ఊర్వ‌శి) తో ఉంటుంటుంది. గోమాత కి ఇద్ద‌రు బాల్య స్నేహితురాళ్లుంటారు. వాళ్ల జ్ఞాప‌కాల‌తోనే కాలం వెళ్ల‌దీస్తుంటుంది. ఎక్క‌డెక్క‌డో ఉన్న మిగిలిన ఇద్ద‌రు స్నేహితురాల్ని వెదికి ప‌ట్టుకుని, ముగ్గురునీ ఓ చోట క‌లుపుతుంది ప్ర‌భ‌. అక్క‌డి నుంచి.. మూడు రోజుల పాటు... అంతా క‌ల‌సి విహార యాత్ర‌కు వెళ్తారు. రొటీన్ లైఫ్ నుంచి.. బ‌య‌ట ప్ర‌పంచంలో ప‌డ‌తారు. త‌మ క‌ష్టాల్నీ, బాధ‌ల్నీ మ‌ర్చిపోయి... బాల్య స్నేహితులు ముగ్గురూ చేసిన ప్ర‌యాణం ఏ మ‌జిలీకి చేరిందో తెలియాలంటే `మ‌గువ‌లు మాత్ర‌మే` చూడాలి.


* విశ్లేష‌ణ‌


ఇదో రోడ్ జ‌ర్నీ టైపు క‌థ‌. బాల్య స్నేహితులు ముగ్గురు.. మూడు రోజుల పాటు, ఇల్లూ, వాకిలి, సంసారం వ‌దిలి.. ప్ర‌యాణం చేయ‌డం అనేది కాన్సెప్ట్‌. ఇలాంటి కాన్సెప్టుతో ఇది వ‌ర‌కూ సినిమాలొచ్చాయి. కాక‌పోతే.. అక్క‌డ మ‌గ స్నేహితులో, ప్రేమికులో క‌లుసుకుంటే  - ఇక్క‌డ ముగ్గురు గృహిణులు క‌లుసుకుంటారు. అదీ.. బామ్మ వ‌యసులో. ఆ ముగ్గ‌రి ప్ర‌యాణం ఏమిట‌న్న‌దే ఈ సినిమా. ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్ లో నావెల్టీ ఉంది. వినోదానికి, సాహ‌సాల‌కూ ఆస్కారం ఉంది. అనుభూతులు, జ్ఞాప‌కాలు చూపించ‌డానికి ఆస్కారం దొరికింది. ముగ్గురు స్నేహితుల్ని క‌ల‌ప‌డానికి ఓ అమ్మాయి చేసే ప్ర‌య‌త్నాలు ఆక‌ట్టుకుంటాయి.

 

ఫ్లాష్ బ్యాక్ లో ఆ ముగ్గురి స్నేహాన్ని, వాళ్లు చేసే అల్ల‌రిని బాగా చూపించారు. ఏ సినిమా చూడాల‌నుకుని, థియేట‌ర్‌కి వెళ్లి.. మ‌ళ్లీ వెన‌క్కి వ‌చ్చేస్తారో, ఏ సినిమా వ‌ల్ల‌.. విడిపోవాల్సివ‌స్తుందో.. ఆ సినిమాని ఆ ముగ్గురు స్నేహితుల‌కూ చివర్లో చూపించ‌డం.. హృద‌యానికి హ‌త్తుకుంటుంది. మ‌హిళ‌ల‌కు గౌర‌వం ఇవ్వాల‌ని, ఇంట్లో అమ్మ‌ని, భార్య‌ని ప్రేమ‌గా చూసుకోవాల‌న్న సందేశాన్ని.. మ‌గ‌వాళ్ల‌కీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది సినిమా.


రోడ్ జ‌ర్నీ లాంటి క‌థ ఇది. దాన్ని ముగ్గురు సీనియ‌ర్ సిటిజ‌న్స్ మ‌ధ్య‌. ఆ వ‌య‌సులోనే వాళ్లు చేసే అల్ల‌రిని ఆక‌ట్టుకునేలా చూపించొచ్చు. కానీ ఆ ప్ర‌యాణం అంత థ్రిల్లింగ్ గా అనిపించ‌దు. ముస‌ల‌మ్మ‌ల‌కు ద‌స‌రా పండ‌గ వ‌చ్చిన‌ట్టు ఉంటుంది త‌ప్ప‌.. ఎగ్జైట్మెంట్ అనిపించ‌దు. వాళ్లు లేక‌పోవ‌డం వల్ల‌, వారి వారి ఇళ్ల‌ల్లో ఏర్ప‌డిన ఇబ్బందులు, మ‌నుషుల్లో వ‌చ్చిన మార్పు స‌రిగా చూపించ‌లేదు. గృహిణులుగా మార‌డం వ‌ల్ల వాళ్లేం కోల్పోయారో... మ‌న‌సుకు హ‌త్తుకునేలా తెర‌కెక్కించ‌లేదు. ఇవ‌న్నీ జ‌రిగి ఉంటే.. త‌ప్ప‌కుండా ఈ సినిమా జనాద‌ర‌ణ పొందేది. ఓ మంచి సినిమాగా మిగిలిపోయేది. అందుకు అనువైన వేదిక ఏర్పాటు చేసుకుని కూడా.. ద‌ర్శ‌కుడు దాన్ని స‌రిగా వాడుకోలేదు.


* న‌టీన‌టులు


జ్యోతిక‌ని హీరోయిన్ అని చెప్ప‌లేం. ఈ మూడు పాత్ర‌ల్ని క‌ల‌ప‌డానికి ఓ ప్ర‌ధాన సూత్ర‌ధారి. ఆ మూడు పాత్ర‌ల మ‌ధ్య నాలుగో పాత్ర అనుకోవాలి. భానుప్రియ‌, ఊర్వ‌శి, శ‌ర‌ణ్య‌.. వీళ్లంతా అనుభ‌వ‌జ్ఙులే. వారి వారి పాత్ర‌ల్లో ఇమిడిపోయారు. ఫ్లాష్ బ్యాక్ లో న‌టించిన ముగ్గురు అమ్మాయిలూ చ‌లాకీగా క‌నిపించారు. మాధ‌వ‌న్ అతిథి పాత్ర‌లో అలా మెరిశాడంతే. నాజ‌ర్ ఓకే అనిపించాడు.


* సాంకేతిక వ‌ర్గం


కెమెరా ప‌నిత‌నం, సంగీతం ఆక‌ట్టుకుంటాయి. మాట‌లు బాగున్నాయి. న‌దికీ - అమ్మాయిల్నీ పోలుస్తూ చెప్పిన సంభాష‌ణ‌లు ఆలోచింప‌జేస్తాయి. ద‌ర్శ‌కుడు చెప్ప‌ద‌ల‌చుకున్న పాయింట్ మంచిదే. కానీ.. దానికి మ‌రింత వినోదం జోడించాల్సింది. ఆ మూడు రోజుల ప్ర‌యాణంలో మ‌లుపులు ఉంటే బాగుండేది. పాత సినిమాల ఛాయ‌లు కొన్ని క‌నిపిస్తాయి. బాల్య జ్ఞాప‌కాలు, స్నేహం ఎప్పుడూ గొప్ప‌వే. వాటిని ఎన్నిసార్లు చూపించినా బాగానే ఉంటుంది.


* ప్ల‌స్ పాయింట్స్‌

నేప‌థ్యం
న‌టీన‌టులు


* మైన‌స్ పాయింట్స్‌
సాగ‌దీత‌


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  మ‌గాళ్లు చూడాల్సిందే

ALSO READ: వ‌కీల్ సాబ్ ఎఫెక్ట్ అంతా ఇంతా కాద‌యా!