ENGLISH

మెగా డాటర్ సుష్మిత పై ఫాన్స్ ఫైర్

15 October 2024-12:18 PM

ప్రజంట్ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ చేస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్. సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం మార్చ్ లో రానున్నట్టు సమాచారం. టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. కానీ మెగా ఫాన్స్ మాత్రం అసహనంగా ఉన్నారు. కారణం విజువల్ ఎఫక్ట్స్ బాగుండక పోవటం, రెండు చిరు లుక్, కాస్ట్యూమ్స్ పై కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. విజువల్స్ చాలా పేలవంగా ఉన్నాయని, రిలీజ్ వాయిదా పడటంతో ఆ తప్పుల్ని సరిదిద్దుకోవాలని పలువురు సూచించారు. 


తాజాగా మెగా డాటర్ సుష్మిత పై మెగా ఫాన్స్ ట్రోల్స్ మొదలు పెట్టారు. కారణం విశ్వంభర మూవీకి కాస్ట్యూమ్ డిజైనర్ చిరు పెద్ద కూతరు సుష్మిత. చిరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలు మానేశారు. తరవాత రాజకీయాల్లో ఇమడలేక అందులోంచి బయటికి వచ్చి మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నారు. చిరు రీ ఎంట్రీ మూవీ 'ఖైదీ నెం.150'. ఈ సినిమా నుంచి చిరంజీవి కాస్ట్యూమ్ డిజైనర్ గా సుష్మిత ఉంటున్నారు. విశ్వంభర టీజర్ చూసిన తర్వాత మెగా ఫాన్స్  సుష్మిత వర్క్ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్టైలింగ్ బాగోలేదని, ట్రెండ్ ని ఫాలో అవటం  లేదని, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.


లోపల టీ-షర్ట్, పైన షర్ట్, మెడలో ఒక చైన్, లాకెట్ ఇదే  సుస్మితకి తెలిసిన స్టైలింగ్ అని ఓ మెగా ఫ్యాన్ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. ఖైదీ నెం.150, ఆచార్య, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ అన్ని సినిమాల్లోనూ మెగాస్టార్ స్టైల్ ఇదే నంటూ షేర్ చేసాడు. సుష్మితకి కలర్ కాంబినేషన్స్ తెలియదని, రొటీన్ కలర్స్ తో డిజైన్స్ చేస్తోందని, ఒకప్పటి చిరు స్టైల్ బాగుండేదని, కానీ ఇప్పుడు అసలు సెట్ అవటం లేదని ఫాన్స్ కే నచ్చకపోతే మిగతా వారికి ఎందుకు నచ్చుతుందని కామెంట్స్ చేస్తున్నారు.