ENGLISH

పెదరాయుడు పరువు పోయే

11 December 2024-14:44 PM

గత కొన్ని రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన సంగతి తెలిసిందే. ఆస్తి వివాదాల నేపథ్యంలో మనోజ్, మోహన్ బాబు ఘర్షణ పడి ఒకరి పై ఒకరు కేసులు పెట్టుకున్నారు. తన పై దాడి చేసారని మనోజ్ కొందరిపై కేసు ఫైల్ చేయగా, మోహన్ బాబు మనోజ్ వలన, అతని భార్య మౌనిక వలన తనకి ప్రాణహాని ఉందని పేర్కొనటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే మంగళవారం మోహన్ బాబు ఇంటి దగ్గర గందరగోళం నెలకొంది. ఊహించని పరిణామాలు అనేకం జరిగాయి. జల్ పల్లి లో మోహన్ బాబు ఉంటున్న ఇంటినుంచి మనోజ్ ని వెళ్లిపొమ్మని చెప్పటంతో లగేజ్ షిఫ్ట్ చేయటానికి మనోజ్ వెళ్లగా లోపలికి  రానీయలేదు. దీనితో మనోజ్ తో పాటు అతని బౌన్సర్లు గేట్లు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా, కొందరు మీడియా ప్రతినిధులు కూడా లోపలకి వెళ్లిపోయారు.

దీనితో ఆగ్రహం చెందిన మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. అంతే కాదు మనోజ్ కూడా చిరిగిన చొక్కాతో, గాయాలతో బయటికి వచ్చాడు. దీనిపై మీడియా ప్రతినిధులు ఫుల్ ఫైర్ మీదున్నారు. మోహన్ బాబుకి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తున్నారు. ఇదే ఘటనలో తాజాగా మోహన్ బాబుపై  BNS118 సెక్షన్ కింద పహాడీ షరీఫ్ పీఎస్ లో కేసు నమోదు చేశారు. మోహన్ బాబు వ్యక్తిగత విచారణకు రావాలని రాచకొండ సీపీ నోటీసులు జారీ చేసారు. అంతే కాదు విష్ణు, మోహన్ బాబు గన్స్ స్వాధీనం చేసుకున్నారు. మోహన్ బాబు బౌన్సర్లను కూడా తీసేయమని ఆజ్ఞాపించారు.

ఈ ఘటనలతో కలత చెందిన మోహన్ బాబు అస్వస్థతకు గురి అయ్యి గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు చేసిన దాడిని ఖండిస్తూ జర్నలిస్టు సంఘాలు టీయూడబ్ల్యూజే, హెచ్‌యూజే, డబ్ల్యూజేఐ, ఫిల్మ్‌ జర్నలిస్ట్ అసోసియేషన్ నిరసనలు చేస్తున్నాయి. మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మనోజ్ కూడా వారికి మద్దతిస్తూ మోహన్ బాబుకి వ్యతిరేఖంగా మారారు. తన అన్న, నాన్న తరపున నేను క్షమాపణ చెప్తున్నానని పేర్కొనటం గమనార్హం.

ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మనోజ్ ని ఉద్దేశించి మొహన్ బాబు ఒక ఆడియో మెసేజ్ రిలీజ్ చేసారు. అందులో ఒక తండ్రి ఆవేదన బయటపడింది. మనోజ్ తాగుడికి బానిస అయ్యి, భార్య చెప్పుడు మాటలు విని ఇలా తయారయ్యాడని వాపోయారు. తన ఆస్తి తన ఇష్టమని నచ్చితే ఇస్తా లేదంటే ఇంకెవరికైనా ఇస్తా ఇది నా స్వార్జితం అని స్ఫష్టం చేసారు.నేను నిన్ను కనటమే తప్పు అని మోహన్ బాబు బాధపడ్డారు. ఈ రోజు  కుటుంబం ఇలా రోడ్డున పడటానికి కారణం అయిన మనోజ్ పట్ల తీవ్ర మనస్థాపం చెందినట్లు తెలిపారు మోహన్ బాబు.

ALSO READ: అదిరిపోయేలా పుష్పరాజ్ పార్టీ