ENGLISH

అక్కినేని బుల్లోడు ఈ సారి సిక్స్‌ ప్యాక్‌ పక్కా.!

29 April 2019-19:00 PM

ఎన్నాళ్లో వేచిన ఉదయం, భార్యతోనే కలిసొచ్చిన వైనం.. అన్నట్లుగా 'మజిలీ' సినిమాతో ఎట్టకేలకు సూపర్‌ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు నాగచైతన్య. ఈ సినిమా ఇచ్చిన బూస్టప్‌తో తదుపరి ప్రాజెక్ట్స్‌నీ లైన్‌లో పెట్టేశాడు. ఆల్రెడీ రియల్‌ లైఫ్‌ మేనమామ వెంకీతో 'వెంకీ మామ' సినిమా సెట్స్‌పై ఉన్న సంగతి తెలిసిందే.

 

ఈ సినిమా సెట్స్‌ పై ఉండగానే మరో సినిమానీ లైన్‌లో పెట్టేశాడు చైతూ. అదే మారుతి సినిమా. 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాతో చైతూకి మంచి హిట్‌ ఇవ్వాలనుకున్నాడు మారుతి. కానీ కుదరలేదు. దాంతో మరో సబ్జెక్ట్‌ కూడా చైతూ కోసమే ప్రిపేర్‌ చేసుకున్నాడట. ఈ సారి మారుతి సిద్ధం చేసిన ప్రాజెక్ట్‌ ఆషా మాషీగా ఉండదంటున్నాడు. హీరో క్యారెక్టర్‌ని చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్‌ చేశాడట. ఈ సినిమాలో తన క్యారెక్టర్‌ కోసం చైతూ తెగ కసరత్తులు చేస్తున్నాడట. సిక్స్‌ ప్యాక్‌ బాడీతో దర్శనమివ్వనున్నాడనీ సమాచారమ్‌. అందుకోసం చాలా కష్టపడి వర్కవుట్లు చేస్తున్నాడట చైతూ. ఇప్పటికే చాలా మంది యంగ్‌ హీరోలు సిక్స్‌ ప్యాక్‌ ట్రై చేసేశారు. అయితే చైతూ మాత్రం ఇంతవరకూ సిక్స్‌ ప్యాక్‌ జోలికి పోలేదు. కానీ కథ డిమాండ్‌ చేయడంతో మారుతి సినిమా కోసం చైతూ సిక్స్‌ ప్యాక్‌కి సై అన్నాడట. ఓ స్పెషల్‌ జోనర్‌తో ఇంతవరకూ మారుతి డైరెక్షన్‌లో తనదైన శైలిని ప్రదర్శించాడు. కొన్ని ఫెయిలైనా, కమర్షియల్‌గా మారుతి సినిమా అంటే హిట్‌ పక్కా అనే నమ్మకం కలిగించాడు. తాజాగా చైతూకి 'మజిలీ'తో ఆల్రెడీ ఓ హిట్‌ దక్కింది. 'వెంకీ మామ'పైనా ఓ మోస్తరు అంచనాలున్నాయి.

 

ఇక మారుతి సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాలిక. ఇదిలా ఉంటే, 'ఆర్‌ఎక్స్‌ 100' డైరెక్టర్‌ అజయ్‌ భూపతితో చైతూ ఓ సినిమాకి కమిట్‌ అయ్యాడనీ సమాచారమ్‌. ఈ సినిమాలో చైతూతో మరోసారి సమంత స్క్రీన్‌ షేర్‌ చేసుకోనుందట.