ENGLISH

దేవ‌ర ఫియ‌ర్‌ గీతం రివ్యూ: ఎలివేష‌న్ల‌కు ప‌ట్టాభిషేక‌మే!

20 May 2024-12:44 PM

ఎన్టీఆర్ అభిమానులు ఎప్ప‌టి నుంచో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న దేవ‌ర‌ నుంచి తొలి గీతం వ‌చ్చేసింది. ఫియ‌ర్‌ పేరుతో తొలి పాట‌ని ఎన్టీఆర్ పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందే విడుద‌ల చేసి, అభిమానుల‌కు రియ‌ల్ బ‌ర్త్ డే గిఫ్ట్ ఇచ్చేసింది చిత్ర‌బృందం. అనిరుథ్ ఈ చిత్రానికి స్వ‌రాలు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా మ్యూజిక్ కంపోజ్ చేయ‌డంలో త‌ను దిట్ట‌. ఈసారీ అదే చేశాడు. దేవ‌ర‌ థీమ్ మొత్తాన్ని ఆక‌ళింపు చేసుకొని, ఫియ‌ర్ గీతాన్ని సిద్ధం చేశాడు. దానికి తోడు రామ జోగ‌య్య శాస్త్రి క‌లం... ప‌దాల వేట‌లో ప‌రుగులు పెట్టింది. అనిరుథ్ పై తెర‌కెక్కించిన లిరిక‌ల్ వీడియో, గ్లింప్స్‌లో ఎన్టీఆర్ విజువ‌ల్స్ మంచి హైప్ ని క్రియేట్ చేశాయి.


అగ్గంటుకుంది సంద్రం.. 
భగ్గున మండే ఆకాశం.. 
దేవర మౌనమే సమరమే లేని హెచ్చరిక 
రగిలిన కోపమే మృత్యువుకైన ముచ్చెమట 
దూకే ధైర్యమా జాగ్రత్త…. దేవర ముందు నువ్వెంత... అంటూ సాగిన ఈ పాట‌ని అనిరుథ్ త‌న‌దైన శైలిలో పాడి, వైబ్రేష‌న్స్ పుట్టించాడు. ఈ పాట‌లోనే దేవ‌ర‌ థీమ్ మొత్తం ఉంది. ఆ విజువ‌ల్స్ చూస్తే ఈ క‌థ ఎలాంటిదో అర్థం అవుతుంది. సినిమాలోని ఎలివేష‌న్ దృశ్యాల‌కు ఈ పాటని వాడుకొనే ఛాన్స్ వుంది. అయితే... కొన్ని పదాలు సంగీత వాయిద్యాల‌తో క‌లిసిపోయాయి. జాగ్ర‌త్త‌గా వింటే త‌ప్ప అర్థం కాని ప‌రిస్థితి. గ‌తంలో విడుద‌ల చేసిన గ్లింప్స్‌లోని షాట్సే మ‌ళ్లీ వాడారు. కొత్త విజువ‌ల్స్ చూపిస్తే బాగుండేది. లియో టైటిల్ సాంగ్ తో  దేవ‌ర‌ పాట ద‌గ్గ‌ర‌గా ఉంద‌న్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయినా స‌రే, యూ ట్యూబ్ ని ఈ పాట షేక్ చేసేస్తోంది. కొన్నాళ్ల పాటు ఫియ‌ర్ సాంగ్ మోత మోగిపోవ‌డం ఖాయం.