ENGLISH

'ఒరేయ్ బుజ్జిగా' మూవీ రివ్యూ & రేటింగ్!

02 October 2020-07:00 AM

నటీనటులు : రాజ్ తరుణ్, హెబ్బా పటేల్, మాళవిక నాయర్ తదితరులు 
దర్శకత్వం : విజయ్ కుమార్ కొండా
నిర్మాత‌లు :  కేకే రాధా మోహన్
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫర్ : ఐ ఆండ్రూ 
ఎడిటర్: ప్రవీణ్ పుడి


రేటింగ్‌: 2.25/5


గుండె జారి గల్లంత‌య్యిందే.. తో  ఓ మంచి హిట్టు కొట్టి స‌త్తా చాటు కున్నాడు. అయితే ఆ త‌ర‌వాత‌.. ఏదీ క‌ల‌సి రాలేదు. ఎట్ట‌కేల‌కు `ఒరేయ్ బుజ్జిగా` అంటూ మ‌రో ప్ర‌య‌త్నం చేశాడు. `గుండె జారె` కీ `ఒరేయ్ బుజ్జిగా`కీ ఓ పోలిక ఉంది. అదేందంటే.. రెండూ క‌న్‌ఫ్యూజ్ డ్రామాలే. ఫోన్ నెంబ‌ర్ మార‌డం వ‌ల్ల - మ‌రో అమ్మాయిని త‌గులుకుని ప్రేమ‌క‌థ మొద‌లెట్ట‌డం `గుండె జారి గ‌ల్లంత‌య్యిందే`లో క‌నిపిస్తే - పేర్లు మార్చుకోవ‌డం వ‌ల్ల మొద‌లైన గంద‌ర‌గోళం `ఒరేయ్ బుజ్జిగా`లో క‌నిపిస్తుంది. అయితే.. ద‌ర్శ‌కుడు తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్టు తెర‌పై చూపించ‌గ‌లిగాడా, లేదా?  అస‌లు ఆ గంద‌ర‌గోళం ఎందుకు వ‌చ్చింది?  ఆ త‌ర‌వాత ఏమైంది?  అనేది తెలుసుకోవాలంటే `ఒరేయ్ బుజ్జిగా` చూడాలి.


* క‌థ‌


శ్రీ‌నివాస్ (రాజ్ త‌రుణ్‌)ని అంద‌రూ బుజ్జీ అని పిలుచుకుంటుంటారు. ఇంజ‌నీరింగ్ పూర్తి చేశాక‌.. ఓ మంచి సంబంధం చూసి, పెళ్లి చేసేయాల‌ని ఇంట్లో వాళ్లు ఫిక్స‌వుతారు. అది న‌చ్చక‌... ఇంట్లోంచి పారిపోతాడు బుజ్జి.  స‌రిగ్గా అదే స‌మ‌యంలో, అదే ఊరిలో ఉన్న కృష్ఱ‌వేణి (మాళ‌విక నాయ‌ర్‌) కూడా త‌న‌కు ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ఇంట్లోంచి పారిపోతుంది. అయితే ఊర్లో వాళ్లు మాత్రం బుజ్జి, కృష్ణ‌వేణి క‌లిసే పారిపోయారు అనుకుంటారు. రైలులో ఒక‌రికి ఒక‌రు ఎదురైన‌ బుజ్జి, కృష్ణ‌వేణిలు త‌మ అస‌లు పేర్లని శ్రీ‌నివాస్‌, స్వాతిలుగా చెప్పుకుంటారు. అలానే వాళ్ల ప‌రిచయం మొద‌ల‌వుతుంది.

 

శ్రీ‌నివాస్‌  తాను ప్రేమించిన అమ్మాయి సృజ‌న (హెబ్బా ప‌టేల్) హ్యాండ్ ఇవ్వ‌డంతో - క్ర‌మంగా కృష్ణ‌వేణికి ద‌గ్గ‌ర అవుతాడు. కృష్ణ‌వేణి కూడా శ్రీ‌నివాస్ ని ఇష్ట‌ప‌డుతుంది. అయితే ఊర్లో ప‌రిస్థితి వేరు. శ్రీ‌నివాస్‌- కృష్ణ‌వేణిలు లేచిపోయార‌ని భావించి, రెండు కుటుంబాలూ ఘ‌ర్ష‌ణ ప‌డుతుంటాయి. దాంతో కృష్ణ‌వేణినే స్వాతి అని తెలియ‌ని శ్రీ‌నివాస్ కృష్ణ‌వేణి కోసం వెదుకుతుంటాడు. బుజ్జిగాడే శ్రీ‌నివాస్ అని తెలియ‌ని కృష్ణ‌వేణి బుజ్జిగాడిపై ప‌గ పెంచుకుంటుంది. మ‌రి ఈ క‌న్‌ఫ్యూజన్ డ్రామాకి ఎప్పుడు ఎక్క‌డ ఎలా తెర‌ప‌డింది?  బుజ్జిగాడు, కృష్ణ‌వేణి ఎలా క‌లిశార‌న్న‌ది మిగిలిన క‌థ‌.


* విశ్లేష‌ణ‌


ఇలాంటి క‌న్‌ఫ్యూజ‌న్ డ్రామాలు క‌థ‌లుగా చెప్పుకున్న‌ప్పుడు బాగుంటాయి. అనుకున్న‌ది అనుకున్న‌ట్టు తీస్తే మంచి ఫ‌లిత‌మూ వ‌స్తుంది. కానీ ఇక్క‌డ కావ‌ల్సింది మంచి స‌న్నివేశాలు ప‌డ‌డం. పాత్ర‌లు క‌న్‌ఫ్యూజ్ అవ్వాలి త‌ప్ప‌, వాటిని చూస్తూ ప్రేక్ష‌కుడు, తీస్తూ ద‌ర్శ‌కుడు క‌న్‌ఫ్యూజ్ అవ్వ‌కూడ‌దు. `బుజ్జిగాడు`లో జ‌రిగింది అదే. ఓ గంద‌ర‌గోళ క‌థ‌ని ఎంచుకుని, ద‌ర్శ‌కుడే గంద‌ర‌గోళంలో ప‌డిపోయాడు. నిజానికి చాలా చిన్న లైన్ ఇది. అక్క‌డ‌క్క‌డే తిరిగుతుంటుంది. లాజిక్కులు ఉండ‌వు. స‌న్నివేశాల్ని ద‌ర్శ‌కుడు త‌న‌కు అనువుగా మ‌ల‌చుకుని, రాసుకుంటూ వెళ్లిపోయాడు. `నేనే బుజ్జిగాడిని..` అని రాజ్ త‌రుణ్ చెప్పేస్తే స‌రిపోయేదానికి...ఆ ఒక్క పాయింట్ ని ప‌ట్టుక‌ని క్లైమాక్స్ వ‌ర‌కూ లాగీ, లాగీ ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టాడు.


కృష్ణ‌వేణి - శ్రీ‌నివాస్ ప్రేమ‌లో ప‌డ‌డం, ఆ త‌ర‌వాతి స‌న్నివేశాలు ప‌ర‌మ బోరింగ్ గా సాగుతాయి. తొలి స‌గంతో పోలిస్తే.. ద్వితీయార్థం మ‌రింత స్లోగా న‌డుస్తుంది. ఒకే పాయింట్ ప‌ట్టుకుని క‌థ‌ని న‌డపాల్సిరావ‌డంతో ద‌ర్శ‌కుడు ఏది ప‌డితే అది రాసుకుని, ఎలా ప‌డితే అలా తీసుకుంటూ వెళ్లాడు న‌రేష్ - మాళ‌విక క‌లిసి మందు కొట్ట‌డం, ఆ త‌ర‌వాత ఆసుప‌త్రిలో క‌న్‌ఫ్యూజ్ డ్రామా ఇవ‌న్నీ ఏమీ పాలుపోక రాసుకున్న సీన్ల‌లా అనిపిస్తాయి. క‌థ‌నంలో బ‌లం ఉండి ఉంటే, ఆ క‌న్‌ఫ్యూజ్ డ్రామాని ప్రేక్ష‌కుడూ ఎంజాయ్ చేస్తుంటే.. ఆసుప‌త్రి సీను బాగుండేదే. కానీ అప్ప‌టికే ప్రేక్ష‌కుల‌లో నీర‌సం ఆవ‌హిస్తుంది. దాంతో ఆ సీను కాస్త సీరియ‌ల్ క‌న్నా దారుణంగా సాగింద‌న్న ఫీలింగ్ వ‌స్తుంది. ప‌తాక స‌న్నివేశాల్లో ఏం జ‌రుగుతుందో ముందే ఊహించేయొచ్చు.  


* న‌టీన‌టులు


రాజ్ త‌రుణ్ లో మంచి ఎన‌ర్జీ ఉంద‌న్న విష‌యం తొలి సినిమాతోనే అర్థ‌మైపోయింది. ఈ సినిమా, హీరో పాత్ర రాజ్ త‌రుణ్‌లో కొత్త కోణాలేం ఎలివేట్ చేయ‌లేక‌పోయింది. త‌న బ‌లాన్నీ పూర్తిగా వాడుకోలేదు. మాళ‌విక నాయ‌ర్ ఓకే అనిపిస్తుంది. త‌న‌దైన శైలిలో ప‌ద్ధ‌తిగా, హుందాగా సాగిన పాత్ర ఇది. హెబ్బా ప‌టేల్ ని మ‌రీ ఐటెమ్ పాత్ర‌లా తీర్చిదిద్దారు. ఆ పాత్ర నిడివి కూడా చాలా త‌క్కువ‌. చాలా రోజుల త‌ర‌వాత వాణీ విశ్వ‌నాథ్ న‌టించిన చిత్ర‌మిది. ఆ పాత్ర‌నీ స‌రిగా వాడుకోలేదు. పోసాని, స‌ప్త‌గిరి, స‌త్య‌. వీళ్ల‌వి స‌పోర్టింగ్ రోల్సే అనుకోవాలి.


* సాంకేతిక వ‌ర్గం


అనూప్ బాణీల్లో రెండు ఓకే అనిపిస్తాయి. మిగిలిన పాట‌ల్లో జోష్ లేదు. నేప‌థ్య సంగీత‌మూ అంతంత మాత్ర‌మే. ద‌ర్శ‌కుడు రాసుకున్న క‌థ‌లో విష‌యం చాలా చిన్న‌ది. దాన్ని న‌డ‌ప‌డానికి మంచి స్క్రీన్ ప్లే అవ‌స‌రం.  కానీ అవేమీ ఈ క‌థ‌లో క‌నిపించ‌లేదు. సంభాష‌ణ‌ల‌లోనూ ప‌దును లేదు. కేవ‌లం అక్క‌డ‌క్క‌డ కొన్ని సీన్లు టైమ్ పాస్ లా సాగిపోతాయంతే. ప‌గ‌ల‌బ‌డి నవ్వుకునే స‌న్నివేశాలు క‌నిపించ‌వు. మొత్తానికి బుజ్జిగాడు అక్క‌డ‌క్క‌డ కాస్త న‌వ్వించే ప్ర‌య‌త్నం చేసినా, ఎక్కువ‌గా విసిగిస్తాడు.


* ప్ల‌స్ పాయింట్స్


కొన్ని కామెడీ సీన్లు


* మైన‌స్ పాయింట్స్‌


సాగ‌దీత‌
బోరింగ్ స్క్రీన్ ప్లే


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  వీడు చాలా వీక్ రా బుజ్జీ.

ALSO READ: 'ఒరేయ్ బుజ్జిగా' ఇంగ్లిష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.