ENGLISH

ప‌ఠాన్ వ‌చ్చాడు.. ట‌పాసులు తెచ్చాడు

10 January 2023-11:30 AM

బాలీవుడ్ బాద్ షాగా పేరు తెచ్చుకొన్నాడు షారుఖ్ ఖాన్‌. ఒక‌ప్పుడు షారుఖ్ ఏది ముట్టుకొంటే అది బంగార‌మైపోయేది. అయితే కొన్నేళ్లుగా షారుఖ్ ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఐదారేళ్ల‌లో ఒక్క‌టంటే ఒక్క హిట్టు కూడా లేదు. అన్నీ ఫ్లాపులే. అవి కూడా మామూలు ఫ్లాపులు కాదు. డిజాస్ట‌ర్లు. షారుఖ్ త‌న వైభ‌వం కోల్పోతున్నాడేమో అని ఫ్యాన్స్ సైతం కంగారు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న నుంచి మ‌రో సినిమా వ‌స్తోంది. అదే `ప‌ఠాన్‌`. ఈనెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల అవుతోంది. ఇప్పుడు ట్రైల‌ర్ వ‌చ్చింది. తెలుగు వెర్ష‌న్‌లోనూ ఈ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

 

ఇదో యాక్ష‌న్ డ్రామా. దేశానికి ఓ ముప్పు వ‌స్తుంది. ఆ ముప్పు నుంచి హీరో ఎలా కాపాడాడు? అనేదే క‌థ‌. అయితే క‌థ సింపుల్ గా ఉండొచ్చు. కానీ దాన్ని తెర‌పై యాక్ష‌న్ ఎడ్వెంజ‌ర్ గా తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు సిద్దార్థ్ ఆనంద్‌. ట్రైల‌ర్ మొత్తం యాక్ష‌న్ ధ‌మాకానే. బాంబులు, మిష‌న్ గ‌న్‌లు, ఆకాశంలో ఎగ‌ర‌డాలూ, హెలీకాఫ్ట‌ర్ ఛేజింగులూ... ఇలా భారీ స్థాయిలో సాగింది. దీపికా ప‌దుకొణే క‌థ‌నాయిక‌గా న‌టించింది. త‌న గెట‌ప్పులు కొత్త‌గా ఉన్నాయి. త‌న‌తో కూడా యాక్ష‌న్ చేయించేశారు. జాన్ అబ్ర‌హాం విల‌న్ గా న‌టించాడు. షారుఖ్ - జాన్ అబ్ర‌హాం మ‌ధ్య నువ్వా? నేనా? అన్న‌ట్టు స‌న్నివేశాలు సాగిన‌ట్టు అనిపిస్తోంది. యాక్ష‌న్ అనేది.. ఎవ‌ర్ గ్రీన్ ఫార్ములా. ల‌వ్ స్టోరీల‌తో హిట్లు కొట్టిన షారుఖ్ ఇప్పుడు యాక్ష‌న్ ని న‌మ్ముకొన్నాడు. మ‌రి.. రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.