ENGLISH

మల్టీస్టారర్స్‌ వైపు మొగ్గు చూపుతున్న పవన్‌.?

19 December 2020-17:19 PM

చేతిలో ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు.. ఏకంగా ఐదు సినిమాలున్నాయి. కరోనా దెబ్బకొట్టిందిగానీ, లేకపోతే ఓ సినిమా రిలీజ్‌ అయిపోయి వుండేది. ఇంకో సినిమా రేపో మాపో విడుదల.. అన్నట్టుండేది. రాజకీయాల్లోకి వెళ్ళి సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన పవన్‌ కళ్యాణ్‌, రీ-ఎంట్రీ వ్యవహారమిది.

 

ప్రస్తుతం 'వకీల్‌ సాబ్‌' సినిమా షూటింగ్‌ పూర్తి చేసే పనిలో బిజీగా వున్నారు పవన్‌ కళ్యాణ్‌. ఇంకో నాలుగు సినిమాలు చేయాల్సి వుంది. వాటిల్లో ఒకటి ఇప్పటికే కొంత షూటింగ్‌ పూర్తి చేసుకుంది కూడా. పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో ఒకేసారి ఐదు సినిమాలు కమిట్‌ అయి వుండడం ఇంతకుముందెన్నడూ జరగలేదు. ఇదిలా వుంటే, పవన్‌ కళ్యాణ్‌ ముందుకు మరిన్ని ప్రతిపాదనలు వస్తున్నాయట. వీటిల్లో కొన్ని మల్టీస్టారర్లు కూడా వున్నాయంటున్నారు.

 

ముగ్గురు యంగ్‌ హీరోలతో పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు చేసే అవకాశముందనీ, టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడు బ్యానర్లు ఈ సినిమాల్ని నిర్మించబోతున్నాయనీ అంటున్నారు. ప్రస్తుతం ఖరారైపోయిన ఐదు సినిమాలకు ఈ మూడూ అదనం అట. గెస్ట్‌ రోల్స్‌కి ఎక్కువ, మల్టీస్టారర్‌కి తక్కువ.. అనేట్టుగా ఆ సినిమాల్లో పవన్‌ పాత్ర వుంటుందని సమాచారం. అయితే, పవన్‌ వాటికి ఓకే చెబుతాడా.? లేదా.? అన్నది ఇప్పటికైతే సస్పెన్సే. తెలుగునాట రాజకీయాల్లో అనూహ్యమైన వేడి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్‌ వేగంగా సినిమాల్ని ఒప్పుకున్నా, వాటిని పూర్తి చేయడం చాలా పెద్ద టాస్క్‌ అవుతుంది.

ALSO READ: ఔను, టాలీవుడ్‌కి ఆ తేడాల్లేవ్‌.!