ఏపీ అంతా కోలాహలంగా ఉంది. ఏపీ ప్రజలు తమ తీర్పుతో గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి, కూటమికి పట్టం కట్టారు. నిన్న చంద్ర బాబు నాయుడు సీఎం గా, మిగతావారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అతిరథ మహా రథులు మధ్య ఈ కార్యక్రమం కన్నులపండుగగా జరిగింది. పీఎం మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు, మిగతా రాష్ట్రాల సీఎం లు, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, రజనీ కాంత్ లాంటి సినీ ప్రముఖులు ఈ వేడుకకి అటెండ్ అయ్యారు. ఈ కార్య క్రమంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
కూటమి విజయం సాధించటంలో, ప్రత్యర్థిని కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టటంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర వహించారు. తన సంయమనంతో, వ్యక్తిత్వంతో మోదీ లాంటి నేతనే ఆకర్షించ గలిగాడు పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న మోదీ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో దేశాధినేతలు ముందు పవన్ ని సునామి అని ప్రశంసించి, ఆకాశానికి ఎత్తేసాడు. ఇప్పుడు పవన్, చిరు లని దగ్గరికి తీసుకుని అభినందించారు. ఇన్నాళ్ళకి పవన్ 10 ఏళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఈ రాజకీయ జర్నీలో ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డారు పవన్ కళ్యాణ్.
చిరంజీవి వారసుడిగా సినిమాలోకి వచ్చి అతి కొద్దీ కాలంలోనే అన్నను మించి కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. కానీ రాజకీయాల్లో అంతా మూళ్ళ భాట. ఈ రోజు ఈ స్థాయికి రావటానికి 10 ఏళ్ళు ఫణంగా పెట్టాడు. వ్యక్తిగత దూషణలు, చీత్కారాలు, అవమానాలు అన్నిటిని భరించి, ఓర్చుకుని తన విజయంతో అందరికీ సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ అనే నేను అన్న మాట వినగానే అభిమానుల కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం అంతా మారు మోగింది. స్టేట్ చీఫ్ గెస్ట్ హోదాలో వచ్చిన చిరంజీవి వేదిక మీద పవన్ మాట్లాడుతున్నసేపు ఆనందంతో చూస్తూ ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తరవాత పవన్ మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పి నమస్కరించి, అతిథులందరినీ పలకరిస్తూ వందనం చేస్తూ అన్నయ్య చిరంజీవి దగ్గరకు రాగానే కాళ్లకు నమస్కారం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఇది చూసిన మెగా ఫాన్స్ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అని ట్వీట్ చేస్తున్నారు.