ENGLISH

పవన్‌తో సురేందర్‌రెడ్డి పొలిటికల్‌ థ్రిల్లర్?

03 September 2020-10:00 AM

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా, పవన్‌ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడైన సినీ నిర్మాత రామ్ తాళ్ళూరి, ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. రామ్ తాళ్ళూరి, సురేందర్‌రెడ్డి సంయుక్తంగా జనసేన అధినేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, రామ్ తాళ్ళూరి సొంత నిర్మాణ సంస్థ ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ తరఫున ఓ పోస్టర్‌ విడుదల చేయడంతో.. సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రామ్ తాళ్ళూరి సినిమా దాదాపు ఖాయమైపోయినట్లే తెలుస్తోంది.

 

ఇక, ఈ సినిమా ఓ పొలిటికల్‌ థ్రిల్లర్గా వుండబోతోందట. కమర్షియల్‌ సినిమాల్ని తనదైన క్రియేటివ్‌ యాంగిల్‌లో చూపించే స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి, పవన్‌ కళ్యాణ్‌ని తెరపై ఎలా చూపిస్తారు.? అన్న ఉత్కంఠ ఇప్పుడు పవన్‌ అభిమానుల్లో వ్యక్తమవుతోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కథ ఇప్పటికే ఓకే అయిపోయిందనీ, త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడవుతాయని సమాచారం.

 

పవన్‌ ప్రస్తుతం మూడు సినిమాలకు కమిట్‌ అయి వున్నారు. అందులో ఒకటి ‘వకీల్‌ సాబ్‌’ కాగా, మరొకటి క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా. ఇంకోటి హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించే సినిమా. సో, పవన్‌.. సురేందర్‌ రెడ్డి - తాళ్ళూరి రామ్ కాంబినేషన్‌లో సినిమా చేస్తే.. అది నాలుగో ప్రాజెక్ట్‌ అవుతుందన్నమాట. వీటితోపాటుగా, పవన్‌ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లోనూ ఓ సినిమా ఖరారయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ALSO READ: లిప్ లాక్ పేరుతో చీటింగ్ చేశారా?