ENGLISH

'పెళ్లి సంద‌D' మూవీ రివ్యూ & రేటింగ్!

15 October 2021-15:35 PM

నటీనటులు: రోష‌న్, శ్రీ‌లీల, రావు ర‌మేష్‌ త‌దిత‌రులు
దర్శకుడు: గౌరీ రోణంకి
నిర్మాతలు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని
సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీర‌వాణి
సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామ
ఎడిటర్: త‌మ్మిరాజు


రేటింగ్ : 2/5

 

పాతికేళ్ల క్రితం విడుద‌లైన పెళ్లి సంద‌డి ఓ సంచ‌ల‌నం. పెద్ద పెద్ద నిర్మాత‌లంతా క‌లిసి తీసిన చిన్న సినిమా. పాట‌లు ఎవ‌ర్ గ్రీన్‌. రాఘ‌వేంద్ర‌రావు మార్క్ కి నిలువుట‌ద్దం ఈ సినిమా. కొత్త‌వాళ్ల‌తో, చిన్న వాళ్ల‌తో అద్భుతాలు సృష్టించొచ్చ‌ని నిరూపించిన సినిమా ఇది. ఇప్పుడు పాతికేళ్ల త‌ర‌వాత‌... రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మ‌రో `పెళ్లి సంద‌D` వ‌చ్చింది.

 

శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ క‌థానాయ‌కుడు కావ‌డం, కీర‌వాణి సంగీతం అందించ‌డంతో ఈ పెళ్లి సంద‌D పైన కూడా ఆశ‌లు, అంచ‌నాలు బాగా పెరిగాయి. మ‌రి ద‌ర్శ‌కేంద్రుడి మ్యాజిక్ మ‌ళ్లీ ప‌నిచేసిందా?  పాతికేళ్ల‌నాటి సంచ‌ల‌నం ఇప్పుడు పున‌రావృతం అయ్యిందా?


* క‌థ‌


వ‌శిష్ట (రోష‌న్‌) ఓ బాస్కెట్ బాల్ ప్లేయ‌ర్‌. బాస్కెట్ బాల్ లో నేష‌న‌ల్ ఛాంపియ‌న్ అవ్వాల‌న్న‌ది త‌న ఆశ‌. ఇంట్లో వ‌శిష్ట‌కి పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. అయితే వశిష్ట‌కి ప్రేమించి పెళ్లి చేసుకోవాల‌ని ఉంటుంది. ఓ పెళ్లిలో స‌హ‌స్ర (శ్రీ‌లీల‌)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. త‌న వెంట తిరుగుతాడు. అయితే స‌హ‌స్ర విధిని ఎక్కువ‌గా న‌మ్ముతుంది. మ‌నం క‌ల‌వాల‌ని దేవుడు రాత రాస్తే.. త‌ప్ప‌కుండా క‌లుస్తాం... అని చెప్పి వెళ్లిపోతుంది.

 

అయితే మ‌రోసారి కూడా వశిష్ట - స‌హ‌స్ర క‌లుస్తారు. అప్పుడే త‌న `నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నా` అంటూ త‌న మ‌న‌సులోని మాట చెప్పేస్తుంది. అయితే అనూహ్యంగా మ‌ళ్లీ చెప్పాపెట్ట‌కుండా వెళ్లిపోతుంది. వ‌శిష్ట‌తో స‌హ‌స్ర ఇలా దాగుడు మూత‌లు ఆడ‌డానికి బ‌ల‌మైన కార‌ణం ఉంది. అదేంటి?  స‌హ‌స్ర నేప‌థ్యం ఏమిటి?  వీరిద్ద‌రూ క‌లిశారా, లేదా?  అన్న‌దే మిగిలిన క‌థ‌.


* విశ్లేష‌ణ‌


చాలా రొటీన్ క‌థ ఇది. పెళ్లిలో ఓ అమ్మాయిని చూసి హీరో ప్రేమించేయ‌డం చాలా చాలా పాత క‌థే. దాన్ని కొత్త‌గానూ చూపించొచ్చు. అయితే ఆ ప్ర‌య‌త్నం ఎక్క‌డాక‌నిపించ‌లేదు. స‌న్నివేశాలు రాసుకున్న విధానంలోనూ, తీసిన ప‌ద్ధ‌తిలోనూ పాత సినిమాల ఛాయ‌లు పుష్క‌లంగా క‌నిపిస్తాయి. పాత రాఘ‌వేంద్ర‌రావు సినిమాల్లో స‌న్నివేశాల్ని రోష‌న్ పేర‌డీ చేస్తున్న‌ట్టు అనిపిస్తుంది త‌ప్ప‌, ఓ క‌థ చూస్తున్న భావ‌న తెర‌పై రాదు.

 

పెళ్లిలో కొన్ని కామెడీ స‌న్నివేశాలు న‌వ్వించినా - అందులో న‌టీన‌టుల ఓవ‌రాక్ష‌న్ తో.. చిరాకు వ‌స్తుంది. ప్రేమ‌క‌థ‌లో సంఘర్ష‌ణ చాలా అవ‌స‌రం. ఇందులో అదే లేదు. స‌హ‌స్ర క‌నిపించ‌కుండా మాయం అయిపోవ‌డానికి, మ‌ళ్లీ క‌నిపించ‌డానికి బ‌ల‌మైన కార‌ణం ఉండ‌దు. చాలా స‌న్నివేశాలు చాలా డ్ర‌మ‌టిక్ గా సాగాయి. పాత్ర‌ల్లో, స‌న్నివేశాల్లో పాత వాస‌న కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తాయి.


రాఘవేంద్ర‌రావు ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు కాదు. ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ మాత్ర‌మే చేశారు. అయితేనేం.. ప్ర‌తీ ఫ్రేములోనూ రాఘ‌వేంద్ర‌రావు మార్కే ఉంటుంది. తొలి స‌గం కంటే.. ద్వితీయార్థం మ‌రింత కంగాళీగా ఉంటుంది. రోష‌న్ ఫైట్లు కూడా చేయ‌గ‌ల‌డు అని చెప్ప‌డానికే ఫైట్ల‌ని ఇరికించిన‌ట్టు తెలుస్తుంది. సెకండాఫ్‌లో  క‌థ‌ని ఎలా న‌డిపించాలో అర్థం కాలేదు. రెండు మూడు కామెడీ ట్రాకులు పెట్టి, సీన్ల‌ని లాగ‌డానికి ప్ర‌య‌త్నించారు. తండ్రీ కొడుకుల మ‌ధ్య ఎమోష‌న్ బ‌లంగా పండ‌లేదు. ఏ పాత్ర‌నీ స‌రిగా డిజైన్ చేసుకోలేదు.


* న‌టీన‌టులు


రోష‌న్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. త‌న‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంది. కాక‌పోతే.. మంచి క‌థ‌ల్ని ఎంచుకోవాలి. ఈ ఏజ్ ఓల్డ్ క‌థ‌లో.. త‌ను స‌రిగా రాణించ‌లేక‌పోయాడు. శ్రీ‌లీల రాఘ‌వేంద్ర‌రావు మార్క్ హీరోయిన్ లా, యాపిల్ పండులా మెరిసిపోయింది.

 

డాన్సుల్లో స్పీడు ఉంది. న‌ట‌న కూడా ఓకే. త‌న‌కి మ‌రికొన్ని అవ‌కాశాలు వ‌స్తాయి. గంగోత్రి నాటి ప్ర‌కాష్‌రాజ్‌ని మ‌ళ్లీ తెర‌పై చూసిన ఫీలింగ్ క‌లిగింది. త‌న న‌ట‌న ఏం మార‌లేదు. రావు ర‌మేష్ కూడా అంతే.  రాఘ‌వేంద్ర‌రావుని న‌టుడిగా ప‌రిచ‌యం చేసిన సినిమా ఇది. ఇన్నాళ్ల‌కు ఆయ‌న న‌టిస్తున్నారంటే పాత్ర‌లో ఏదో విశిష్ట‌త ఉంటుంద‌నుకుంటారు. అలాంటిదేం ఆయ‌న పాత్ర నుంచి ఆశించ‌కూడ‌దు.


* సాంకేతిక వ‌ర్గం


రాఘ‌వేంద్ర‌రావు సినిమాల‌కెప్పుడూ కీర‌వాణి ఉత్త‌మ సంగీతాన్నే అందించారు. ఈ సినిమాలోనూ పాట‌లు ఆక‌ట్టుకుంటాయి. బుజ్జులు పాట మంచి మాస్ గీతం. మిగిలిన‌వ‌న్నీ ఓకే అనిపిస్తాయి. నేప‌థ్య సంగీతంతో చాలా చోట్ల స‌న్నివేశాన్ని ఎలివేట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. శ్రీ‌ధ‌ర్ సిపాన మాట‌ల్లో మెరుపులు చాలా త‌క్కువ‌. ప్రాస‌లెక్కువ‌. క‌థ చాలా పాత‌ది. దాన్ని కొత్త‌గా తీయాల‌ని ఏమాత్రం ప్ర‌య‌త్నించ‌లేదు. పాత రాఘ‌వేంద్ర‌రావు సినిమాల‌న్నీ మిక్సీలో వేసి, తీసిన‌ట్టుగా త‌యారైంది.


* ప్ల‌స్ పాయింట్స్‌


శ్రీ‌లీల గ్లామ‌ర్ సీన్స్‌
పాట‌లు


* మైన‌స్ పాయింట్స్‌


క‌థ‌
క‌థ‌నం
టేకింగ్‌


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్:   మ్యాజిక్ చేయ‌లేని `పెళ్లి సంద‌డి`

ALSO READ: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ రివ్యూ & రేటింగ్!