ENGLISH

పుష్ప 2 ది రూల్‌ మూవీ రివ్యూ & రేటింగ్‌

05 December 2024-10:22 AM

చిత్రం: పుష్ప 2 ది రూల్‌
దర్శకత్వం: సుకుమార్
కథ - రచన: సుకుమార్

నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక, ఫాహద్ ఫాజిల్, సునీల్, రావు రమేష్, అనసూయ, జగపతి బాబు, ధనుంజయ, జగదీశ్‌ ప్రతాప్‌ భండారి, తారక్‌ పొన్నప్ప, అజయ్‌, శ్రీతేజ్ తదితరులు.

నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, రవి యలమంచిలి

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: మిరాస్లోవ్‌ కూబా బ్రోజెక్‌
ఎడిటర్: నవీన్‌ నూలి

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌

విడుదల తేదీ: 5 డిసెంబర్ 2024

ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 3/5

ఇంగ్లీష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా 'పుష్ప 2' ఫైనల్ గా రిలీజ్ అయ్యింది. ఎప్పటి నుంచో పుష్ప రాజ్ రాకకోసం సినీప్రియులు వెయిట్ చేస్తున్నారు. పుష్ప మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి డివైడ్ టాక్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. కానీ పుష్ప 2 హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతోంది. మొదటి నుంచి పార్ట్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే, పాటలు, ట్రైలర్, ఈవెంట్స్, అన్నీ ప్రభంజనం సృష్టించాయి. రిలీజ్ కి ముందే 1200 కోట్లు బిజినెస్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో యూఎస్ థియేటర్స్ లో 100 కోట్లు వసూల్ చేయటం గమనార్హం. ఇన్ని అంచనాల మధ్య పుష్ప 2 రిలీజ్ అవటం ఒక ఎత్తు అయితే, మెగా అల్లు వివాదాలతో యాంటీ బన్నీ ఫాన్స్ పుష్ప 2 ని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఒక పక్క పుష్ప విప్లవం, ఇంకో పక్క మెగా విప్లవం. వీటిన్నిటిని దాటుకుని బన్నీ విజయం సాధిస్తాడా? అసలు పుష్ప 2 రూలింగ్ చేశాడా లేదా అన్నది ఈ రివ్యూ లో చూద్దాం.

కథ:

శేషాచలం అడవుల్లో కూలీగా ప్రయాణం మొదలుపెట్టిన పుష్పరాజ్ (అల్లు అర్జున్) ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌ను నడిపే నాయకుడిగా ఎదుగుతాడు. తన ఎదుగుదలకి  ఎవ్వరు అడ్డు వచ్చినా, తగ్గేదేలే అంటూ ఢీ కొట్టడమే అతడి నైజం. డబ్బంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు. తన పేరునే ఓ బ్రాండుగా మార్చేస్తాడు. ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజిల్)తో పెరిగిన వైరం పెద్దదవుతుంది. పుష్ప తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకీ విస్తరించడంపై దృష్టిపెడతాడు. పుష్ప బయట ఫైర్ కానీ, ఇంట్లో పెళ్లాం శ్రీవల్లి (రష్మిక మందన్న) మాట జవదాటడు. ఒకసారి పుష్ప సీఎం ని కలవటానికి వెళ్ళేటప్పుడు సీఎంతో కలిసి ఫొటో తీసుకోమని చెప్తుంది. కోట్లకి కోట్లు అధికార పార్టీకి ఫండ్స్ ఇచ్చే పుష్ప అదెంత పని అనుకుంటాడు. శ్రీవల్లి కోరిక తీర్చాలని పుష్ప కూడా ఆశపడతాడు. ఎమ్మెల్యే సిద్ధప్ప నాయుడు (రావు రమేష్)తో కలిసి సీఎం దగ్గరికి వెళతాడు. సీఎం స్మగ్లర్లు తో ఫొటో తీసుకోవటం ఏంటని, శ్రీవల్లిని కూడా అవమానిస్తూ మాట్లాడతాడు. దీంతో పుష్ప అహం దెబ్బతింటుంది. సీఎంనే మార్చాలని పుష్పరాజ్‌ డిసైడ్‌ అవుతాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్దప్పను చేయాలనుకుంటాడు. తరువాత పుష్ప ఏం చేస్తాడు? షెకావత్‌ని ఎదుర్కొంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు? మిగతా శత్రువుల వలన పుష్ప ఎదుర్కొన్న ఒడిదుడుకులు? పుష్ప నేషనల్ నుంచి ఇంటర్ నేషనల్ కి ఎదిగిన తీరు? కేంద్రమంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)కీ, పుష్పకీ ఉన్న సంబంధం ఏంటి? ఇద్దరి మధ్య శత్రుత్వం ఎందుకు? తనను తప్పించి సిండికేట్‌ లీడర్‌గా ఎదిగిన పుష్పరాజ్‌ పై పగ తీర్చు కోవటానికి మంగళం శ్రీను(సునీల్‌), దాక్షాయణి(అనసూయ)వేసిన ప్లాన్ లు ఏంటి? పుష్పరాజ్‌ కొరిక మేరకు సిద్దప్పను సీఎం చేశాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: 

మొదటి పార్ట్ పుష్ప లో కథ ఉంది. కానీ పార్ట్ 2లో కేవలం హీరో ఎలివేషన్స్ పైనే ద్రుష్టి పెట్టి, కథకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు సుకుమార్. కానీ కథ లేదు అన్న ఫీలింగ్ ప్రేక్షకుడికి కలగకుండా ఎంగేజ్ చేయగలిగాడు. పుష్ప అనే మత్తుని ఇంకొంచెం పెంచాడు పుష్ప 2 తో సుకుమార్. ఫస్ట్ పార్ట్ లో కంటే పార్ట్ 2 లో కథ, మేకింగ్‌ పరిధినీ పెంచాడు. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్, ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నట్టుగానే ఉంది సినిమా. మొదటి నుంచి ఈసినిమాపై ఉన్న అంచనాలను రీచ్ అయ్యేలా ఉంది పుష్ప 2. పుష్ప అంటే నిజంగానే బ్రాండ్, ఆ బ్రాండ్ మరోకసారి వరల్డ్ వైడ్ గా వ్యాపిస్తుంది అనటంలో సందేహం లేదు. పుష్ప సిరీస్ లో అల్లు అర్జున్ తప్ప ఏమీ కనిపించవు ఎవరూ కనిపించరు. సుకుమార్ స్క్రీన్ ప్లే తో కథలో ఆసక్తి పెంచాడు. ప్రతి సీన్ నార్మల్ గా ఉంటూనే ఫినిషింగ్ అదుర్స్ అనేలా ఉంది. పుష్ప పార్ట్ వన్ లో హీరో ఎలివేషన్స్ మైండ్ బ్లోయింగ్, పార్ట్ 2 హీరోయిజం అంతకు మించి అనేలా ఉంది. బన్నీ ఫాన్స్ కి మంచి మాస్ మసాలా సినిమాతో ఫుల్ మీల్స్ పెట్టాడు సుకుమార్. ఇంటర్ నేషనల్ ఫైర్ తో జపాన్ నుంచి ప్రారంభం చేసాడు. షెకావత్ పట్టుకున్న పుష్ప మనుషుల్ని పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి విడిపించు కోవటం, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి ఎదుర్కొన్న అవమానానికి ప్రతీకగా పుష్ప రాజ్ చేసే తన మార్క్ రాజకీయం, వాటితోనే పుష్ప పాత్రని పూర్తిగా పరిచయం చేశాడు. మాల్దీవుల్లో బిజినెస్, షెకావత్ ని ఎదుర్కోవటానికి పుష్ప వేసే ఎత్తులు, మంచి ఫీలింగ్ ని ఇస్తాయి ప్రేక్షకుడికి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది. కేవలం స్మగ్లింగ్ నేపథ్యమే కాదు, ఫ్యామిలీ లైఫ్ కి ప్రాధాన్యత ఇచ్చారు సుకుమార్. స్మగ్లర్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో సత్తాచాటే పుష్ప ఇంట్లో పెళ్ళాంకి ఎంత విలువ ఇస్తాడో, భార్యమాట జవదాటని భర్తగా పుష్ప ప్రవర్తన కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంది. పుష్ప, శ్రీవల్లి మధ్య వచ్చే సీన్స్ తో భార్య భర్తల బాండింగ్ ని అద్భుతంగా చూపించారు. వారి ప్రేమ, పీలింగ్స్ అన్నీ సూపర్. ఏవీ ఎబ్బెట్టుగా అనిపించవు. వారి మధ్య వచ్చే రొమాన్స్ సీన్స్ కూడా ఇబ్బంది కలిగించవు. ట్రైలర్ లో ఒక చోట భర్త, భార్య మాట వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా అన్న మాట వాస్తవం. పుష్ప 2 అదే కాన్సెప్ట్ తో సాగింది.

మొదటి నుంచి టీమ్ జాతర సీన్స్ హైలెట్ అని చెప్తూనే ఉన్నారు. అది హండ్రెడ్ పర్సెంట్ నిజం. సెకండ్ హాఫ్ లో వచ్చే  గంగమ్మ జాతర ఎపిసోడ్  గూస్ బంప్స్ తెప్పిస్తుంది. బన్నీ తన నట విశ్వరూపం చూపించాడు. జాతర ఎపిసోడ్‌లో హీరోయిజం, ఎమోషన్స్ అన్నీ సమతూకం లో నడిచాయి. ఈ ఎపిసోడ్ లోనే శ్రీవల్లి పాత్ర కూడా హైలెట్ అయ్యింది. హీరోతో సమానంగా హీరోయిన్ కి నటనకి స్కోప్ ఉన్న సీన్ ఇది. జాతర సీన్ తరవాత రెండు వేల కోట్ల విలువైన  ఎర్రచందనాన్ని దేశ సరిహద్దులు దాటించటం ఉత్కంఠగా ఉంటుంది. కథపై కాకుండా ఎలివేషన్స్‌, యాక్షన్‌ సీన్స్‌పై సుకుమార్ ఎక్కువ ఫోకస్‌ చేశారని చాలా సీన్స్ ద్వారా ప్రస్ఫుటం అవుతుంది. ఫస్ట్ హాఫ్  కంటే సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ సీన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు సుకుమార్. కొంచెం నిడివి ఎక్కువ ఉన్నా ప్రేక్షకుడికి ఆ విషయం ఇబ్బందిగా అనిపించదు. సెకండ్ హాఫ్ లో వచ్చే పుష్ప, షెకావత్‌ సీన్స్ కొంచెం సిల్లీగా తేలిపోయాయి. వాటిని ఎడిట్ చేసిన నష్టమేమి ఉండదు. రన్ టైం తగ్గే ఛాన్స్ ఉంటుంది. మొదటి పార్ట్ లో షెకావత్ పాత్ర చాలా బలంగా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ లో షెకావత్ పాత్ర తేలిపోయింది. షెకావత్‌ పాత్ర ఇంట్రడ్యూస్ చేయటం బాగుంది, కానీ అదే తరహాలో మెయిన్ టైం చేయలేకపోయారు. విలన్‌ పాత్ర ఎంత బలంగా ఉంటే హీరో పాత్ర అంత ఆకట్టుకుంటుంది. కానీ ఇక్కడ నార్మల్ సినిమాలు లాగానే  షెకావత్ తేలిపోయి, పుష్ప హైలెట్ అయిపోయాడు. మొదటి పార్ట్ లో మెయిన్ లీడ్ గా ఉన్న మంగళం శ్రీను, ద్రాక్షాయణి పాత్రలు సెకండ్ పార్ట్ లో ప్రభావం చూపలేక పోయాయి. వారికి అంత ప్రాధన్యత లేదు. క్లైమాక్స్‌కి ముందు వచ్చే యాక్షన్‌ సీన్‌ సూపర్. పుష్ప 3 లీడ్ బాగుంది.

నటీ నటులు:

పుష్ప అంటేనే బన్నీ, బన్నీ అంటే పుష్ప అన్నట్టు మారిపోయింది. పుష్ప సిరీస్ లో బన్నీ వన్‌ మ్యాన్‌ షో. సినిమా మొత్తం అల్లు అర్జున్ మాత్రమే కనిపిస్తాడు. బన్నీ ఒక సీన్, ఒక పాటకే కాదు, ఒక ఎక్స్ప్రెషన్ కోసం కూడా బాగా కష్ట పడతాడు అని సుకుమార్ హైద్రాబాద్ ఈవెంట్ లో చెప్పిన మాట పదే పదే గుర్తుకు వస్తుంది. పుష్ప 2 చూసినప్పుడు. యాక్షన్ సీన్స్ లో నిజంగా 'తగ్గేదేలే' అన్నట్లు ఉంది బన్నీ నట విశ్వరూపం. జాతర ఎపిసోడ్‌, క్లైమాక్స్‌కి ముందు వచ్చే యాక్షన్‌ సీన్‌లో బన్నీ నటన గూర్చి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నటన, డైలాగ్స్, హావభావాలూ, ఆహార్యం అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయి. ఈ సీన్ చూసినప్పుడు పుష్ప లో బన్నీని తప్ప వేరొకరిని ఊహించలేము. పుష్పరాజ్ అల్లు అర్జున్ కి మరొక నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదు. బన్నీ తరువాత చెప్పుకోదగిన పాత్రలో కని పించింది రష్మిక. పుష్ప మాత్రమే బ్రాండ్ కాదు శ్రీవల్లి పాత్ర కూడా బ్రాండ్ అని నిరూపించింది రష్మిక. డీగ్లామర్‌ పాత్రలో రష్మిక నటనతో కట్టిపడేసింది. పార్ట్‌ 1 లో రష్మిక పాత్ర నిడివి తక్కువ, కానీ ఈ పార్ట్ లో నిడివి, ప్రాధన్యత రెండూ ఎక్కువే. రష్మిక చిత్తూరు యాసలో డైలాగ్స్ అదరగొట్టింది. ముఖ్యంగా జాతర ఎపిసోడ్‌లో శ్రీవల్లి చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. రష్మిక కెరియర్ లో గుర్తుండిపోయే పాత్ర ఇది. షెకావత్‌గా ఫహద్‌ పాజిల్‌ నటన అద్భుతం. తెలుగులో ఫాహద్ కి మరిన్ని ఛాన్స్ లు రావొచ్చు. ఎంపీ సిద్దప్పగా  రావు రమేశ్‌ నటన బాగుంది. కన్నడ యాక్టర్ తారక్‌ పొన్నప్పకు మంచి పాత్ర పడింది. బన్నీ, తారక్ పొన్నప్ప మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. శ్రీలీల కిస్సిక్ పెర్ఫామెన్స్ కిర్రాక్ గా ఉంది. బన్నీ లాంటి డాన్సర్ తో పోటీ పడి డ్యాన్స్‌ చేసి తగ్గేదేలే అనిపించింది. సునీల్‌, అనసూయ పాత్రలకి పెద్దగా స్కోప్ లేదు. కేంద్రమంత్రి ప్రతాప్‌ రెడ్డిగా జగపతి బాబు డిగ్నిటీ గా ఉన్నారు. జగదీశ్‌, ధనుంజయ, అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

టెక్నికల్:

సినిమా టెక్నికల్ గా కూడా రిచ్ గా, ది బెస్ట్ అనేలా ఉంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్  లెక్కలని హండ్రడ్ పర్శంట్ చేరుకుంది. సుకుమార్ టేకింగ్ , స్క్రీన్ ప్లే 3 గంటలకి పైగా ఆడియన్స్ ని మెప్పించగలిగింది. కథ లేదు అన్న వెలితి తెలియకుండా కేవలం హీరో ఎలివేషన్స్ తోనే ఆడియన్స్ ని ఎంగేజ్ చేయగలిగిన ఘనత సుకుమార్ కే దక్కుతుంది. జాతర ఎపిసోడ్ సుకుమార్ టేకింగ్ మార్క్ ని మరింత పెంచింది. పుష్ప అనే బ్రాండ్ ఓనర్ సుకుమార్ అని మరోసారి రుజువయింది. మూడేళ్లు ప్రేక్షుకుడి వెయిటింగ్ కి సాకారం లభించింది. ఎక్కడా రాజీపడకుండా సుకుమార్ ఈ మూవీని తెరకెక్కించారని అర్థం అవుతోంది. అందుకే మూడేళ్లు టైం తీసుకున్నారని స్పష్టం అవుతోంది. సుకుమార్ మేకింగ్‌, హీరోయిజం ఎలివేషన్స్, ఎమోషన్స్ అన్నిటిని మిక్స్ చేస్తూ సుకుమార్ తీసుకున్న కేర్ సినిమాకి ప్రధాన బలం. హీరోయిన్ పాత్రకి కూడా మంచి ఇంపార్టెన్స్ ఇవ్వటం గ్రేట్. మొదటి పార్ట్ లానే పుష్ప రూల్ లో పాటలు కూడా వినటానికి చూడటానికి బాగున్నాయి. ప్లేస్ మెంట్ పర్ఫెక్ట్ట గా కుదిరింది. పాటలుతో పాటు దేవిశ్రీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ప్లస్ అయ్యింది. మ్యూజిక్ డైరక్టర్స్ విషయం లో నెలకొన్న గందరగోళం సినిమాపై ప్రభావం చూపలేదు. దేవి శ్రీ తో పాటు సామ్ సీఎస్ అందించిన నేపథ్య సంగీతం కూడా మంచ్చి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కూబా కెమెరా వర్క్ సూపర్ గా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ డిపార్ట్ మెంట్ కష్టం ప్రతి ప్రేమ్ లోనూ కనిపించింది. ఎడిటింగ్ పై ఇంకొంచెం ద్రుష్టి పెట్టి ఉంటే బాగుండేది. శ్రీకాంత్ విస్సా  రాసిన మాటలు ఆడియన్స్ కి బాగా రీచ్ అవుతాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రతి సీన్ లోను రిచ్‌నెస్ కనిపిస్తుంది. ఎక్కడ ఖర్చుకి వెనకాడలేదని తెలుస్తోంది.

ప్లస్ పాయింట్స్ 

అల్లు అర్జున్
పాటలు, డాన్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్
జాతర ఎపిసోడ్
సుకుమార్

మైనస్ పాయింట్స్ 

నిడివి 
విలన్ పాత్ర 
ఎడిటింగ్

ఫైనల్ వర్దిక్ట్ : మాస్ జాతర "పుష్ప 2 ది రూల్ "

ALSO READ: Pushpa 2 The Rule Movie Review and Rating