ENGLISH

Rashmika: నేనేం మాట్లాడిన తప్పే.. రష్మిక ఆవేదన

14 January 2023-16:05 PM

‘పుష్ప’తో తన కెరీర్‌లో మరో విజయాన్ని అందుకుంది రష్మిక. ప్రస్తుతం ‘పుష్ప ది రైజ్‌’ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్న రష్మిక బాలీవుడ్‌పైన ఫోకస్‌ పెట్టింది. బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న తన తదుపరి చిత్రాల కోసం ఆమె అన్నివిధాలుగా కష్టపడుతుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ చిత్రాల ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఈ క్రమంలో ఇటివల ఆమె ..తాను బాలీవుడ్ పాట‌లు చూస్తూ పెరిగాన‌ని, రొమాన్స్ కి సిస‌లైన మీనింగ్ ఈ పాట‌ల్లో ఉంటుంద‌ని, ద‌క్షిణాదిన అన్నీ మాస్ పాటలే అని చెప్పింది. ఈ మాటలపై ట్రోలింగ్ కూడా పెద్ద ఎత్తునే జ‌రిగింది. ఇప్పుడు త‌న మాట‌ల గురించి వివ‌ర‌ణ ఇచ్చారు ర‌ష్మిక‌. త‌న మాట‌ల‌కు మెలిక పెట్టార‌ని, తాను అలా అన‌లేద‌ని చెప్పుకొచ్చింది.

 

``నేనేం మాట్లాడినా దానిలో ఇంకేదో విష‌యాన్ని వెతుక్కోవాల‌నుకుంటున్నారు జ‌నాలు. నేను మాట్లాడిన ప్రతిసారీ, జ‌నాలు రియాక్ట్ అవుతున్న తీరు చూస్తే, అరే.... నేను మాట్లాడింది అది కాదు క‌దా, నా భావ‌న అది కాదు క‌దా.. అని చెప్పాల‌నిపిస్తుంది. బాలీవుడ్‌లో రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి. కానీ సౌత్‌లో మాస్ నెంబ‌ర్స్... అని చెబుతుండ‌గానే జ‌నాలు `మాకు తెలుసు మాకు తెలుసు` అని నా మాట‌ల‌ను మ‌ధ్యలోనే ఆపేశారు.. వాళ్లు న‌న్ను మాట్లాడ‌నిచ్చి ఉంటే సౌత్‌లో మాస్ నెంబ‌ర్స్, ఐట‌మ్ నెంబ‌ర్స్, రొమాంటిక్ నెంబ‌ర్స్ ఉంటాయని వివరంగా చెప్పే దాన్ని. కానీ మధ్యలోనే ఆపేసి దాన్ని నచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు. నేనే బోలెడు తెలుగు రొమాంటిక్ పాటల్లో నటించా. నేను ఎందుకు అలా అంటాను. నేనేం మాట్లాడిన తప్పుగానే చిత్రీకరిస్తున్నారెందుకో అర్ధం కావడం లేదు' అని వివరణ ఇచ్చింది రష్మిక.