ENGLISH

ఇంకా తగ్గని రవి తేజ మార్కెట్

25 July 2024-19:49 PM

మాస్ మహారాజ్ రవితేజ కెరియర్ ఈ మధ్య అప్ అండ్ డౌన్స్ గా ఉంది. కొన్ని సినిమాలు పరవాలేదనిపించుకున్నా, మరికొన్ని డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటున్నాయి. క్రాక్ తరవాత ఆ రేంజ్ హిట్ రానే రాలేదు మాస్ మహారాజాకి. రవి తేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో  మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఆగష్టు 15న ఆడియన్స్ ముందుకు రానుంది. గతంలో  హరీష్ శంకర్ తో రవి తేజ 'మిరపకాయ్' లాంటి సూపర్ హిట్ కొట్టాడు. ఆ తరవాత వీరిద్దరూ కలిసి సినిమా చేయలేదు మళ్ళీ ఇన్నాళ్ళకి కలిసి వర్క్ చేయటం, హరీష్ మాస్ ఎలివేషన్స్ కి రవి తేజ ఊర మాస్ యాక్షన్ తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉంటుందని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


మిస్టర్ బచ్చన్ మూవీ హిందీ రైడ్ కి రీమేక్. రీమేక్ అన్న మాటే కానీ పూర్తిగా మార్పులు చేసినట్లు దర్శకుడు ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. కమర్షియల్ డైరెక్టర్ గా పేరున్న హరీష్ 'గద్దల కొండ గణేష్' తర్వాత ఇంకో మూవీ చేయలేదు. పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కిస్తున్నా రిలీజ్ కి టైమ్ పడుతుంది. ఈ కారణంగా మిస్టర్ బచ్చన్ మూవీ కోసం హరీష్ ఫాన్స్ కూడా  వెయిట్ చేస్తున్నారు. యాక్షన్ జోనర్ లో ఫుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ మూవీ కి మార్కెట్ కూడా బాగానే జరుగుతున్నట్టు టాక్. 


మిక్కీ జే మియర్ మ్యూజిక్ కంపోజిషన్ లో రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ బిజినెస్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్, ఓటీటి, మొత్తంగా 80 కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం. హిందీ రైట్స్ 26 కోట్లకి వెళ్ళింది . డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ 20 కోట్లకి సొంతం చేసుకుందని టాక్ . రవితేజ కెరియర్ లోనే హైయెస్ట్ డిజిటల్ రైట్స్ మిస్టర్ బచ్చన్ కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈగల్ లాంటి డిజాస్టర్ తర్వాత కూడా రవితేజ సినిమాకి 40 కోట్ల బిజినెస్ జరగడం విశేషం.