ENGLISH

రివైండ్ మూవీ రివ్యూ & రేటింగ్‌

18 October 2024-16:00 PM

చిత్రం: రివైండ్ 
దర్శకత్వం:  కళ్యాణ్ చక్రవర్తి
కథ - రచన : కళ్యాణ్ చక్రవర్తి


నటీనటులు:  సాయి రోనక్, అమృత చౌదరి, జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, సురేష్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ తదితరులు 


నిర్మాతలు: కళ్యాణ్ చక్రవర్తి
సంగీతం: ఆశీర్వాద్
సినిమాటోగ్రఫీ : శివ రామ్ చరణ్
ఎడిటర్: తుషార పాలా


బ్యానర్: క్రాస్ వైర్ క్రియేషన్స్
విడుదల తేదీ: 18 అక్టోబర్ 2024
 


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 3/5

 

సాయి రోనక్ హీరోగా  అమృత చౌదరి హీరోయిన్ గా తెరకెక్కిన 'రివైండ్' మూవీ ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం అన్ని భాషల్లోను టైమ్ ట్రావెల్ కథలు ట్రెండింగ్ లో ఉండటంతో సాయి రోనక్ కూడా అలాంటి కథతోటే వచ్చాడు. రివైండ్ అనే పేరుతోనే టైమ్ ను రివైండ్ చేసే కాన్సెస్ట్ అని అర్ధం అవుతోంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన రివైండ్ ఆడియన్స్ ని మెప్పించిందా లేదా చూద్దాం. రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ముందు నుంచి ఈ మూవీపై భారీ అంచనాలు పెంచింది. ఆ అంచనాలను 'రివైండ్' మూవీ అందుకుందా లేదా?  సాయి రోనక్ హిట్  అందుకున్నాడా లేదో చూద్దాం.  


కథ :
శాంతి (అమృతా చౌదరి) వాళ్ల తాత కృష్ణమూర్తి ఫిజిక్స్ లో లెక్చరర్. అతను చాలా కష్టపడి ఓ టైమ్ ట్రావెల్ మిషన్ ను తయారు చేస్తాడు. అంతే కాదు ఆ మిషన్ ద్వారా 1980 నుంచి  2019లోకి ట్రావెల్ చేసి వస్తాడు. తరువాత మళ్ళీ కథ 2024 నుంచి మొదలవుతుంది. కార్తిక్ (సాయి రోనక్) ఒక సాఫ్ట్ వేర్ డవలపర్. ఛాలెంజెస్ అంటే ఇష్టపడే కార్తిక్ జీవితంలోకి శాంతి (అమృత) వస్తుంది. ఆమెను చూడగానే కార్తిక్ ప్రేమలో పడిపోతాడు. తరువాత శాంతి కూడా అదే ఆఫీసులో జాయిన్ అవుతుంది. అలా వారి మధ్య పరిచయం పెరుగుతుంది. ఈలోగా కార్తీక్ శాంతితో పీకల్లోతు ప్రేమలో మునుగుతాడు. ఒక రోజు శాంతి కార్తీక్ కి  తన తాత కృష్ణమూర్తి (సామ్రాట్) గురించి చెబుతుంది. శాంతి కార్తిక్ కు ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేసానని చెప్పటంతో, శాంతి ప్రపోజ్ చేస్తుందని అనుకుంటాడు కార్తీక్. కానీ శాంతి ఒక వ్యక్తిని పరిచయం చేసి అతన్ని ఐదేళ్లుగా ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. కార్తీక్ ఇది భరించలేకపోతాడు. జీవితం పై విరక్తిగా ఉన్న కార్తిక్ కి టైమ్ మిషన్ దొరుకుతుంది. దీనితో కార్తీక్ టైమ్ ట్రావెల్ చేస్తాడు. కార్తిక్ కి ఆ మిషన్ ఎలా దొరికింది? టైం ట్రావెల్ చేసి ముందుకు వెల్లేడా? వెనక్కి వెళ్లాడా? కార్తీక్ టైం ట్రావెల్ చేయటానికి కారణం ఏంటి? శాంతి ప్రేమించింది ఎవరిని? టైమ్ ట్రావెల్ మిషన్ వీరి ప్రేమను నిలబెట్టిందా? మిగతా కథ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.   

 

విశ్లేషణ: 
ఈ మధ్య టైం ట్రావెల్ కథలకి మంచి ఆదరణ పెరగటంతో దర్శకుడు ఈ జోనర్ ని ఎంచుకున్నాడు. ఇలాంటి జోనర్ లో ప్రయోగాలు చేయాలంటే కొంచెం రిస్క్. దర్శకుడికి ఇదే తోలి సినిమా అయినా కూడా కల్యాణ్ చక్రవర్తి డేరింగ్ స్టెప్ వేసి విభిన్న కథని తీసుకున్నారు.  'రివైండ్' చిత్రం లో చాలా ప్రయోగాలు ఉన్నాయి. చూడటానికి టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అయినా ఒక చక్కని ప్రేమకథను కూడా ఈ కథకి జత చేసారు. టైం ట్రావెల్ అనే పాయింట్ తీసుకుని కార్తిక్- శాంతి లవ్ స్టోరీ చెప్పారు. వీరి ప్రేమకథకి టైం ట్రావెల్  ముడి పెట్టిన విధానం బాగుంది. కృష్ణమూర్తి ఎంట్రీతో  సినిమా ప్రారంభం అవుతుంది. టైమ్ మిషన్ ని కనిపెట్టిన కృష్ణ మూర్తి ఫాస్ట్ నుంచి ప్రజంట్ కి వస్తాడు. మళ్లీ మాయం అయిపోతాడు. అసలు కథలో ట్విస్ట్ లకి కారణం కృష్ణ మూర్తే. 


ఫస్ట్ ఆఫ్ శాంతి-కార్తిక్ మధ్య పరిచయం, ఫ్రెండ్ షిప్, ప్రేమ ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ లో కార్తీక్ టైమ్ ట్రావెల్ చేస్తాడు. ఫస్ట్ హాఫ్ లో చాలా ప్రశ్నలు మిగిలిపోతాయి. టైం ట్రావెల్ చేసి వచ్చిన కృష్ణమూర్తి ఏమయ్యాడు? టైమ్ మిషన్ ఏమైంది? అనే ప్రశ్నలు ఆడియన్స్ లో కలుగుతాయి. ఈ క్రమంలో దర్శకుడు నడిపించిన ప్రేమ కథ ఆడియన్స్ కి చిరాకు కలిగిస్తుంది. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ ఆఫ్ లో వదిలేసిన డౌట్స్ ని క్లియర్ చేస్తూ, ట్విస్టులు రివీల్ చేస్తూ ముగించాడు. అందుకే ఫస్ట్ ఆఫ్ లో జరిగిన కథనే రివైండ్ చేసి మళ్లీ ప్లే చేస్తారు. తండ్రీ కొడుకు ఎమోషన్ ని సెకండ్ హాఫ్ లో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ సెకండాఫ్ లోనే ఆడియన్స్  డౌట్స్ ని  ఫాస్ట్ ఫార్వార్డ్ లో క్లియర్ చేస్తారు అంతే కాదు పార్ట్ 2 కూడా ఉందని హింట్ ఇచ్చారు.  ట్విస్టులతో కూడిన  లవ్ ఎంటర్ టైనర్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.  

 

నటీ నటులు:
అంతా కొత్తవారే. తెలిసినవారు ఉండి ఉంటే సినిమాకి ఇంకొంచెం హైపు పెరిగి ఉండేది. హీరోగా సాయి రోనక్ కార్తిక్ పాత్రలో అద్భుతంగా నటించాడు. అన్ని ఎమోషన్స్ ని బ్యాలెన్స్ గా క్యారీ చేసాడు. కథ మొత్తాన్ని సాయి రోనక్ తన భుజాల మీద నడిపించాడు. హీరోయిన్ గా చేసిన  అమృతా చౌదరి నటన చూస్తే ఆమెకి ఇదే డెబ్యూ అని అనుకోరు. సీనియర్ హీరోయిన్ లా నటించింది. తన పాత్రకు వందకి వంద శాతం న్యాయం చేసింది. హీరో హీరోయిన్ జంట కూడా  ఆకట్టుకుంది. సీనియర్ నటుడు సురేశ్ చాలా రోజుల తరువాత ఈ సినిమాలో కనిపించారు. కార్తీక్ తండ్రి పాత్రలో సురేశ్ ఒదిగిపోయారు. అభిషేక్ విశ్వకర్మ డిఫరెంట్ షేడ్స్ ఉండే నెగిటీవ్ పాత్రలో కనిపించి మెప్పించారు. సైంటిస్ట్ గా చేసిన సామ్రాట్, పాల్ రాము, జబర్దస్త్ నాగి, ఫన్ బకెట్ రాజేశ్, ఫన్ బకెట్ భరత్, వైవా రాఘవ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

 

టెక్నికల్ :
తెలుగులో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి. అప్పుడెప్పుడో  సింగీతం శ్రీనివాసరావు బాలకృష్ణ హీరోగా 'ఆదిత్య 369' తీశారు. ఆ సినిమా తరువాత అంతగా మెప్పించిన సినిమా ఇంకొకటి రాలేదు. కళ్యాణ్ చక్రవర్తి కొత్తవాడైనా మొదటి సినిమాతోనే ప్రయోగాలు చేసాడు. అతన్ని దైర్యానికి హాట్సాప్ చెప్పాల్సిందే. ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ మెదడుకి పని చెప్పి సెకండాఫ్ లో పజిల్ ను పూర్తి చేసాడు. కళ్యాణ్ స్క్రీన్  ప్లే సూపర్ గా ఉంది. సాధారణ లవ్ స్టోరీ ని టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అప్లై చేసి ఆడియన్స్ ని మెప్పించాడు. ఆశ్వీర్వాద్ ల్యూక్ సంగీతం బాగుంది. కథకి ఆశీర్వాద్ సంగీతం కూడా హెల్ప్ అయ్యింది. బీజీఎం సూపర్ గా ఉంది. రవివర్మ రాసిన సాహిత్యం ఆకుట్టుకుంది. శివరామ్ చరణ్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి కలిసి వచ్చింది. దర్శకునిగా పాస్ అయిన కళ్యాణ్ చక్రవర్తి  నిర్మాతగా కూడా ఫుల్ మార్క్స్ సాధించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. తాను నమ్మిన కథకి అంతే నమ్మకంగా ఖర్చు పెట్టారని తెలుస్తోంది. 

 

ప్లస్ పాయింట్స్ 

నటీ నటులు 
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్
నిర్మాణ విలువలు
పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్

 

మైనస్ పాయింట్స్ 

ఫస్ట్ హాఫ్j
లాజిక్ లేని  సీన్స్
స్లో నేరేషన్ 

 

ఫైనల్ వర్దిక్ట్ : 'రివైండ్' ఒక కొత్త ప్రయోగం..!