ENGLISH

హాలీవుడ్‌ స్టార్‌తో విజయ్‌ని పోల్చేసిన వర్మ

31 August 2017-14:18 PM

'అర్జున్‌రెడ్డి'తో లేటెస్ట్‌గా సెన్సేషనల్‌ హిట్‌ కొట్టిన హీరో విజయ్‌ దేవరకొండ. ఈ హీరోకి ఇండస్ట్రీ నుండి దక్కుతున్న ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. అలాగే సినిమా కూడా మంచి టాక్‌తో దూస్కెళ్లిపోతోంది. ఇదిలా ఉండగా సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మనసును గాఢంగా గెలిచేసుకున్నాడు మన హీరో. పొగడ్తల వర్షం అంటే చిన్న మాటే, పొగడ్తల సునామీలాంటిదేదే కురిపించేస్తున్నాడు వర్మ, విజయ్‌ దేవరకొండపై. ఇటీవలే తెలంగాణా మెగాస్టార్‌ అనే బిరుదిచ్చేశాడు. అంతటితో ఆగలేదు హాలీవుడ్‌ స్టార్‌ లియోనార్డో డికాప్రియోతో విజయ్‌ దేవరకొండను పోల్చారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. 'టాలీవుడ్‌ లియోనార్డో డికాప్రియో' అని విజయ్‌ దేవర కొండపై ప్రశంసలు గుప్పించిన వర్మ, 'అర్జున్‌రెడ్డి' సినిమాతో తెలుగు సినిమా కొత్త పంథాలోకి అడుగు పెట్టిందన్నారు. రెండోసారి 'అర్జున్‌రెడ్డి' సినిమా చూసినట్లు పేర్కొన్న వర్మ, ఆ సినిమాలోని ముద్దు సీన్లను ప్రత్యేకంగా కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావుకి పంపిస్తే, ఆయన తన ఇంట్లో ఏకాంతంగా కూర్చుని, ఆ వీడియోల్ని తిలకించి 'చిల్‌' అవుతారని వర్మ 'అర్జున్‌రెడ్డి' టీమ్‌కి సూచించారు. ఈ సినిమాలోని ముద్దు సీన్ల విషయంలో కాంగ్రెస్‌ నేత హనుమంతరావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తన అభిప్రాయాల్ని తెలిపిన సంగతి తెలిసిందే. ఎవరెన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఈ సినిమా విడుదలను కానీ, విడుదలయ్యాక సక్సెస్‌ని కానీ ఆపడం ఎవ్వరి వల్లా కాలేదు సరికదా, ప్రశంసల జోరు వానకు చిత్ర యూనిట్‌ తడిసి ముద్దవుతూ ఆహ్లాదాన్ని ఎంజాయ్‌ చేస్తోంది.

ALSO READ: బాలకృష్ణ పైసా వసూల్ స్టొరీ లీక్?