ENGLISH

సాయి పల్లవిని ఎవరు టార్గెట్ చేస్తున్నారు?

26 October 2024-13:12 PM

సాయి పల్లవి ప్రస్తుతం పాన్  ఇండియా హీరోయిన్ గా సత్తా చాటేందుకు సిద్ధం గా ఉంది. తెలుగు, తమిళం, హిందీలలో వరుసగా సినిమాలు చేస్తోంది. తెలుగులో నాగ చైతన్యతో తండేల్ సినిమా చేస్తోంది. శివ కార్తికేయన్ కి జోడిగా నటించిన పాన్ ఇండియా మూవీ 'అమరన్' తో  త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. నెక్స్ట్ హిందీలో నితీష్ తివారి రామాయణంతో రణబీర్ తో కలిసి నటిస్తోంది. ఈ క్రమంలోనే సాయి పల్లవిని కొందరు టార్గెట్ చేసారు. అప్పుడెప్పుడో ఒక సినిమా ప్రమోషన్ లో మాట్లాడిన మాటలని వక్రీకరించి ఇప్పుడు వాటిని షేర్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు. కావాలని సాయి పల్లవిని ఇలా నెగిటీవ్ చేస్తున్నారని ఆమె ఫాన్స్ మండిపడుతున్నారు.

చేసింది తక్కువే సినిమాలే అయినా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది సాయి పల్లవి. మొదటి నుంచి గ్లామర్  పాత్రలకి దూరంగా ఉంటూ, నటనకి ఆస్కారమున్న పాత్రలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటనతో పాటు ఆమె వ్యక్తిత్వానికి ఫాన్స్ ఫిదా అవుతుంటారు. అలాంటి ఆమె పై ఇప్పుడు ట్రోల్స్ రావటంతో  ఫాన్స్ ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి నటించిన 'అమరన్' సినిమా కాశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన మేజర్ ముకుందన్ బయోపిక్. ఇందులో మేజర్ ముకుందన్ భార్య రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. ఇది ఒక మేజర్ జీవితానికి సంబంధించిన సినిమా కావటంతో గతంలో టెర్రరిజం పై  సాయి పల్లవి చేసిన  కామెంట్స్ ఇప్పుడు షేర్ చేస్తున్నారు.

గతంలో రానా సాయి పల్లవి జోడిగా 'విరాట పర్వం' తెరక్కెక్కింది. ఆ మూవీలో ఒక నక్సల్ ని ప్రేమించి తాను కూడా నక్సల్‌ గా మారిన అమ్మాయిగా నటించింది. ఈ  ప్రమోషన్‌లో సాయి పల్లవిని నక్సల్స్ హింస గురించి ప్రశ్న ఎదురవగా 'హింస అంటే అర్థం కావడం లేదు. పాకిస్థానీలు మన సైనికులను చూస్తే ఉగ్రవాదులని భావిస్తారు. వాళ్లను చూస్తే మనం ఉగ్రవాదులు అనుకుంటాం' అని బదులిచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సాయి పల్లవి భారత సైనికులను టెర్రరిస్టులని అర్ధం వచ్చేలా మాట్లాడిందని వైరల్ చేస్తున్నారు. అంతే కాదు అమరన్ సినిమా ప్రమోషన్స్ లో ఒక ఇంటర్వ్యూలో మీరు లెఫ్ట్‌వింగ్ ఆర్ రైట్‌వింగ్ అని అడగ్గా ఆమె 'నేను ఏ వర్గానికి చెందిన దాన్ని కాదు. హింసకు కారణం అయ్యే మతానికి నేను వ్యతిరేకం అని చెప్తూ 'కశ్మీర్ ఫైల్స్' చూస్తే హిందువులు పై ముస్లిం లు చేసే దాడి తెలిసింది. అలాగే ఒక ఆవును తరలిస్తున్న ముస్లిం లారీ డ్రైవర్‌ను 'జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేస్తూ కొట్టి చంపారు. ఈ రెండు సంఘటనలు తనకి ఒకటే అని కుండ బద్దలు కొట్టింది. ఏ వ్యక్తిని, సంఘటనను, పరిస్థితిని మతం కోణంలో విభజించి చూడడానికి వ్యతిరేకం అని స్పష్టం చేసినా ఆమె కామెంట్స్ తప్పు పడుతూనే ఉన్నారు.