ENGLISH

సమ్మతమే మూవీ రివ్యూ & రేటింగ్

24 June 2022-12:32 PM

నటీనటులు: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి తదితరులు
దర్శకత్వం : గోపీనాథ్ రెడ్డి
నిర్మాత: కంకణాల ప్రవీణ
సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: సతీష్ రెడ్డి మాసం
ఎడిటర్: విప్లవ్ నైషదం


రేటింగ్: 2.5/5


కిరణ్ అబ్బవరం తొలి సినిమాతోనే అందరి ద్రుష్టిని ఆకర్షించాడు. రెండో సినిమాగా వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ మండపంతో తన కంటూ కొంత ఫాలోయంగ్ ని సంపాయించుకున్నాడు. మూడో సినిమా సెబాస్టియన్ మాత్రం రాంగ్ టైంలో వచ్చి దెబ్బకొట్టింది. ఇప్పుడు 'సమ్మతమే' చిత్రంతో వచ్చాడు. చాందిని చౌదరి కథానాయిక. గోపినాద్ రెడ్డి దర్శకుడిగా కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ విడుదల చేయడం అందరిద్రుష్టిని ఆకర్షించింది. ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనరని యూనిట్ చెప్పింది. పాజిటివ్ వైబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రివ్యూలోకి వెళితే .. 


కథ:


కృష్ణ (కిర‌ణ్ అబ్బవర‌పు) చిన్నప్పుడే త‌ల్లిని కోల్పోతాడు. తండ్రి ప్రేమ‌గా పెంచినా త‌ల్లి లేని లోటు అనుభ‌విస్తూనే ఉంటాడు.  ఆడ‌దిక్కులేని ఇల్లు ఎలా ఉంటుందో చిన్న వ‌య‌సులోనే అర్థమ‌వుతుంది. తాను త్వర‌గా పెళ్లి చేసుకొని ఆ ఇంటికి  ఓ ప‌ద్ధతైన అమ్మాయిని తీసుకురావాల‌ని పసి వయసు నుండే క‌ల‌లు కంటుంటాడు. తను పెళ్లి చేసుకునే అమ్మాయి ఎలా ఉండాలో ఒక రూల్ బుక్ కూడా పెట్టుకుంటాడు. అమ్మాయి పద్దతిగా వుండాలి, అబ‌ద్ధం ఆడకూడ‌దు, అంతకుముందు ఎవర్నీ ప్రేమించకూడదు. అయితే కృష్ణ జీవితంలోకి సరిగ్గా దీనికి భిన్నమైన శాన్వి(చాందిని చౌద‌రి వస్తుంది. మొదటి చూపులోనే శాన్విని ఇష్టపడతాడు. శాన్వికి వున్న అలవాట్లని త‌న ప్రేమతో మార్చేస్తానని బలంగా నమ్ముతాడు కృష్ణ. మరి కృష్ణ నమ్మకం నిజమైయిందా?  శాన్వి మారిందా?   భిన్నద్రువాలైన కృష్ణ, శాన్వి ఒక్కటయ్యారా ? అనేది మిగిలిన కథ. 


విశ్లేషణ:


చిన్న సినిమా ఇది. దానికి తగ్గట్టే చిన్న పాయింట్ ని ఎంచుకున్నాడు దర్శకుడు. చిన్న పాయింట్లతో అద్భుతమైన చేసిన సందర్భాలు బోలెడు. పెళ్లి చూపులు సినిమా తీసుకోండి.. రెండు భిన్న స్వభాలు గల పాత్రలు పెళ్లి చూపుల్లో కలుస్తారు, ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటారు. వారి మధ్య ఒక సంఘర్షణ. చివరికి కలుస్తారు. ఇంతే సింపుల్ గా వుంటుంది. ఐతే ఇలాంటి సింపుల్ లైన్ ని బోర్ కొట్టకుండా డీల్ చేయడానికి చాలా నేర్పు కావాలి. సమ్మతమేలో ఎత్తుకున్న పాయింట్ బావుంది. కానీ ఆ పాయింట్ ని రెండున్నర గంటల సినిమాగా చూపించడంలో మాత్రం తడబాటు కనిపిస్తుంది. 


ఒక పాత్ర అనుకున్నపుడు నిలకడ వుండాలి. హీరోకి తనకు చేసుకోబోయే అమ్మాయికి కొన్ని లక్షణాలు వుండాలని భావిస్తాడు. కానీ దానికి పూర్తిగా విరుద్దమైన అమ్మాయి కనిపించినపుడు ఎలాంటి బలమైన కారణాలు లేకుండా ఆమెని తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. ఒక పాత్ర రాజీ పడొచ్చు. ఐతే ఆ రాజీకి సరైన కారణాలు వుండాలి. దానిపై ద్రుష్టి పెట్టలేదు దర్శకుడు. ఈ కథలో ప్రధాన లోపం జోష్ తగ్గడం, హీరో పాత్రని మరీ డల్ గా తీర్చిదిద్దాడు దర్శకుడు. నిజానికి ఈ పాత్రని హుషారుగా కూడా మార్చవచ్చు. కానీ దర్శకుడు ఆ ఛాయిస్ తీసుకోలేదు. హీరో ఎప్పుడూ నీరాసంగా కనిపిస్తుంటాడు.


సన్నివేశాలు కూడా నీరసంగా సాగిపోతుంటాయి. చాందిని పాత్రలో కొంత హుషారు వుంటుంది. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం సరిగ్గా అతకలేదు. సీన్స్ అన్నీ అక్కడికి అక్కడే తిరుగుతున్నా ఫీలింగ్ కలుగుతుంది. పాయింట్ చిన్నదైనప్పుడు డ్రామా ఆసక్తికరంగా మార్చాలి. కానీ ఇందులో డ్రామా అక్కడిక్కడే తిరుగుతుంది. అయితే చివర్లో హీరో తండ్రి పాత్రతో చెప్పించిన డైలాగులతో సినిమా పాజిటివ్ నోట్ ముగించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. నిజానికి ఓటీటీకి  సరిపడే కంటెంట్ ఇది. థియేటర్ ఎక్స్ పిరియన్స్ ఆశించి అడుగుపెడితే మాత్రం నిరాశ తప్పదు. 


నటీనటులు :


కిర‌ణ్ అబ్బవ‌ర‌పునటన కు వంక పెట్టలేం. కృష్ణ పాత్ర కూడా చాలా నేచురల్ గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎమోషన్స్ సీన్స్ లో మరింత మెరుగయ్యాడు. కిరణ్ లో మాస్ టైమింగ్ వుంది. అయితే ఈ టైమింగ్ ని సరిగా వాడుకోలేకపోయాడు దర్శకుడు.


చాందిని పాత్ర బావుంది. కిరణ్ తో పోటిపడిమరీ నటించింది. స‌ప్తగిరి ట్రాక్ పై టీం నమ్మకం పెట్టుకుంది. ఐతే ఆ పాత్ర పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. తండ్రి పాత్ర చేసిన గోపరాజు మరోసారి మెప్పించారు. మిగతా నటీనటులు పరిధిమేర చేశారు.  


టెక్నికల్ గా :


సంగీత దర్శకుడు శేఖర్ చంద్రకి చాలా పని పడింది. ఇందులోఏడు పాటలు వున్నాయి.  అయితే పెద్దగా రిజిస్టర్ కావు. నేప‌థ్య సంగీతం ఓకే. కెమరా పనితనం అంత గొప్పగా లేదు. చాలా వరకూ షార్ట్ ఫిల్మ్ ఫీలింగ్ కలుగుతుంది. ఎడిటర్ ఇంకాస్త షార్ఫ్  చేయొచ్చు. నిర్మాణ విలువలు అంత గొప్పగా లేవు. 


ప్లస్ పాయింట్స్


కిరణ్ అబ్బవరం, చాందిని
ఎంచుకున్న పాయింట్ 
నేపధ్య సంగీతం 


మైనస్ పాయింట్స్


బోరింగ్ స్క్రీన్ ప్లే 
సాగదీత


ఫైనల్ వర్దిక్ట్: ఓటీటీకి 'సమ్మతమే'

ALSO READ: స‌గం సినిమా అయ్యింది.. ద‌ర్శ‌కుడు జంప్‌!