చిత్రసీమ మేడిపండులా కనిపిస్తుంది గానీ, అన్నీ పురుగులే. ఇక్కడ రాణించాలంటే, నిలదొక్కుకోవాలంటే... ఎన్నో చేదు అనుభవాల్ని దాటుకుని రావాల్సివస్తుంది. గాయని సునీతకు సైతం.. ఇలాంటి చేదు ఘటనలు ఎన్నో ఎదురయ్యాయి. అందులో తనని అమితంగా బాధ పెట్టిన ఓ సంగతి.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
ఓసారి.. ఓ సంగీత దర్శకుడి దగ్గర పాట పాడడానికి వెళ్లిందట సునీత. పాట పాడి.. మైకు తిరిగి ఇచ్చేసి, అక్కడి నుంచి వచ్చేస్తుంటే, సదరు సంగీత దర్శకుడి భార్యామణి ఎదురైందట. `మైకు ఇచ్చే వంకతో నా భర్త చేతివేళ్లని ఎందుకు తాకావు` అంటూ అనవసరంగా రాద్ధాంతం చేసిందట. `నా తప్పు లేకపోయినా ఆ రోజు నిందలు భరించాల్సివచ్చింది. ఆమెకు నాదైన శైలిలో గట్టిగా సమాధానం చెప్పా. కానీ... ఆ నిందల్ని భరించలేకపోయా. ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నా` అని చెప్పుకొచ్చింది సునీత. అయితే ఆ సంగీత దర్శకుడి పేరు మాత్రం బయటపెట్టలేదు. ఇలాంటి చేదు ఘటనలు తన జీవితంలో చాలా ఎదురయ్యాయాట. `కొన్నిసార్లు లాగిపెట్టి కొట్టాలన్నంత కోపం వచ్చేది. కానీ కొట్టలేకపోయాను. మౌనంగా వచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్నిసార్లు గొడవపడేదాన్ని. అవన్నీ గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం లేదు` అని బాధపడుతూ చెప్పింది సునీత.
ALSO READ: రెండు కోట్లు అడుగుతున్న కుర్ర హీరో!