ENGLISH

పాట‌ల్లో ప్ర‌శ్నించే త‌త్వం నేర్పిన సిరి వెన్నెల‌

02 December 2021-10:46 AM

సినిమా పాటకు చిరునామా సిరివెన్నెల. సినిమా పాట అంటే కేవలం ఐదు నిమిషాల రన్ టైం కాదు.. ఒక జీవితానికి విన్ టైం లా వుండాలని తపించే కలం ఆయనది. అపూర్వమైన సినీ ప్రయాణంలో ఆయన టచ్ చేయని భావం లేదు. ''మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు'' అంటుందా కలం. ఒక చిన్నమాటలో బ్రతకడానికి కావాల్సిన ధైర్యాన్ని టన్నుల కొద్ది ఇస్తుంది. మనసు పెట్టి సిరివెన్నెల పాట వింటే చాలు.. డేల్ కార్నెగీ, నెపోలియన్ హిల్, జాక్ కాన్ఫీల్డ్ ల వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవాల్సిన పనిలేదు.

 

సిరివెన్నెల కలం కేవలం సినిమా పాటకే పరిమితం కాలేదు. ఆ కలంకు సమాజం అంటే ప్రేముంది. దానిపట్ల అపారమైన భాద్యత వుంది. అందుకే సమాజంలోని పొకడలని ఆయన కలం నిగ్గదీసి ప్రశ్నిస్తుంది. ప్రశ్నించడంలో ఆయనిది ప్రత్యేకమైన శైలి. ప్రశ్నిస్తూనే బోలెడు సమాధానాలు వెతుక్కునేలా చేయడం ఆయన కలం ప్రత్యేకత. ఒక ప్రశ్న వేసి బదులు చెప్పే గుండెం కోసం వెదుకుతుంది.

 

''అర్ధశతాబ్దపు ఆజ్ఞానాన్ని స్వతంత్రమందమా ? అని మనల్నీ ఆలోచనల్లోకి నెట్టేస్తుంది. ''దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటే సైన్యముండునా ? అని ప్రశ్నించి మన బద్దకాన్ని పటాపంచలు చేస్తుంది. సమాజంలోని అల్లర్లు చూసి రగిలిపోయి..''ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం ? ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం ?'' అని లెంపకాయ కొడుతుంది.

 

''ఇందిరమ్మ ఇంటిపేరు గాంధీ కాదని' గాంధీయిజానికి ఒరిజినల్ మీనింగ్ చెబుతుంది. 'నీలో నరునీ హరినీ కలుపు.. నీవే నరహరివని తెలుపు'' అంటూ మనిషిని దేవుడ్ని చేస్తుంది. ''వెన్నెల దీపం కొందరిదా ? అడవిని సైతం వెలుగుకదా'' అంటూ ఒక్క మాటలో అద్వైతం భోదింస్తుంది. 'ఎక్కిల్లె పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా? మరెందుకు గోల? అంటుంది. ''ఏ కష్టానైనా వచ్చేపోయే చుట్టాలనుకుంటే సదా సుఖాలతో వుంటాం'' అని మనసుని తేలిక చేస్తుంది. ''బతుకంటే బడి చదువా .. అనుకుంటే అతి సులువా.. పోరాబడినా పడినా జాలి పడదే కాలం మనలాగా'' అని ,, కాలం ఎంత విలువైనది, కాలాన్ని సరిగ్గా వాడుకోకపొతే ఎంత కర్కశమైనదో.. ఒక్క మాటలో చెబుతుంది.

 

''హీరోషిమా జీరో అయ్యిందా ? ఆటంబాబ్ వేస్తే ? అని ప్రశ్నించి.. ఎంతటి ప్రళయం వచ్చినా మళ్ళీ పచ్చగా వికసించే శక్తి మనిషికుందని గుర్తు చేస్తుంది. అడవిని చూసి ధైర్యం తెచ్చుకున్న ఓ కుర్రాడికి .. ''చంపనిదే బతకవని, బదికేందుకు చంపమని.. నమ్మించే అడవిని ఆడిగేం లాభం బ్రతికేదారేటని ?'' అని ప్రశ్నిస్తుంది. అదే సమయంలో ''తారలని తెంచగలం తలచుకుంటే మనం.. రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం'' మనిషిలోని నిక్షిప్తమైన శక్తిని బయటికి తీస్తుంది.

 

ఇలా ఒక్కటి కాదు.. ఆయన కలం సంధించిన ప్రశ్నలు బదులు చెప్పే గుండె మనదైతే జీవితం ఇంకో కోణంలో దర్శనమిస్తుంది. సిరివెన్నెల పాట వినడానికే కాదు.. విన్ అవ్వడానికి కూడా అనే సత్యం సాక్షాత్కరిస్తుంది.

ALSO READ: ప‌ద‌కొండు నందులు అందుకున్న ఒకే ఒక్క‌డు