గత గురువారం విడుదలైన 'సరిపోదా శనివారం' మంచి టాక్ సంపాదించుకొంది. కల్కి తరవాత మళ్లీ బాక్సాఫీసు దగ్గర సందడి కనిపిస్తోంది. ఈ సినిమా విజయంలో ఎస్.జె.సూర్యది కీలక పాత్ర. థియేటర్ నుంచి ప్రేక్షకుడు బయటకు వస్తూ వస్తూ నాని కంటే... సూర్య పాత్రనే గుర్తు చేసుకొంటాడు. ఆ ఇంపాక్ట్ ఆ స్థాయిలో ఉంది. సూర్య లేకపోతే సరిపోదా శనివారం కు ఇంత శక్తి రాదేమో..?! ఓ రకంగా ఈ సినిమాని నిలబెట్టింది సూర్యనే.
సూర్య అదే చేత్తో గేమ్ ఛేంజర్ భవిష్యత్తు కూడా మార్చేస్తాడన్నది అభిమానుల ఆశ. ఆకాంక్ష. రామ్ చరణ్ - శంకర్ కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా గేమ్ ఛేంజర్. డిసెంబరు 20న విడుదల చేయనున్నారని టాక్. 'ఆర్.ఆర్.ఆర్' తరవాత చరణ్ నుంచి వస్తున్న సినిమా ఇది. కాబట్టి అంచనాలు భారీగా ఉంటాయి. అయితే శంకర్‌పై ఎవరికీ పెద్దగా నమ్మకాలు లేవు. రీసెంట్ గా వచ్చిన 'భారతీయుడు 2' రిజల్ట్ మెగా అభిమానుల్ని మరింతగా భయపెట్టింది. అయితే ఇప్పుడు సూర్య వల్ల కొత్త ధైర్యం వచ్చింది.
గేమ్ ఛేంజర్లోనూ సూర్య విలన్‌గా కనిపించబోతున్నాడు. తన నటనతో ఎలాగైతే సరిపోదా శనివారం సినిమాను ఒడ్డున పడేశాడో, అలానే... 'గేమ్ ఛేంజర్'కూ తను బూస్టప్ ఇవ్వగలడన్నది అభిమానుల నమ్మకం. మరి ఇందులో సూర్య పాత్రేమిటి? తాను ఎలా ఉండబోతున్నాడన్న విషయాలు ఇంత వరకూ చిత్రబృందం రివీల్ చేయలేదు. భారతీయుడు 2 లోనూ సూర్య ఉన్నాడు. కానీ ఆ పాత్రని శంకర్ అంత ఇంపాక్ట్ తో చూపించలేకపోయాడు. కనీసం గేమ్ ఛేంజర్‌లో అయినా సూర్యని వాడుకోవాల్సిన రీతిలో వాడుకొంటే... ఈ సినిమాకు ఆ పాత్రే టర్నింగ్ పాయింట్ కాగలదు.