ENGLISH

సోలో బ‌తుకే సో బెట‌ర్‌ మూవీ రివ్యూ & రేటింగ్!

25 December 2020-15:30 PM

నటీనటులు : సాయి తేజ్, నాభ నటేష్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు 
దర్శకత్వం : సుబ్బు
నిర్మాత‌లు : బి వి ఎన్ ఎస్ ప్రసాద్
సంగీతం : థమన్ 
సినిమాటోగ్రఫర్ : వెంకట్ సి దిలీప్
ఎడిటర్: నవీన్ నూలి

 

రేటింగ్: 2.5/5


ఎన్నాళ్లో వేచిన ఉద‌యం ఇది. `థియేట‌ర్లు ఎప్పుడు తెరుస్తారా.. కొత్త సినిమాలు ఎప్పుడు వ‌స్తాయా` అని ఎదురు చూసిన సినీ అభిమానుల క‌ల తీరిన రోజు ఇది. ఎందుకంటే... ఈరోజే థియేట‌ర్ల‌లోకి కొత్త సినిమా వ‌చ్చింది. థియేట‌ర్ల ముందు క‌టౌట్లు వెలిశాయి. క్యూలు క‌నిపించాయి. దానికి కార‌ణం `సోలో బ‌తుకే సోబెట‌రు`. ప్రేక్ష‌కుల్ని మ‌ళ్లీ థియేట‌ర్ల వైపు ర‌ప్పిస్తున్న సినిమా ఇది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది?  ప్రేక్ష‌కుల క‌రువు తీరేలా, చిత్ర‌సీమ మురిపిపోయేలా రిజ‌ల్ట్ వ‌చ్చిందా?  లేదా?  సోలో బ‌తుకే ఎవ‌రికి న‌చ్చుతుంది?  ఏమా క‌థ‌?


* క‌థ‌


విరాట్ (సాయి ధ‌ర‌మ్ తేజ్‌)కి ఎలాంటి ఎమోష‌న్లూ ఉండ‌వు. రిలేష‌న్లంటే పెద్ద లెక్క లేదు. ఆర్‌.నారాయ‌ణ‌మూర్తిలా పెళ్లి చేసుకోని సెల‌బ్రెటీలు త‌న‌కు ఆద‌ర్శం. కాలేజీలో త‌న తోటి మిత్రులంద‌రికీ `సోలో బ‌తుకే సో బెట‌రు` అంటూ హిత‌బోధ చేస్తాడు. పెళ్లెందుకు చేసుకోకూడ‌దో వివ‌రిస్తూ 108 శ్లోకాల‌తో ఓ పుస్త‌కాన్ని కూడా రాస్తాడు. ఆపుస్తకం చ‌దివి.. విరాట్ ఫిలాస‌ఫీ ఆచ‌రిస్తూ.. ఓ గ్యాంగ్ కూడా త‌యార‌వుతుంది. అయితే.. అనుకోకుండా విరాట్ జీవితంలో కొన్ని మార్పులు వ‌స్తాయి. త‌న‌ని న‌మ్మి, త‌న ఫిలాస‌ఫీని న‌మ్మి, త‌న వెనుక ఉన్న స్నేహితులంతా పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోతారు. విరాట్ ఒంట‌రివాడు అయిపోతాడు.

 

ఓ ద‌శ‌లో సింగిల్ గా బ‌త‌క‌డంలో అర్థం లేద‌ని గ్ర‌హిస్తాడు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో.. ఓ పెళ్లికి వెళ్తే.. అక్క‌డ అమృత (న‌భా న‌టేషా)  నిన్నే పెళ్లి చేసుకుంటా.. అని విరాట్ వెంట ప‌డుతుంది. అస‌లు అప్ప‌టి వ‌ర‌కూ అమృత‌ని చూడ‌ని విరాట్ కి అదో షాక్ లా ఉంటుంది. ఇంత‌కీ అమృత ఎవ‌రు?  విరాట్ ని ఎందుకు పెళ్లి చేసుకోవాల‌నుకుంది?  సోలో బ‌తుకు వ‌దిలేసి జంట కోసం వెదుకుతున్న విరాట్ క‌ల నెర‌వేరిందా?  లేదా?  అనేది మిగిలిన క‌థ‌.


* విశ్లేష‌ణ‌


చాలా ఫ‌న్నీ లైన్ ఇది. క‌థ‌లో బ‌లం లేక‌పోయినా.. బ‌లంగా న‌డిపించ‌డానికి అనువైన లైన్ మాత్రం ఉంది. ఇది వ‌ర‌కు జంథ్యాల తీసిన `వివాహ భోజ‌నంబు`, విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `మ‌న్మ‌థుడు` క‌థ‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న స‌బ్జెక్ట్ ఇది. ఆ సినిమాలు బాగా ఆడాయి, గుర్తుండిపోయాయి అంటే.. దానికి కార‌ణం.. ఆ క‌థ‌ల్ని ద‌ర్శ‌కులు న‌డిపించిన విధాన‌మే. అయితే సుబ్బులో ఆ కెపాసిటీ లేక‌పోయింది. ఏమాత్రం బ‌లం లేని లైన్ ప‌ట్టుకుని, సాహ‌సాలు చేద్దామ‌ని చూశాడు. క‌థ‌ని మొద‌లెట్టిన తీరు.. ఆస‌క్తిక‌రంగానే ఉన్నా, ప్రేక్ష‌కుల్ని ఎంగేజ్ చేసేలా సీన్లు రాసుకోలేక‌పోయాడు.ఎంత‌సేపూ.. ఫిలాస‌ఫీ, శ్లోకాలూ అంటూ కాల‌క్షేపం చేశాడు కానీ, స‌రైన వినోదాన్ని పండించ‌లేక‌పోయాడు. వెన్నెల కిషోర్ పెళ్లి సీన్ లేక‌పోతే.. ఫ‌స్టాఫ్ మ‌రింత బోర్ కొట్టేది.  హీరో మ‌న‌సు మార్చుకునే స‌న్నివేశాలు, టీవీలో ఆర్.నారాయ‌ణ మూర్తి ఇంట‌ర్వ్యూ.. త‌న స్నేహితులు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోవ‌డం.. ఈ సీన్లు కాస్త ఫ‌ర్వాలేద‌నిపించాయి. ఇంట్ర‌వెల్ కార్డు ద‌గ్గ‌ర అమృత‌.. విరాట్ ని పెళ్లి చేసుకుంటా అని వేలెత్తి చూపించ‌డం ఓ ట్విస్టు. దాంతో ఫ‌స్టాఫ్ పాస్ అయిపోతుంది.


సెకండాఫ్ ద‌గ్గ‌రే అస‌లు స‌మ‌స్య మొద‌ల‌వుతుంది. కొత్త పాత్ర‌లు లేక‌, కొత్త సంఘ‌ర్ష‌ణ లేక‌.. క‌థ అక్క‌డే చ‌తికిల ప‌డుతుంది. హీరో ఫిలాస‌ఫీ, హీరోయిన్ కి షిఫ్ట్ అవ్వ‌డం మిన‌హా - ద్వితీయార్థంలో మ్యాజిక్ లేకుండా పోయింది. రావు ర‌మేష్ పాత్ర‌ని చంపేసి.. మెలో డ్రామా డోసు పెంచాల‌ని చూశాడు ద‌ర్శ‌కుడు. అయితే ఆయా సన్నివేశాల్ని సైతం.. ప‌రిపూర్ణంగా రాసుకోలేక‌పోయాడు. రాముడు - సీత కాన్సెప్ట్ లో డిజైన్ చేసిన ఫైట్ బాగానే ఉన్నా, ఆ సంద‌ర్భానికి అత‌క‌లేదు. క్లైమాక్స్‌కి ముందు ఫైటు కూడా వేస్టే అనిపిస్తుంది. ప్ర‌ధ‌మార్థాన్ని వెన్నెల కిషోర్ ర‌క్షించినా.. ద్వితీయార్థంలో ఆ పాత్ర లేక‌పోవ‌డంతో ఆ మాత్రం కామెడీ కూడా పండ‌లేదు. పోనీ పూర్తిగా ఎమోష‌న‌ల్ రైడ్ గా మార్చాడా అంటే అదీ లేకుండా పోయింది. క‌నీసం ఆర్ట్ గ్యాల‌రీ సీన్ అయినా... వినోదాత్మ‌కంగా రాసుకుని ఉంటే టైమ్ పాస్ అయిపోయేది. సోసోగా మొద‌లైన ఈ క‌థ‌.. సోల్ త‌ప్పి.. సోసోగానే ముగిసిన ఫీలింగ్ వ‌స్తుంది.


* న‌టీన‌టులు


సాయిధ‌ర‌మ్ తేజ్ కి ఈ త‌రహా పాత్ర‌లు కొట్టిన పిండే. త‌న లుక్ బాగుంది. కాస్ట్యూమ్స్ కూడా న‌చ్చుతాయి. స్టెప్పులు సింపుల్ గా ఉన్నాయి. ఎమెష‌న్‌సీన్స్ లో బాగా చేశాడు. కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెష‌న్స్ కూడా బాగున్నాయి. త‌న వ‌ర‌కూ... సోసో పాత్ర‌ని బెట‌ర్ గా మార్చుకోగ‌లిగాడు. న‌భా న‌టేషా ఫ‌స్టాఫ్ లో ఒకే ఒక్క సీన్లో క‌నిపిస్తుంది. ద్వితీయార్థం మొత్తం తానే లీడ్ తీసుకుంది. అయితే ఆ పాత్ర‌ని గ్లామ‌రెస్ గా, ఇంట్ర‌స్టింగ్ గా తీర్చిదిద్ద‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌లం అయ్యాడు. రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్, న‌రేష్‌... ఇలా అనుభ‌వ‌జ్ఞుల్ని తీసుకోవ‌డం వ‌ల్ల ద‌ర్శ‌కుడి ప‌ని కాస్త సుల‌భం అయ్యింది. కామెడీ గ్యాంగులో వెన్నెల కిషోర్ దే పై చేయి.


* సాంకేతిక వ‌ర్గం


త‌మ‌న్ పాట‌లు బాగున్నా... ప్ర‌తీ పాటా ఒకే స్కేల్ లో సాగిన‌ట్టు అనిపిస్తుంది. ఆర్‌.ఆర్‌లో.. త‌న‌దైన మార్క్ చూపించాడు. ఫొటోగ్ర‌ఫీ నీట్ గా ఉంది. నిర్మాణ విలువ‌లు భారీ స్థాయిలో క‌నిపించ‌వు గానీ, ఓకే అనిపిస్తాయి. సుబ్బు రాసుకున్న లైన్ చాలా చిన్న‌ది.దానికి బ‌ల‌మైన సన్నివేశాలు పాత్ర‌లు అవ‌స‌రం. కానీ.. అవేం లేక‌పోవ‌డంతో ఆ లైన్ మ‌రింత తేలిపోయింది.


* ప్ల‌స్ పాయింట్స్‌

పాయింట్
సాయిధ‌ర‌మ్ తేజ్‌
పాట‌లు


* మైన‌స్ పాయింట్స్‌

సోల్ లేక‌పోవ‌డం
ద్వితీయార్థం


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్‌:  సో.. సో..

ALSO READ: హాస్పిటలో రజనీ.. ఫ్యాన్స్ కలవరం