ప్రస్తుతం అందరి దృష్టి RRR పైనే ఉంది. తెలుగులోనే అత్యంత ఖరీదైన సినిమా ఇది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కింది. మనవాళ్లేంటి...? బాలీవుడ్ వాళ్లు సైతం ఈ సినిమా ఎప్పుడొస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో... రాజమౌళి పాటిస్తున్న స్ట్రాటజీనే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
RRR రిలీజ్ డేట్ పై ఇప్పటి వరకూ స్పష్టత లేదు. అక్టోబరు 13న వస్తుంది అంటున్నా - రావడం దాదాపు అసాధ్యం అని తేలిపోయింది. అక్టోబరు 13న RRR రావడం లేదని తెలిసే.. మిగిలిన సినిమాలు ఆ డేట్ ని వాడుకోవడానికి ముందుకొచ్చాయి. ఈ సినిమా ముందు నుంచీ సంక్రాంతి బరిలో లేదు. కాబట్టే... సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, రాధేశ్యామ్, బంగార్రాజు, ఎఫ్ 3 ఈ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి రెడీ అయ్యాయి. అయితే ఇప్పుడు సడన్ గా రాజమౌళి దృష్టి సంక్రాంతిపై పడిందని తెలుస్తోంది. జనవరి 8న RRR ని విడుదల చేయడానికి ఫిక్సయ్యార్ట. RRR వస్తే.. మిగిలిన సినిమాలకు దెబ్బే. కచ్చితంగా రెండు మూడు సినిమాలు వెనక్కి వెళ్లిపోతాయి. అయినా ఫర్వాలేదు. RRR ఉంటుంది కాబట్టి.. పండగ హంగామా రెట్టింపు అవుతుంది. కానీ.. సంక్రాంతి విషయంలోనూ రాజమౌళికి స్పష్టత లేదు.
సినిమా ఎప్పుడు సిద్ధమైనా.. నెల రోజుల్లో ప్రమోషన్ చేసి, వదిలేయాలన్నది రాజమౌళి ఆలోచన. నిజానికి ఇది చాలా తప్పుడు స్ట్రాటజీ అన్నది ఇండ్రస్ట్రీ వర్గాల భావన. RRR అనేది పాన్ ఇండియా సినిమా. దేశ వ్యాప్తంగా.. ప్రమోషన్లు చేయాలి. బాలీవుడ్ ప్రమోషన్లకే కనీసం రెండు మూడు వారాలు కేటాయించాలి. ఇక తమిళనాడు, కేరళ.. చుట్టి రావాలి. వీటికి సమయం సరిపోదు. ఎంత భారీ సినిమా అయినా.. ఈ రోజుల్లో ప్రమోషన్లు చాలా అవసరం. ప్రమోషన్లు పక్కాగా జరగాలంటే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఉండాలి. అది లేకపోవడం RRR కి శాపమే. ఆ సినిమాకే కాదు.. RRR రిలీజ్ తో ముడిపడి ఉన్న మిగిలిన సినిమాలకూ పరోక్షంగా చేటు చేస్తుంది. ఈ విషయంలో రాజమౌళి ఇప్పటికైనా మేల్కొంటే మంచిది.
ALSO READ: అమ్మతోడు... అంటూ అబద్ధం చెప్పాడా?