చిత్రం: హరోం హర
దర్శకత్వం: జ్ఙాన సాగర్ ద్వారక
నటీనటులు: సుధీర్ బాబు , మాళవికా శర్మ, రవి కాలే, జయ ప్రకాష్
నిర్మాతలు: జి. సుమంత్ నాయుడు
సంగీతం: చైతన్ భరద్వాజ్
ఛాయాగ్రహణం: అరవింద్ విశ్వనాథన్
కూర్పు: రవితేజ గిరిజాల
బ్యానర్స్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
విడుదల తేదీ: 14 జూన్ 2024
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.5/5
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, మహేష్ కి బావగా టాలీవుడ్ లో అడుగు పెట్టిన సుధీర్ బాబు, తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నా విజయాలు వరించటం లేదు. ఎలా అయినా తనని తాను నిరూపించుకోవాలని, ఒక్క సూపర్ హిట్ కొట్టాలని విక్రమార్కుడిలా పోరాడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ వారం 'హరోం హర' అనే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో హరోం హర హైలెట్ గా నిలుస్తుంది అని, సుధీర్ కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని చెప్పారు. నిజంగానే సుధీర్ కెరియర్ కి బిగ్గెస్ట్ హిట్ దొరికిందా, మాస్ ఎంటర్ టైనర్ తో సుధీర్ ఎంతవరకు మెప్పించాడో ఈ రివ్యూ లో చూద్దాం.
కథ: ఆంద్రప్రదేశ్ లో రాయలసీమలో ఉన్న కుప్పం, కర్ణాటక, తమిళనాడు, బోర్డర్ లని కలిపే సరిహద్దు. ఆ ఊరు మొత్తాన్ని తిమ్మారెడ్డి, అతని సోదరుడు బసవ(రవి కాలె), కుమారుడు శరత్ రెడ్డి(అర్జున్ గౌడ) తమ గుప్పెట్లో పెట్టుకుంటారు. వారు ఎం చెపితే అదే శాసనం, అదే చట్టం అన్న రేంజ్ లో ప్రజల్ని బయపెట్టి అరాచకాలు కొనసాగిస్తుంటారు. వాళ్ళు బయటికి వస్తే తల కూడా పైకి ఎత్త లేనంతగా ప్రజలు వణికిపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఊరికి కొత్తగా వస్తాడు సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు). కుప్పంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తూ, ఒకరోజు శరత్ రెడ్డి మనిషితో గొడవ పడి కాలేజీ నుంచి సస్పెండ్ అవుతాడు. సుబ్రహ్మణ్యం స్నేహితుడు పళని స్వామి(సునీల్). ఇతను సస్పెన్షన్ లో ఉన్న కానిస్టేబుల్ కావటంతో తన దగ్గర ఒక తుపాకీ ఉంటుంది. దానితో పాటు బ్లూ ప్రింట్ కూడా దొరుకుతుంది. అప్పటికే ఆర్ధికంగా ఇబందుల్లో ఉన్న, సుబ్రహ్మణ్యం తనకున్న మెకానికల్ జ్ఙానంతో గన్ తయారు చేయాలని అనుకుంటాడు. గన్ తయారీ మొదలు పెడతాడు. తరవాత కాలంలో తన ఉద్యోగం పోవటానికి కారణం అయిన వ్యక్తి తోనే చేతులు కలపాల్సి వస్తుంది. తన లైఫ్ లో విలన్ గా మారిన శరత్ రెడ్డి తో సుధీర్ ఎందుకు చేతులు కలిపాడు? ఊరు మొత్తం అసహ్యించుకునే శరత్ రెడ్డితో సుబ్రహ్మణ్యంకి పని ఏంటి? చివరికి సుబ్రహ్మణ్యం ఏం చేశాడు? ఆ ఊరు మొత్తానికి సుబ్రహ్మణ్యం దేవుడు ఎలా అయ్యాడు? అసలు ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి అన్న విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ: వేరే ఊరు నుంచి బతుకుతెరువు కోసం వచ్చి, ఎప్పటి నుంచో ఆ ఊరికి పట్టిన పీడని వదిలించి. ఊరి వాళ్ళ నమ్మకం గెల్చుకుని , చివరికి వారికి దేవుడవటం ఈ కథా సారాంశం. ఇదేం కొత్త కథ కాదు. ఇప్పటికే ఇదే కథతో చాలా సినిమాలు వచ్చాయి. మళ్ళీ పాత కథనే సుధీర్ ఎందుకు ఒప్పుకున్నాడు అనిపిస్తుంది. కాకపోతే రొటీన్ కథని, యాక్షన్ సీన్స్ తో ఎదో కొత్తగా చెప్పానన్న సాటిస్ఫేక్షన్ మిగుల్చుకున్నాడు దర్శకుడు. ఈ మధ్య కాలం లో వచ్చే కథల్లో అవసరానికి మించి యాక్షన్ సీన్స్, విధ్వంసం సృస్టిస్తున్నారు. మాఫియా, కత్తులు , తుఫాఖీలు ఉంటే సినిమా హిట్ అన్న భ్రమలో ఉన్నారు. హరోం హర కూడా అలానే అనిపిస్తుంది. కథలోకి వెళ్ళటానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. కథ మొదలయ్యేసరికి ఇంటర్వెల్ యాక్షన్ సీన్ వచ్చేస్తుంది. తరవాత కథలో కొంచెం వేగం పెంచాడు. ఎంత యాక్షన్ సినిమా అయినా ఎదో ఒక ఎమోషన్ ఉండాలి, అది ఈ సినిమాలో మిస్ అయ్యింది. యానిమల్ లాంటి భారీ యాక్షన్ సినిమాకి పట్టు ఎమోషన్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. జవాన్ , జైలర్, విక్రమ్ లాంటి భారీ యాక్షన్ సినిమాలు హిట్ అయ్యాయాంటే సెంటి మెంట్ కూడా వర్క్ అవుట్ అవటమే. కేవలం హీరోయిజం ఆశించి, యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి హరోం హర ఆ ఫీల్ ని ఇస్తుంది. అన్నిటికంటే ఈ మూవీలో చిన్న రివాల్వర్ నుంచి, రాకెట్ లాంచర్ వరకు వాడిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. ఎక్కడా ట్విస్ట్ లు లేవు. ఏం జరుగుతుందో ముందే ప్రేక్షకుడు ఊహించేస్తాడు.
నటీనటులు : సుధీర్ బాబు కథని ఎంచుకోవటం లో తడబడ్డాడు. దర్శకుడు చెప్పేటప్పుడు కొత్తగా అనిపించి ఉండొచ్చు కానీ, సినిమాలో కొత్తదనం ఏం లేదు. కానీ నటన పరంగా బానే సుధీర్ బాబు మెప్పించాడు. యాక్షన్ సీన్స్ కి తగ్గా ఫిజిక్ తో ఆకట్టుకున్నాడు. కుప్పం యాసతో మెప్పించాడు. హీరోయిన్ మాళవిక శర్మ కూడా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. మిగతా నటీ నటులు జయప్రకాశ్, రవి కాలే, అర్జున్ గౌడ లాంటి వాళ్లు తమ నటనతో పర్వా లేదనిపించారు. చాలా రోజుల తరువాత సునీల్ ఓ మంచి క్యారక్టర్ చేసాడు. అక్షర గౌడ పాత్ర చిన్నదే కానీ పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకుంది.
టెక్నికల్ : 1980 ల్లో కుప్పం ఎలా ఉండేదో రీ క్రియేట్ చేసి అద్భుతంగా చూపించ గలిగారు . ఇందుకు ఆర్ట్ టీమ్ కష్టాన్ని గుర్తించాల్సిందే. డైలాగ్ రైటర్ ని కూడా మెచ్చుకోకుండా ఉండలేము. కుప్పం యాస పర్ఫెక్ట్ గా వచ్చేలా మాటలు రాసారు. మూవీ మొత్తాన్ని సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నడిపించారు అనటంలో సందేహం లేదు. ఎడిటింగ్ బానే ఉంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఖర్చుకి వెనకాడకుండా తీసారని అర్థ మవుతోంది. లొకేషన్స్ న్యాచురల్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
సుధీర్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
అవసరానికి మించి యాక్షన్ సీన్స్
ఫైనల్ వర్దిక్ట్ : యాక్షన్ డ్రామా..