ENGLISH

కుర్రాళ్ళ దూకుడు.. సీనియర్లు ఎఫ్పుడు.?

02 September 2020-14:00 PM

కరోనా వైరస్‌ కారణంగా కనీ వినీ ఎరుగని స్థాయిలో సినీ పరిశ్రమలో అన్నీ స్తంభించిపోయాయి కొద్ది నెలలుగా. క్రమక్రమంగా సినిమా షూటింగులకు లైన్‌ క్లియర్‌ అవుతూ వచ్చింది. ఈ క్రమంలో కొన్ని సినిమాల షూటింగులు మళ్ళీ ప్రారంభమయినా, అవి ఎక్కువ రోజులు కొనసాగలేదు. అయితే, కేంద్రం తాజా గైడ్‌లైన్స్‌ తర్వాత యంగ్‌ హీరోలు ఒకరొకరుగా షూటింగులు తిరిగి ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే సాయిధరమ్ తేజ్‌ సీన్‌లోకి వచ్చేశాడు. సందీప్‌ కిషన్‌ కూడా రంగంలోకి దూకేశాడు. హీరోయిన్లూ హైద్రాబాద్‌లో ల్యాండ్‌ అయిపోయారు. షూటింగులు పునఃప్రారంభమవడంతో సినీ పరిశ్రమ మళ్ళీ కళకళ్ళాడబోతోంది.

 

అయితే, కరోనా వైరస్‌ ప్రభావం ఇంకా తగ్గలేదు గనుక, కొన్ని ప్రికాషన్స్‌ షూటింగ్‌ సందర్భంగా తీసుకోవాల్సిందే. పరిమిత సంఖ్యలో సిబ్బందితో మాత్రమే సినిమా షూటింగ్‌ జరపాల్సి వుంటుంది. నటీనటులు, టెక్నీషియన్స్‌.. ఇలా అన్నిటిలోనూ ‘సంఖ్యా పరంగా’ జాగ్రత్తలు తీసుకోక తప్పదు. యంగ్‌ హీరోలు రంగంలోకి దూకేశారు సరే.. కానీ, సీనియర్‌ హీరోలు రంగంలోకి దూకేదెప్పుడు.? మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్‌ తమ తమ సినిమాల్ని మధ్యలో ఆపేసుకోవాల్సి వచ్చింది కరోనా కారణంగా. నాగార్జున ఎలాగూ బిగ్‌బాస్‌ పనుల్లో బిజీగా వున్నాడనుకోండి.. అది వేరే సంగతి.

 

సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి పరిస్థితులు ఇంకాస్త అనువుగా మారితే తప్ప, సీనియర్‌ హీరోలు షూటింగ్‌కి అటెండ్‌ అయ్యే అవకాశం లేదట. అక్టోబర్‌ నుంచి సీనియర్‌ హీరోలు షూటింగులకు హాజరవుతారంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ALSO READ: స‌త్యాగ్ర‌హి అందుకే ఆపేశా: ప‌వ‌న్ క‌ల్యాణ్‌!