ENGLISH

Thank You Review: 'థ్యాంక్యూ' మూవీ రివ్యూ & రేటింగ్‌

22 July 2022-11:30 AM

టీనటులు: నాగచైతన్య, రాశి ఖన్నా, మాళవికనాయర్ , అవికా గోర్, ప్రకాష్ రాజ్
దర్శకత్వం : విక్రమ్ కె కుమార్
నిర్మాతలు: దిల్ రాజు
సంగీత దర్శకుడు: ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ: పిసి శ్రీరామ్
ఎడిటర్: నవీన్ నూలి


రేటింగ్‌: 2.5/5


దిల్ రాజు బ్యాన‌ర్ నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే అంతా ఎటెన్ష‌న్ లోకి వ‌చ్చేస్తారు. ఎందుకంటే.. క‌థాబ‌ల‌మున్న సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్స్ ఆ సంస్థ‌. ఎంత క‌మ‌ర్షియ‌ల్ సినిమా తీసుకొన్నా - అందులో ఏదో ఓ కొత్త పాయింట్ ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా, ఫీల్ గుడ్ సినిమా - ఈ రెండింటికీ ఆ సంస్థ పెట్టింది పేరు. `థ్యాంక్యూ` అనే పాజిటీవ్ టైటిల్ చూడాగానే... ఇది క‌చ్చితంగా ఫీల్ గుడ్, ఎమోష‌న‌ల్ డ్రామా అనే ఫీలింగ్ వ‌చ్చేస్తుంది.

 

విక్ర‌మ్ కె.కుమార్ లాంటి ఇంటిలిజెంట్ డైరెక్ట‌ర్ ఈ సినిమాని టేక‌ప్ చేయ‌డం, నాగ‌చైత‌న్య‌లాంటి ఇన్నోసెంట్ యాక్ట‌ర్ మూడు షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌డం.. ఈ సినిమా ప్రాధాన్య‌త‌నూ, ప్రాముఖ్య‌త‌నీ పెంచేశాయి. దాంతో అంచ‌నాలు పెరిగాయి. ఇన్ని ఆశ‌ల మ‌ధ్య `థ్యాంక్యూ` ఈ రోజు విడుద‌లైంది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది?  ప్రేక్ష‌కులంతా `థ్యాంక్యూ` చెప్పేలా ఉందా?  `నో థ్యాంక్స్‌` అంటూ లైట్ తీసుకొంటారా?


* క‌థ‌


అభిరామ్ (నాగ‌చైత‌న్య‌) అనే స‌క్సెస్‌ఫుల్ లైఫ్ స్టోరీ ఇది. త‌న ఎదుగుద‌ల వెనుక చాలామంది ఉంటారు. కానీ... త‌న ఉన్న‌తికి కార‌ణం త‌నొక్క‌డే అనే దృక్ప‌థంతో జీవిస్తుంటాడు. అన్నింట్లోనూ స్వార్థం. కెరీర్ త‌ప్ప మ‌రో ఆలోచ‌న ఉండ‌దు. తాను ఎద‌గ‌డానికి ఎవ‌రినైనా వాడుకొంటాడు. ఆ త‌ర‌వాత వ‌దిలేస్తాడు.

 

అయితే ఓ ద‌శ‌లో... ప్ర‌తి ఒక్క‌రి విజ‌యంలోనూ ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో చాలామంది పాత్ర ఉంటుంద‌ని, వాళ్లంద‌రికీ కృత‌జ్ఞ‌త చూపించాల్సిన బాధ్య‌త వాళ్ల‌కు త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని గ్ర‌హిస్తాడు. అందుకే... ఒక్క‌సారి త‌న జీవితంలోకి వెన‌క్కి తిరిగి చూసుకుంటాడు.

 

త‌న విజ‌యాల‌కు కార‌ణ‌మైన వాళ్లందిర‌కీ `థ్యాంక్స్‌` చెప్పుకోవాల‌న్న ఉద్దేశంతో ఓ ప్ర‌యాణం మొద‌లెడ‌తాడు. ఆ ప్ర‌యాణంలో పార్వ‌తి, శ‌ర్వాల‌ను క‌లుసుకుంటాడు. ఇంత‌కీ వాళ్లెవ‌రు?  వాళ్ల‌ని ఎందుకు క‌లుసుకోవాల‌నుకొన్నాడు?  క‌లుసుకొన్న త‌ర‌వాత ఏం జ‌రిగింది?  ఈ ప్ర‌యాణం త‌న‌ని ఎలా మార్చింది?  అనేదే మిగిలిన క‌థ‌.


* విశ్లేష‌ణ‌


థ్యాంక్యూ గురించి దిల్ రాజు ద‌గ్గ‌ర్నుంచి నాగ‌చైత‌న్య వ‌ర‌కూ ఏ ప్రెస్ మీట్ లో మాట్లాడినా ఈ క‌థే చెబుతున్నారు. దాంతో.. థ్యాంక్యూలో ఏముందో ప్రేక్ష‌కుల‌కు ముందే తెలిసిపోయింది. అయితే అదొక్క‌టే చాల‌దు. విక్ర‌మ్ కె.కుమార్ స్క్రీన్ ప్లే మ్యాజిక్‌, ట్విస్టులు, ఎమోష‌న్ సీన్స్‌... ఇవ‌న్నీ ఆశిస్తారు. అవ‌న్నీ ఉంటేనే... ఈ క‌థ‌కు ఓ కొత్త ఆపాదించ‌బ‌డుతుంది. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తూ.... ఇవేం థ్యాంక్యూలో క‌నిపించ‌వు. టీజ‌ర్‌లో, ట్రైల‌ర్‌లో, పాట‌ల్లో, ఈ సినిమాకి ప‌నిచేసిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు ఇచ్చిన స్పీచుల్లో ఏముందో.. తెర‌పై కూడా అదే ఉంది. కొత్తగా ఏం క‌నిపించ‌వు.


ఓ విజేత‌... త‌న ప్ర‌యాణంలో త‌న‌కు సాయం చేసిన వాళ్లంద‌రీ థ్యాంక్స్ చెప్పుకోవాల‌నుకోవ‌డం మంచి ఆలోచ‌నే. అయితే ఆ ఐడియా నిల‌బ‌డాలంటే మంచి సీన్లు ప‌డాలి. గుర్తుండిపోయే క్యారెక్ట‌రైజేష‌న్లు కావాలి. అవేం థ్యాంక్యూలో ఉండ‌దు. ఈ సినిమా నేరేష‌న్ కూడా చాలా ఫ్లాట్ గా ఉంటుంది. ముందు జీవితంలో ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించిన అభినిచూపిస్తారు. త‌న ఆటిట్యూడ్ వ‌ల్ల ఏం కోల్పోతున్నాడో అర్థం అవుతుంది. ఆ త‌ర‌వాత మెల్ల‌గా మార్పు వ‌స్తుంది. త‌న కోసం, త‌న ఉన్న‌తికి కార‌ణ‌మైన వాళ్ల కోసం తెలుసుకోవాల‌నుకుంటాడు. అంతే... క‌థ వెన‌క్కి వెళ్తుంది.


ఇది చాలా రొటీన్ స్క్రీన్ ప్లే. విక్ర‌మ్ కె.కుమార్ లాంటి స్క్రీన్ ప్లే జీనియ‌స్ కూడా ఇంత సాదా సీదా ట్రీట్మెంట్ ఎంచుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. తొలి అర‌గంట‌లో వ‌చ్చే కొన్ని ఎమోష‌న్ స‌న్నివేశాలు, ద్వితీయార్థంలో వ‌చ్చే కాలేజీ సీన్స్ ఓకే అనిపిస్తాయి. మూడు విభిన్న‌మైన గెట‌ప్పుల్లో చైతూని చూడ‌డం వ‌ర‌కూ కొంచెం కొత్త‌గాఉంటుంది. చైతూ ల‌వ్  స్టోరీ మ‌రీ ఫ్లాట్ గా ఉండ‌డం, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి స్కోప్ లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్‌.

 

క్లైమాక్స్‌లో మ‌ళ్లీ ఎమోష‌న్ ట‌చ్ ఇచ్చి శుభం కార్డు వేశారు. కానీ అప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో ఓపిక న‌శిస్తుంది. రెండు గంట‌ల‌నిడివి గ‌ల సినిమా ఇది. స్క్రీన్ ప్లేలో వేగం లేక‌పోవ‌డంతో మూడు గంట‌ల సినిమా చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది. ఎంట‌ర్‌టైన్‌మెంట్ కి ఈ క‌థ‌లో స్కోప్ ఉంది. ఎక్క‌డో ఓ చోట స‌ర‌దా ట్రాక్ రాసుకోవొచ్చు. కానీ.. ద‌ర్శకుడు ఆ దారిలో ఆలోచించ‌లేదు. సినిమా ఎప్పుడూ ఒకే మూడ్‌లో, సీరియ‌స్ టోన్‌లో సాగుతుంది. అది కూడా ఓ పెద్ద మైన‌స్‌.


* న‌టీన‌టులు


అభిరామ్‌గా చైతూ న‌ట‌న‌, త‌న క్యారెక్ట‌రైజేష‌న్ ఈ క‌థ‌కు బ‌లం. మూడు ర‌కాల గెట‌ప్పుల్లోనూ చ‌క్క‌గా కుదిరాడు. ముఖ్యంగా టీనేజ్‌లో చైతూ ముద్దుగా ఉన్నాడు. ఎమోష‌న్ సీన్స్‌లో ఓకే అనిపించినా, త‌న క్యారెక్ట‌ర్‌తో పాటు మిగిలిన క్యారెక్ట‌ర్లు బ‌లంగా ఉంటేనే ఎమోష‌న్ సీన్లు పండుతాయి. కానీ ఇక్క‌డ మిగిలిన పాత్ర‌ల‌న్నీ తేలిపోవ‌డంతో చైతూ ఏం చేసినా తెర‌కు స‌రిప‌డ‌లేదు.

 

రాశీఖ‌న్నా లుక్స్ బాగున్నాయి. కానీ త‌న‌కు మ‌రోసారి క‌న్నీళ్ల పాత్రే దొరికింది. మాళ‌విక చైతూ ప‌క్క‌న మ‌రీ ముదురుగా క‌నిపించింది. అవికాగోర్ ఓకే అనిపిస్తుంది. ప్ర‌కాష్‌రాజ్, మిర్చి సంప‌త్‌ లాంటి క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులున్నా చెప్పుకోద‌గిన పాత్ర‌లు కావు. మిగిలిన‌వాళ్ల‌వి వీళ్ల‌వి అతిథి పాత్ర‌లు అనుకోవాలంతే.


* సాంకేతిక వ‌ర్గం


త‌మ‌న్ ఒక్కోసారి... మ‌న‌సు పెట్టి ప‌నిచేస్తాడు. త‌న బీజియ‌మ్స్ తో ప్రాణం పోస్తాడు. అయితే ఈసారి పాట‌లు, ఆర్‌.ఆర్‌... ఈ సినిమాకి హెల్ప్ అవ్వ‌లేక‌పోయాయి. పైగా.. త‌మ‌న్ కూడా శ్ర‌ద్ధ పెట్ట‌లేద‌న్న ఫీలింగ్ వ‌స్తుంది. పి.సి. శ్రీ‌రామ్ ఫొటోగ్ర‌ఫీ గురించి చెప్పుకొనేదేముంది? ఆయ‌న విజువ‌ల్స్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. కానీ క‌థే తేలిపోయింది.

2 గంట‌ల షార్ప్ ర‌న్ టైమ్ క‌ట్ చేశారు.కానీ... సినిమా డ‌ల్ గా సాగుతున్న భావ‌న క‌లిగిందంటే సీన్లు స‌రిగా పండ‌లేద‌ని అర్థం. బీవీఎస్ ర‌వి రాసుకొన్న క‌థ‌లో పాయింట్ మాత్ర‌మే తీసుకొన్నాం.. అని దిల్ రాజు చెప్పాలి. ఆ పాయింటే తేలిపోతే.. మిగిలిన క‌థ ఎలా ఉందో అర్థం చేసుకోవొచ్చు.


* ప్ల‌స్ పాయింట్స్‌


చైతూ
ఫొటోగ్ర‌ఫీ
కొన్ని ఎమోష‌న్ సీన్లు


* మైన‌స్ పాయింట్స్‌


క‌థ‌
రొటీన్ స్క్రీన్ ప్లే
ఎమోష‌న్స్ పండ‌క‌పోవ‌డం
వినోదం లేక‌పోవ‌డం


* ఫైన‌ల్ వ‌ర్డిక్ట్:  నో 'థ్యాంక్స్‌'

ALSO READ: ఫ్లాప్ అయినా ప్ర‌భాస్ రిస్క్ చేస్తున్నాడే..?!