ENGLISH

పవన్ లాగితే ఆ కిక్కే వేరప్పా

10 March 2017-13:15 PM

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వస్తోన్న 'కాటమరాయుడు' సినిమా నుండి రెండో పాటొచ్చింది. మొదటి పాటే రికార్డు స్థాయిలో సంచలనాలు అందుకుంటోంది. ఇక ఈ పాట అయితే నిజంగానే లాగేస్తోంది. లాగే లాగే.. మనసు లాగే నీ వైపే లాగే..అంటూ సాగే ఈ పాట అందర్నీ అలరిస్తోంది. ఇటీవలే విడుదలైన 'మిర్రా మిర్రా మీసం' పాట ఉర్రూతలెత్తించింది. తాజాగా విడుదలైన ఈ పాట ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో. పాటే ఇలా ఉంటే పాటలోని చురుక్కులు చమక్కులతో స్క్రీన్‌ మీద పవర్‌ స్టార్‌ చేష్టలు ఇంకెంతలా ఆకట్టుకుని ఉంటాయో.. అంటూ అభిమానుల్లో ఆశక్తి పెరిగిపోతోంది. పవన్‌ మేనరిజంతో ఈ మెలోడి.. అబ్బో దుమ్ము రేపేస్తోంది. 'అత్తారింటికి దారేది' సినిమాలో 'నిన్ను చూడగానే.. నా చిట్టి గుండె..' పాట ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు. అలాగే ఈ సినిమాలోని ఈ పాట కూడా హుషారెత్తిస్తోంది. ఎప్పుడెప్పుడు ఈ పాటలో పవన్‌ని చూస్తామా అంటూ అభిమానులు ఊగిపోతున్నారు. కిషోర్‌ కుమార్‌ పార్థసాని దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. పవన్‌కి అత్యంత సన్నిహితుడైన శరత్‌ మరార్‌ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో లక్కీ మస్కెట్‌ శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ జంట ఇప్పటికే 'గబ్బర్‌ సింగ్‌' సినిమాతో మెప్పించింది. ఇప్పటిదాకా విడుదలైన ఈ సినిమాలోని పవన్‌ - శృతి జంట చూస్తుంటే 'గబ్బర్‌సింగ్‌'ను తలపిస్తోంది. ఫ్యాక్షన్‌ లవ్‌ స్టోరీ కథాంశంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ALSO READ: ఓ భావన.. నువ్వు గ్రేట్‌