ENGLISH

హమ్మయ్య.. టాలీవుడ్‌ 'ఊపిరి' పీల్చుకుంది

26 December 2020-17:16 PM

ఔను, తెలుగు సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. రికార్డు స్థాయి వసూళ్ళు.. అన్న మాట విన్పించింది. అందులో వాస్తవమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, సగటు సినీ అభిమాని డౌట్లు తీరాయి.. సినీ పరిశ్రమలోని ఆందోళన కూడా తగ్గింది. వసూళ్ళ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారంటే, ఓ సినిమా విజయానికి ఇంతకన్నా కొలమానం ఇంకేం కావాలి.?

 

9 నెలల తర్వాత వెండితెరపై తెలుగు సినిమాని చూశారు తెలుగు ప్రేక్షకులకు. సినిమా థియేటర్లలో సినీ ప్రముఖుల సందడి.. సినీ ప్రేక్షకుల హంగామా.. ఇవన్నీ 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమాతో చాన్నాళ్ళ తర్వాత ఎక్స్‌పీరియన్స్‌ చేస్తున్నాం. థియేటర్లలో విజిల్స్‌.. అభిమానుల హోరు.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? టాక్‌తో సంబంధం లేకుండా సినిమా గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. దానిక్కారణం.. మెగాస్టార్‌ చిరంజీవి నుంచి.. చాలామంది సినీ ప్రముఖులు ఈ సినిమా విజయవంతమవ్వాలని ఆకాంక్షించడమే.

 

'ఇది మన సినిమా' అని సినీ ప్రముఖులంతా భావించారు. అదే 'సోలో బ్రతుకే సో బెటరు' సినిమా విజయవంతమవడానికి కారణం. ఈ రోజు శనివారం, రేపు ఆదివారం.. నిన్ననే చాలా చోట్ల థియేటర్ల వద్ద 'హౌస్‌ ఫుల్‌' బోర్డులు కనిపించాయి. నిజానికి, ఇది సాధారణమైన విషయం. ఆ మాటకొస్తే, పూర్తిస్థాయిలో హౌస్‌ ఫుల్‌ బోర్డులు కన్పించాలి. కానీ, కొన్ని అనుమానాలు.. ఇంకొన్ని భయాలు (అన్నీ కరోనా కారణంగానే) థియేటర్లకు ప్రేక్షకులు రావడంలో కొంత ఇబ్బంది ఏర్పడింది. 'నైజాం, సీడెడ్‌..' అంటూ వసూళ్ళ గురించి మాట్లాడుకోవడం సినీ పరిశ్రమలో, ప్రేక్షకుల్లో విన్పించిందంటే.. తెలుగు సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకున్నట్టే.

ALSO READ: 'స‌లార్'‌.. అంత స్పీడా..?!