ENGLISH

కోలీవుడ్ లో విశాల్ పై వేటు

27 July 2024-19:39 PM

కోలీవుడ్ హీరో విశాల్ కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్  ఫాలోయింగ్ ఉంది. విశాల్ ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్ అవుతుంది. విశాల్ ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడతాడు. నచ్చనిది ఉంటే నచ్చలేదని మొహం మీద చెప్పేస్తాడు. దాపరికాలు లేకుండా మాట్లాడటం వలన తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాడు. ఈ మధ్య కూడా ఇలాగే వివాదం లో చిక్కుకున్నాడు. అది చివరికి  విశాల్ తో సినిమాలు తీయటం బ్యాన్ చేసేవరకు వెళ్ళింది. రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ విశాల్ 'తమిళనాడులో థియేటర్స్ అన్ని కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని, వాళ్ళు చెప్పినప్పుడే సినిమా రిలీజ్ చేయాలని, సినిమాలని వాళ్ళ కంట్రోల్ లో ఉంచుతున్నారని' విమర్శలు చేసాడు.


దీనితో హార్ట్ అయిన కొందరు విశాల్ ని టార్గెట్ చేస్తూ, విశాల్ నిర్మాత మండలిలో ఉన్నప్పుడు  నిధులు అక్రమంగా ఖర్చుపెట్టి దుర్వినియోగం చేసాడని ఆరోపించారు. అంతే కాకుండా  విశాల్ తో ఇక ముందు నిర్మాతలు ఎవరూ సినిమాలు తీయకూడదని, తమిళ నిర్మాతల సంఘం ఆదేశించింది. ఈ నిర్ణయం వెనక నిర్మాత  కథిరేసన్ ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న విశాల్ తమిళ నిర్మాత మండలిని ఉద్దేశించి డైరెక్ట్ గా పోస్ట్ పెట్టాడు.


విశాల్ తన ట్వీట్ లో 'మిస్టర్ కతిరేసన్ నేను ఖర్చు చేసిన నిధులు మీతో, మీ టీమ్ తో చర్చించి, అందరూ కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం అని మీకు తెలీదా. విద్య, వైద్య, బీమా, సీనియర్ నిర్మాతల కుటుంబ సంక్షేమం కోసం నిధులు ఉపయోగించామని మీకు తెలియదా. మీ ఉద్యోగాలను సక్రమంగా చేయండి, పరిశ్రమ కోసం చాలా చేయాల్సి ఉంది. డబల్ ట్యాక్సేషన్, థియేటర్ మెయింటెనెన్స్ చార్జీలు అంటూ పరిష్కరించటానికి చాలా సమస్యలు ఉన్నాయి. అసలు సినిమాలే తీయని నిర్మాతలు మీరు. నా సినిమాలు ఎలా ఆపుతారు, నేను సినిమాలు చేస్తూనే ఉంటాను. దమ్ముంటే నన్ను ఆపడానికి ప్రయత్నించండి' అని ట్వీట్ చేసాడు.