ENGLISH

సినిమా కష్టాలెప్పుడు తీరతాయో.!

18 December 2020-16:09 PM

ఓటీటీ వల్ల లాభం లేదు.. సినిమా థియేటర్లేమో తెరచుకోవడంలేదు.. ఇలాగైతే సినిమా కష్టాలు తీరేదెలా.? సుప్రీం హీరో సాయి దరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన 'సోలో బ్రతుకే సో బెటర్‌' సినిమా ఈ నెల 25న విడుదల కానున్న విషయం విదితమే. అయితే, ఇంకా తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు పూర్తిగా తెరచుకోలేదు. దాంతో, చిన్న సినిమాల విడుదల అయోమయంలో పడింది.

 

అటు, ఓటీటీ తమవైపు చూడక.. ఇటు సినిమా థియటేర్లు తెరుచుకోక చిన్న సినిమాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. 'కొందరు నిర్మాతలు, సినిమా థియేటర్లు తెరవడానికి ఒప్పుకోవడంలేదు. ఈ విషయమై కోర్టుకు వెళతాం..' అంటూ నిర్మాత నట్టికుమార్‌ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా థియేటర్లు తెరవాలని ఏ నిర్మాత కోరుకోడు.? కానీ, ప్రస్తుతం పరిస్థితులు కొంత గందరగోళంగా వున్నాయి.పూర్తిస్థాయిలో సినిమా థియేటర్లు తెరిస్తేనే, సినిమాకి మనుగడ వుంటుంది. సగం ఆక్యుపేషన్‌తో సినిమా థియేటర్లు తెరిస్తే ఎవరికి లాభం.? సగం టిక్కెట్లు తెగితే, అటు థియేటర్లు.. ఇటు నిర్మాతలూ నష్టపోవడం ఖాయం. భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి, ఇంత రిస్క్‌ ఎందుకు నిర్మాతలైనా చేస్తారు.? ఈ గందరగోళానికి ముగింపు పడాలంటే, ప్రేక్షకులు ధైర్యంగా సినిమా థియేటర్లకు రావాలి. అన్నట్టు, ఓటీటీ జోరు కూడా బాగా తగ్గిపోయింది.

 

ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు మంచి టాక్‌ రాబట్టుకోవడంలో విఫలమవుతుండడంతో.. ఓటీటీ మీద ఆశలొదిలేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ గందరగోళం ఎప్పుడు కొలిక్కి వస్తుందోగానీ.. ప్రస్తుతానికైతే సినీ పరిశ్రమ కనీ వినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నది మాత్రం నిర్వివాదాంశం.

ALSO READ: ఉమా ప్రేమ‌న్ బ‌యోపిక్‌... త్వరలో....