ENGLISH

'టాయిలెట్‌'తో సంచలనాలు సృష్టిస్తున్న అక్షయ్‌కుమార్‌

12 June 2017-17:04 PM

ట్రైలర్‌ విడుదలైన కాస్సేపట్లోనే హిట్స్‌ పరంగా దూసుకుపోతోంది 'టాయిలెట్‌' సినిమా. మామూలుగా 'టాయిలెట్‌' అన్న పదాన్ని అందరిలో ఉన్నప్పుడు వాడలేం. అంత నామోషీ అనిపిస్తుంది ఆ పేరు పలకడానికి. కానీ ఓ స్టార్‌ హీరో, ఎలాంటి బేషజాలూ ప్రదర్శించకుండా 'టాయిలెట్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ' అనే సినిమాలో నటించడానికి ముందుకు రావడం అభినందనీయం. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ ఈ సాహసానికి శ్రీకారం చుట్టాడు. మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇంట్లో బాత్రూమ్‌ లేకపోవడం అనే సామాజిక రుగ్మతపై పోరాటమే ఈ సినిమా కథాంశం. విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి ఈ ట్రైలర్‌కి. విద్యాబాలన్‌, అమితాబ్‌ బచ్చన్‌ వంటి తారలు బహిరంగ మల మూత్ర విసర్జనకు వ్యతిరేకంగా పలు ప్రకటనల్లో నటించారు. ఆ తరహా ప్రకటనల్లో నటించడమే చాలా పెద్ద విశేషం అనుకుంటే, అక్షయ్‌కుమార్‌ ఏకంగా సినిమాలోనే నటించేశాడు. భూమి పెండేర్కర్‌, అక్షయ్‌కుమార్‌ సరసన నటించింది. బాలీవుడ్‌లో మాత్రమే ఇలాంటి సాహసాలు జరుగుతూ ఉంటాయి. ఈ 'టాయిలెట్‌' సినిమా మిగతా సినీ పరిశ్రమలకు కూడా ఇన్సిపిరేషన్‌ కావాలి. ఇలాంటి సామాజిక రుగ్మతలు అనేకం ఉన్నాయి సమాజంలో. వాటి విషయంలో స్టార్‌ హీరోలు ఇలా ముందుకు వస్తే ఎంతో కొంత వాటిపై ప్రజలకు అవగాహన ఏర్పడుతుంది. తద్వారా అటువంటి సామాజిక రుగ్మతల నుండి కొంచెం అయినా ఉపశమనం పొందే అవకాశాలుంటాయి. ఈ సినిమా ఆగస్ట్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

ALSO READ: ఆ అందమైన పెదాలకు ఏమయ్యింది?