తెలుగులో సంగీత దర్శకులంటే ఇద్దరి పేర్లే ప్రముఖంగా వినపడతాయి. ఒకరు దేవిశ్రీ ప్రసాద్, ఇంకొకరు తమన్. పెద్ద సినిమాలంటే... కచ్చితంగా ఇద్దరిలో ఎవరో ఒకరు మ్యూజిక్ ఇవ్వాల్సిందే. అప్పుడప్పుడూ చిన్న, మీడియం రేంజు సినిమాలకూ వీళ్ల పేర్లు తెరపై కనిపిస్తాయి. టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే సంగీత దర్శకులు వీళ్లే. అయితే వీళ్ల రికార్డుని అనిరుథ్ బ్రేక్ చేశాడు. ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఈ సినిమా కోసం ఏకంగా 4.5 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్టు సమాచారం. తమన్, దేవిశ్రీలకు 3 కోట్లు అందుతోంది. వాళ్లకంటే కోటిన్నర ఎక్కువ. అలాగని... అనిరుథ్ తెలుగులో అద్భుతాలేం చేయలేదు. తమిళంలో కొన్ని సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించి, కలకాలం నిలిచిపోయే ట్యూన్లు ఇచ్చాడు. తెలుగులో మాత్రం ఆ మ్యాజిక్ కనిపించలేదు. గ్యాంగ్ లీడర్, అజ్ఞాతవాసి లాంటి చిత్రాలకు అనిరుథ్ సంగీత దర్శకుడు. ఆ సినిమాలు ఫ్లాప్స్. దాంట్లో సూపర్ హిట్ గీతాలేం లేవు. అయినా సరే, అనిరుథ్ ని ఇన్ని డబ్బులిచ్చి ఎందుకు పెట్టుకుంటున్నారో, నిర్మాతలకే తెలియాలి.
ALSO READ: పుష్ష తొలి పాట: దాక్కో దాక్కో మేక రివ్యూ