ENGLISH

'బంగార్రాజు' మూవీ రివ్యూ & రేటింగ్!

14 January 2022-14:00 PM

నటీనటులు : నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి, రావు రమేష్ తదితరులు
దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ కురసాల
నిర్మాణం : అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫర్ : యువరాజ్
ఎడిటర్ : విజయ్ వర్ధన్ కె


రేటింగ్: 2.75/5

 

‘సోగ్గాడే చిన్నినాయనా’తో 2016 సంక్రాంతి హిట్ అందుకున్నారు నాగార్జున. ఈ సినిమాలో ‘బంగార్రాజు’ పాత్ర సూపర్ హిట్ గా నిలిచింది. సినిమాలో వినోదం బంగార్రాజు పాత్రే పంచింది. ఇప్పుడు ‘బంగార్రాజు’ పేరుతో సీక్వెల్‌ ని రెడీ చేశారు నాగ్. సీక్వెల్‌ లో నాగచైతన్య రూపంలో స్పెషల్ ఎట్రాక్షన్ చేరింది. సంక్రాంతి కానుకగా వచ్చిన బంగార్రాజు ఎలాంటి వినోదం పంచింది ? ఈ సంక్రాంతి నాగార్జునకి కలిసొచ్చిందా ? ఇంతకీ ఏమిటి బంగార్రాజు కథ


కథ:


ఒక్కసారి  'సోగ్గాడే చిన్నినాయ‌నా' క‌థ గుర్తుకు తెచ్చుకుంటే..  కొడుకు రాము (నాగార్జున‌), కోడ‌లు (లావణ్య త్రిపాఠి) ల‌ని క‌లిపి వాళ్ల స‌మ‌స్యని ప‌రిష్కరించి మళ్ళీ పైకి వెళ్తాడు బంగార్రాజు (నాగార్జున‌). ఇక్కడ నుంచే సీక్వెల్ కథ మొదలౌతుంది. 


ఈసారి మ‌న‌వ‌డు చిన బంగార్రాజు(నాగ‌చైత‌న్య) కోసం బంగార్రాజు మళ్ళీ కింద‌కి రావ‌ల్సి వ‌స్తుంది. చిన బంగార్రాజు శివపురంలో ప్లే బాయ్. స్థానిక సర్పంచ్ నాగలక్ష్మి ( కృతి శెట్టి) దగ్గర మాత్రం చిన బంగార్రాజు పప్పులు ఉడకవు.


ఇలా ఉండగా శివపురం గుడిలో ఉన్న నిధులపై క‌న్నేసిన కొందరు చిన బంగార్రాజుని చంపాల‌నే కుట్ర చేస్తారు. అప్పుడు చిన బంగార్రాజులోకి ఆత్మగా దూరి అత‌నికి పెద బంగార్రాజు ఎలా సాయం చేశాడు?  భార్య స‌త్యభామ (ర‌మ్యకృష్ణ) కోరిక మేర‌కు చిన్న బంగార్రాజునీ, నాగ‌ల‌క్ష్మిని ఎలా క‌లిపాడు? దేవుడి నిధులపై క‌న్నేసిన దుష్ట శ‌క్తులకు ఎలా బుద్ది చెప్పాడు అనే మిగ‌తా క‌థ‌


విశ్లేషణ:


‘సోగ్గాడే చిన్నినాయనా’లో మ్యాజిక్ జరిగింది. పల్లెటూరు వాతావరణం, ‘బంగార్రాజు’ పాత్ర, పాటలు.. అన్నీ చక్కగా కుదిరాయి. చనిపోయిన మనిషి యమలోకం నుంచి మళ్ళీ కిందకు రావడం లాంటి కథలు పాతవే అయినా ‘బంగార్రాజు’ పాత్ర పంచిన వినోదం కొత్తగా అనిపించింది. టోటల్ గా సినిమా ప్రేక్షకులకు నచ్చింది. ఇదే సెటప్ లో సీక్వెల్ ని సెట్ చేశారు. అయితే ఆ సెటప్ లో మ్యాజిక్ మిస్ అయ్యింది. సోగ్గాడే చిన్నినాయనా’లో 'బంగార్రాజు’ పాత్ర చుట్టూ ఒక ఎమోషన్ వుంటుంది. ఆ ఎమోషన్ సీక్వెల్ లోకి వచ్చేసరికి వర్క్ అవుట్ కాలేదు.


‘సోగ్గాడే చిన్నినాయనా' ఎక్కడ ఎండ్ అయ్యిందో అక్కడ నుంచే ‘బంగార్రాజు’ మొదలౌతుంది. ‘బంగార్రాజు’ పాత్రని గుర్తు చేస్తూ ప్లేయ్ బాయ్ గా నాగచైతన్య పరిచయం కావడం వరకూ బాగానే వుంది. అయితే రెండు సీన్లు గడిచిన తర్వాత బంగార్రాజు’లో ఇంతకంటే విషయం లేదనే సంగతి అర్ధమైపోతుంది. ప్రథ‌మార్థం అంతా  ప్లేయ్ బాయ్ చిన‌బంగార్రాజు, ఊరి స‌ర్పంచ్ అయిన నాగ‌ల‌క్ష్మి చుట్టూ  టైమ్ పాస్ సీన్లతోనే నడిపే ప్రయత్నం చేశాడు దర్శకుడు.


అయితే ఆ కామెడీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. సెకండ్ హాఫ్ లో కూడా ఇదే పంధా కొనసాగిస్తాడు బంగార్రాజు. ఎక్కడ మలుపులు వుండవు. తర్వాత వచ్చే సీన్ ముందే ప్రేక్షకుడి ఊహకు అందిపోతుంది. ఇక సినిమాకి ముగింపు కూడా చాలా రొటీన్ గా వుంటుంది. పండగ , పల్లెటూరి వాతావరణం, కలర్ ఫుల్ సాంగ్ వరకూ ఓకే కానీ సోగ్గాడే చిన్నినాయనా’ని గుర్తు తెచ్చుకుంటే మాత్రం ‘బంగార్రాజు’ బోరింగ్ అనిపిస్తాడు. 

  
నటీనటులు:


‘బంగార్రాజు’ పాత్రలో నాగ్ ని తప్ప మరెవరినీ ఊహించలేం. ఆయన కోసం డిజైన్ చేసిన పాత్రది.  ‘బంగార్రాజు’గా కనిపించిన ప్రతి ఫ్రేమ్ లో నాగ్ సూపర్ ఎనర్జీతో కనిపిస్తాడు. మరోసారి గోదారి యాస నాగ్ అద్భుతంగా పలికారు. చిన్న ‘బంగార్రాజు’గా నాగచైతన్య కొత్తగా అనిపించినా ఇంకాస్త ఈజ్ తో ఆ పాత్ర చేసుండాలనిపిస్తుంది. ‘బంగార్రాజు’ మేనరిజమ్స్ ని బాగానే పలికించాడు. పాటల్లో హుషారుగా కనిపించాడు. కృతి శెట్టి ఎప్పటిలానే అందంగా కనిపించింది. అయితే ఆ పాత్రలో పెద్ద బలం లేదు. రమ్యకృష్ణ మరోసారి అదరగొట్టింది. హుందాగా కనిపించింది. రావ్ రమేష్, సంపత్ రాజ్, వెన్నల కిషోర్ .. పరిధి మేర చేశారు. 


సాంకేతికంగా:


అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. వినడానికి చూడ్డానికి పాటలు కలర్ ఫుల్ గా వున్నాయి. నేపధ్య సంగీతం కూడా బావుంది. కెమరాకి మంచి మార్కులు పడతాయి. ప్రతి ఫ్రేము అందంగా కనిపించింది. పండక్కి సరిపడా కలర్ ఫుల్ విజువల్స్ వున్నాయి. ఎడిటర్ ఇంకాస్త శార్ఫ్ చేయాల్సింది.  గ్రాఫిక్స్ ఓకే. రైటింగ్ టేబుల్ మీద ఇంకాస్త బలంగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.

 

ప్లస్ పాయింట్స్


నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి 
కలర్ ఫుల్ సాంగ్స్ , విలేజ్ నేపధ్యం 
కొన్ని బంగార్రాజు మార్క్ సీన్లు 


మైనస్ పాయింట్స్


రొటీన్ కథ, కథనం 
బోరింగ్ స్క్రీన్ ప్లేయ్ 


ఫైనల్ వర్దిక్ట్ : మంచి ఫెస్టివల్ మూవీ!

ALSO READ: పాన్ ఇండియా హీరోయిన్ త‌నేనేమో..?