ENGLISH

రొమాన్స్‌ టూ మచ్‌ అయిపోతోంది బిగ్‌బాస్‌!

16 September 2020-17:00 PM

బిగ్‌బాస్‌కి రొమాంటిక్‌ టచ్‌ కొత్తేమీ కాదు. అయితే, ఈసారి అది వెగటు పుట్టించే స్థాయికి వెళ్ళిపోతోందా.? అన్న అనుమానం కలుగుతోంది. గత సీజన్‌లో పునర్నవి - రాహుల్‌ మధ్య రొమాన్స్‌ నడిచింది. అయితే, అదంతా కెమెరాల వరకే పరిమితమని ఆ తర్వాత తేలిపోయింది. ఈసారి మాత్రం బిగ్‌ హౌస్‌లో అడ్డగోలుగా రొమాంటిక్‌ ట్రాకులు నడిచేస్తున్నాయి. ఎవరు ఎవరితో లవ్‌లో పడుతున్నారో తెలియక బుల్లితెర వీక్షకులు జుట్టు పీక్కోవాల్సి వస్తోంది. ‘అంత లేదక్కడ’ అని అందరికీ అర్థమవుతున్నా, బలవంతంగా ఆ రొమాంటిక్‌ ట్రాక్‌ని ఆడియన్స్‌ మీద రుద్దేస్తున్నారు.

 

అఖిల్‌, అబిజిత్‌ ఈ ట్రాక్‌లో కామన్‌ యాక్టర్స్‌. మోనాల్‌ - హారిక చుట్టూ అకిల్‌, అబిజిత్‌ తిరుగుతూ ‘ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ’ని మనకు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అబ్బే, అస్సలు వర్కవుట్‌ అవడంలేదిది. అసలేం జరుగుతోందో అర్థం కానంత గందరగోళంగా ఈ ట్రాక్స్‌ నడుస్తున్నాయి. బిగ్‌హౌస్‌లోకి వెళ్ళేముందు, అఖిల్‌ ‘మోనాల్‌ని పెళ్ళాడతా’ అని నాగ్‌ అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చిన విషయం విదితమే. దాన్ని నాగ్‌, వీకెండ్‌ ఎపిసోడ్‌లోనూ ప్రస్తావించాడు. ఏదిఏమైనా, ఈ రొమాంటిక్‌ ట్రాక్‌ బాగా బెడిసికొట్టేస్తోంది. ‘చూడలేకపోతున్నాం మొర్రో..’ అంటూ నెటిజన్లు ఎపిసోడ్‌ జరుగుతున్న సమయంలోనే కుప్పలు తెప్పలుగా కామెంట్స్‌ పెడుతున్నారు. రొమాంటిక్‌ ట్రాక్‌ కారణంగా ఇంగ్లీష్‌, హిందీ పదాలు చాలా ఎక్కువగా వచ్చేస్తుండడంతో ‘ఇది తెలుగు బిగ్‌బాస్‌లా లేదు, హిందీ లేదా ఇంగ్లీష్‌ బిగ్‌బాస్‌లా వుంది’ అంటున్నారు ఆడియన్స్‌.

ALSO READ: శ్రావ‌ణి కేసు.. నిర్మాత అరెస్ట్‌